కత్తి అంచున కలంతో కవాతు | Newyork daily tribune discovers about karl marx | Sakshi
Sakshi News home page

కత్తి అంచున కలంతో కవాతు

Published Thu, May 5 2016 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

కత్తి అంచున కలంతో కవాతు

కత్తి అంచున కలంతో కవాతు

‘న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్’ వ్యాసాలలో మార్క్స్ భారతదేశంలో బ్రిటిష్ పాలనను సునిశితంగా పరిశీలించారు.  రైల్వేల నిర్మాణం తీసుకొచ్చే ప్రగతి ద్వారా సామాజిక అంతరాలు కొంత తగ్గుతాయని భావించారు. ‘‘భారత ప్రజల మధ్య ఉన్న విభేదాల వల్ల ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజల భాగస్వామ్యం సంపూర్ణంగా లేకుండా పోయింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు బ్రిటిష్ వారికి సహకరించారు. దానితో ఆ తిరుగుబాటును అణచివేయడం బ్రిటిష్ వారికి సాధ్యపడింది’’ అని ఆయన విశ్లేషించారు.
 
 కార్మికుడి చెమటచుక్కల్లోనే పెట్టుబడిదారుడి దోపిడీ మూలాలున్నాయని తేల్చిచెప్పిన కార్ల్ మార్క్స్‌లోని మరో కోణం ఆయన జర్నలిస్టుగా పని చేయడం. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంపై ‘‘న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్’’కు రాసిన ఒక వ్యాసంలో ఆయన ఆనాటి భారతదేశ పరిస్థితులను ఇలా వర్ణించారు:‘‘ఇండియాలో బ్రిటిష్ పరిపాలన దౌర్జన్యాల పుట్టగా ఉందనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ప్రజలను రకరకాల పద్ధతుల్లో అన్యాయానికి, అణచివేతకు గురిచేసిన విదేశీ పాలకులను పారదోలడానికి ఆ దేశ ప్రజలు ప్రయత్నించడం సమర్థనీయమే. నిష్పక్షపాతులైన విజ్ఞులందరూ ఈ విషయంలో సానుకూలంగానే ఉంటారని భావిస్తాను. వారి దుర్మార్గాలను హిందూ దేశీయులపై నెట్టివేస్తూ, బ్రిటిష్ పాలకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పైగా ప్రజల తిరుగుబాటును ఒక నేరంగా చూపిస్తున్నారు.’’
 
 పాత్రికేయునిగా మార్క్స్
 కార్ల్ మార్క్స్ లండన్‌లో నివసిస్తున్న సమయంలో 1853 నుంచి 1858 వరకు అమెరికాలోని న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్‌కు రాసిన దాదాపు 500 వ్యాసా లలో ఇండియాపై రాసిన వ్యాసాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటివలన్లే భారతదేశంలో ఆనాడు నెలకొన్న ఆర్థిక, రాజకీయ పరిస్థితులను మార్క్స్ దృష్టితో మనం చూడగలుగుతున్నాం.  ముఖ్యంగా 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి కారణాలను, తదనంతర పరిణామాలను విశ్లే షిస్తూ ఆయన రాసిన వ్యాసాలు పుస్తక రూపంలో వచ్చాయి. మార్క్స్ మిత్రుడు, కమ్యూనిస్టు సిద్ధాంత కర్తలలో ఒకరైన ఫ్రెడరిక్ ఎంగెల్స్ కూడా అదే పత్రికలో భారతదేశ స్థితిగతులపై ఏడు వ్యాసాలు రాశారు. నిజానికి కార్ల్ మార్క్స్ తన విశ్వవిద్యాలయ విద్య ముగిసిన తర్వాత చేపట్టినది పాత్రికేయ వృత్తినే. మార్క్స్ చేసిన మొదటి, ఏకైక ఉద్యోగం కూడా అదే.
 
 1818లో జర్మనీలోని ట్రయర్ నగరంలో జన్మించిన కార్ల్ మార్క్స్ అక్కడే పాఠశాల విద్యను పూర్తిచేశారు. 1836 అక్టోబర్ 22న బెర్లిన్ యూనివర్సిటీలో న్యాయశాస్త్ర విద్యలో చేరారు. ఆ తర్వాత తత్వశాస్త్రం పట్ల ఆకర్షితుడై 1939లో ‘‘డెమొక్రటస్-ఎపిక్యూరస్ ప్రకృతి తత్వాల మధ్య వ్యత్యాసం’’ అన్న అంశంపై పరిశోధన ప్రారంభించి, 1841 నాటికి ముగించారు. అదే ఏడాది ఏప్రిల్‌లో ట్రయర్‌కు తిరిగి వచ్చాడు. ప్రష్యాలోని రైన్ రాష్ట్రం నుంచి 1842లో ‘‘రైనిష్ జెటుంగ్’’ అనే పత్రిక ప్రచురణ మొదలైంది.
 
