
'కాళోజీ నాగొడవ... ప్రజల గొడవే'
ప్రజల గోడవను తన గోడవగా ప్రజా సమస్యలు, సమాజంలోని సమస్యలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను వ్యతిరేకించి రచనలు...
సాక్షి,సిటీబ్యూరో: ప్రజల గోడవను తన గోడవగా ప్రజా సమస్యలు, సమాజంలోని సమస్యలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను వ్యతిరేకించి రచనలు, ఉపన్యాసాల ద్వారా వారి దృష్టికి తీసుకువచ్చిన మహా వ్యక్తి కాళోజీ అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కితాబు నిచ్చారు. గురువారం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవం, పురస్కారం -2015 ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజీ ఎవరికీ బయపడని ధీరత్వం ఉన్న వ్యక్తి అని చె ప్పారు. ప్రాంతాల వారిగా మాండలికాలు ఉన్నాయని, తెలంగాణ మాండలికం కూడా భాషే అని తన కవిత్వం ద్వారా స్పష్టం చేశారని తెలిపారు.కాళోజీపై సీఎం కేసీఆర్ గౌరవంతో తెలంగాణ రాగానే కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కాళోజీ కళాక్షేత్రానికి భూమి, నిధులు కేటాయించామన్నారు. అందులో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించి, భావితరాలు కాళోజీని నిరంతరం గుర్తుంచుకొనేలా చేస్తామని తెలిపారు. ఆయనలా ప్రశ్నించే తత్వం, ధైర్యం అలవరచుకొంటే సమాజాన్ని ప్రక్షాళన చేయటం సుసాధ్యమేనన్నారు. తెలంగాణ మాండలికం కాదు..భాష అని చెప్పిన మహనీయుడు కాళోజీ అని కొనియాడారు.
ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రత్యేక పరిస్థితులు(ఎమర్జెన్సీ) ఉన్న రోజుల్లో ధైర్యంగా ప్రజల్లోకి తిరిగి తన రచనలు చదివి వినిపిస్తూ ప్రసంగాలు చేసేవారన్నారు. తాను విద్యార్థిగా ఉన్న రోజుల్లో కాళోజీతో కలిసి పని చేశానని తెలిపారు. రాజ్యహింసకు వ్యతిరేకంగా 'మూమెంట్ ఫర్ అప్రషన్' స్థాపించారన్నారు. అన్ని వర్గాల ప్రజల ప్రక్షాన నిలిచిన వారికి ఎప్పటికైనా సమున్నత గౌరవం లభిస్తుందనడానికి.. ఈ ఉత్సవమే తార్కాణమని చెప్పారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ కాళోజీ పేరిట భాషాదినోత్సవం నిర్వహించుకోవటం గర్వకారణమన్నారు. కాళోజీ కవిత్వం, ఉపన్యాసాలు ప్రజల్ని చైతన్య పరిచాయన్నారు. ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేసిన మహనీయుడు కాళోజీఅని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ 'అగిపోయిన ముందుకు సాగలేవు నీవు' అనే కాళోజీ కవితను స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విముక్తి పోరాటం కోసం అందరికీ అర్థమయ్యే కవిత్వం రాసిన మహామనిషి కాళోజీ అని కొనియాడారు.