 మార్క్స్ చొరవను, రచనాశక్తిని చూసిన ప్రచురణకర్తలు ఆ పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వ హించాలని ఆయనను ఆహ్వానించారు. 1842 అక్టోబర్‌లో ఆయన ‘‘రైనిష్ జెటుంగ్’’ సంపాదక బాధ్యతలు స్వీకరించారు. తన విజ్ఞానదాయకమైన, రాజకీయ విశ్లేషణలతో మార్క్స్ ఆ పత్రికకు ఊపిరి అయ్యాడు. అయితే మొదటి నుంచే కమ్యూనిస్టు పత్రికగా ముద్రపడ్డ ఆ పత్రికను  1843 మార్చి 31న ప్రభుత్వం నిషేధించింది. యజమానులు ప్రభుత్వంతో రాజీపడగా మార్క్స్ దానికి రాజీనామా చేశారు. సంపాదకుడిగా తాను.. సమాజంలో భౌతికమైన కోర్కెలు ఎంత పెద్ద పాత్రను నిర్వహిస్తాయో, బూర్జువా వర్గ కపటత్వం, కుట్రతత్వం ఎలాంటివో తెలుసుకున్నానని అన్నాడు.
 
 ప్రష్యాలోని కొలోన్‌లో ఉద్యోగం వదులుకోవడంతో మార్క్స్‌కి జీవనాధారం కావాల్సి వచ్చింది. అందుకే పారిస్ వెళ్ళాలనుకున్నాడు. 1843 అక్టోబర్‌లో పారిస్ చేరుకున్న కార్ల్ మార్క్స్ కుటుంబం రాజకీయ ప్రవాస జీవితాన్ని మొదలు పెట్టింది. 1844 జనవరిలో మార్క్స్ సంపాదకత్వాన ‘‘ఫ్రెంచి జర్మన్ ఇయర్ బుక్’’ను ప్రారంభించారు. ఆ కాలంలో ప్రచురితమైన వ్యాసాలు, లేఖలు చూస్తే ఆయన విప్లవ ప్రజాతంత్ర వాదం, కమ్యూనిజం వైపు మొగ్గాడని అర్థం అవుతుంది. అయితే, 1845 జనవరిలో పారిస్ ప్రభుత్వం ఆయన రచనలకు బెదిరి, 24 గంటల్లో దేశం విడిచి వెళ్ళాలని ఆదేశించింది. దానితో మార్క్స్ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ చేరారు.
 
 మొదటి కమ్యూనిస్టు విప్లవ పత్రిక
 1845 నుంచి 1948 వరకు కార్ల్ మార్క్స్ ఎన్నో ముఖ్యమైన పుస్తకాలు రాశారు. అందులో ముఖ్యమైనది కమ్యూనిస్టు ప్రణాళిక. ఇది ఫిబ్రవరిలో అచ్చయ్యింది. అయితే ఏప్రిల్‌లో మార్క్స్, ఎంగెల్స్‌లు ప్రష్యాలోని కొలోన్ చేరుకున్నారు. అక్కడ కమ్యూనిస్టు లీగ్ చాలా శక్తివంతమైన సంస్థగా ఎదిగింది. దాని తరఫున మార్క్స్ 1848, జూన్ 1 నుంచి ‘‘నియోరైనిష్ జెటూంగ్’’ అనే పత్రికను ప్రారంభించాడు. ఎంగెల్స్ దీని ప్రచురణ బాధ్యతలను చూడడంతో పాటు, ఎన్నో వ్యాసాలను రాశారు. ‘‘అవి విప్లవాత్మక దినాలు. అలాంటి రోజుల్లో దిన పత్రికల్లో పనిచేయడం ఎంతో ఉల్లాసకరమైన పని. ప్రతి మాటా ఎంత శక్తివంతమైందో ప్రత్యక్షంగా అలాంటి సమయంలోనే తెలుస్తుంది.
 
 తమ వ్యాసాలు చేతి బాంబుల్లా పేలడాన్ని రచయితలు గమనిస్తారు.’’ అంటూ ఎంగెల్స్ ఆ పత్రిక ప్రాముఖ్యాన్ని తెలిపారు. 1849 మే తిరుగుబాట్లను రక్తపాతంతో అణచివేయడం మొదలు పెట్టిన ప్రష్యన్ మిలిటరీ రాజ్యం మార్క్స్ సంపాదకత్వంలోని ‘‘నియోరైనిష్ జెటూంగ్’’పై దాడికి దిగింది. 24 గంటలలోగా ప్రష్యాను వదిలిపెట్టవలసిందిగా మార్క్స్‌ను ఆదేశించింది. పోలీసుల వేధింపులు ఎక్కువ కాగా ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ పత్రిక మూతపడింది. పత్రికను మూసివేస్తూ చివరి రోజున ఎంగెల్స్ ‘‘మేము మా కోటను స్వాధీనం చేయాల్సి వస్తున్నది.
 
 అయితే మా ఆయుధాలు, సామాను మూటగట్టుకొని ఉపసంహరించుకుంటాం. మా పతాకాన్ని ఎగురవేస్తూనే ఉంటాం. ఆఖరి సంచిక బ్యానర్ అరుణ పతాకమే’’ అని రాశారు. శాస్త్రీయ కమ్యూనిజం ప్రాతిపదికగా, విప్లవోద్యమం కోసం కృషి చేసిన మొదటి దినపత్రిక చరిత్ర అలా ముగిసింది. మార్క్స్ ముఖ్యమైన పనులన్నీ ముగించుకుని జర్మనీకి వెళ్ళాడు. అక్కడా పరిస్థితులు అనుకూలంగా లేక పారిస్‌కు వెళ్ళాడు. అక్కడా పరిస్థితులు బాగా లేక తప్పని పరిస్థితుల్లో ఆయన లండన్ చే రారు. 1849 ఆగస్టు, 26న లండన్‌లో కాలు మోపిన మార్క్స్ కొత్త పత్రిక పెట్టాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ‘నియోరైనిష్ జెటూంగ్’ను దిన పత్రికగా గాక, మాస పత్రికగా తేవాలనుకున్నారు. దానిని రాజకీయ, ఆర్థిక సమీక్షగా ఉంచాలనుకున్నారు. 1850 మార్చి నెలలో 2,500 కాపీలతో మొదటి సంచిక వెలువడింది. అయితే ఉద్యమాలు దెబ్బతినడంతో ఆ మాస పత్రికను నడ పడం కూడా కష్టమైంది. కొన్ని సంచికల తర్వాత అదీ మూతపడింది.
 
మార్క్స్ దృష్టిలో భారతదేశం
ఈ క్రమంలోనే అమెరికాలోని ‘‘న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్’’కు మార్క్స్ 1853 నుంచి లండన్ విలేకరిగా పనిచేయడం మొదలుపెట్టారు. ఆ పత్రికకు రాసిన వ్యాసాలలో ఆయన భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ పాలనను సునిశిత దృష్టితో పరిశీలించారు. శిస్తు వసూళ్లలో బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన అమానుషాలను ఆయన తన వ్యాసాల ద్వారా అక్కడి ప్రజల ముందుంచారు. ‘‘మా ప్రాంతం తహశీల్దారు మా దగ్గర నుంచి కఠినంగా భూమిశిస్తు వసూలు చేయడం మొదలు పెట్టాడు. నన్ను, మరికొందరు రైతులను నిర్బంధించారు.  మమ్మల్ని రోజూ ఎండలో వంగోబెట్టి మా వీపుల మీద బండలు పెట్టి, మండుతున్న ఇసుకలో నిలబెట్టేవారు. అటువంటి దుర్మార్గం మూడు నెలలపాటు సాగింది’’ అంటూ ఒక రైతు వ్యధను ఆయన ఎంతో హృద్యంగా ఒక వ్యాసంలో అభివర్ణించారు.
 
 భారతదేశంలో రైల్వేల నిర్మాణం గురించి ప్రస్తావిస్తూ, రైల్వేలు, రోడ్డుమార్గాలు లేకపోవడం వల్ల ఏ గ్రామానికి ఆ గ్రామం విసిరివేసినట్టుండి, చీకట్లో మగ్గుతున్నాయనీ, రైల్వేల నిర్మాణం ఆ లోటును భర్తీ చేస్తుందనీ అభిప్రాయపడ్డారు. సామాజిక అంతరాలు కూడా ఈ రైల్వేలు తీసుకొచ్చే ప్రగతి ద్వారా కొంత తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. 1853లో రాసిన ‘‘ఇండియాలో బ్రిటిష్ పరిపాలన, భావి ఫలితాలు’’ అన్న వ్యాసంలో భారత దేశం అనేకసార్లు పరాధీనం కావడానికి దారి తీసిన సామాజిక పరిస్థితులను ఎత్తి చూపారు. ‘‘మహ్మదీయుడు, హిందువు అనే వ్యత్యాసం వల్ల మాత్రమే కాకుండా, తెగకీ, తెగకీ, కులానికీ కులానికీ మధ్య ఉన్న వ్యత్యాసం వల్ల దేశం చీలిపోయింది.
 
 సమాజంలో అసమానతల ఆధారంగా జీవనం సాగుతున్నది. ఇటువంటి దేశం ఎన్నిసార్లైనా ఓడిపోయి, బానిసత్వంలోకి వెళుతుంది’’ అని  విశ్లేషించారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రా మం ఓటమి గురించి ప్రస్తావిస్తూ ‘‘భారత దేశంలోని ప్రజల మధ్య ఉన్న విభేదాల వల్ల ఆ పోరాటంలో ప్రజల భాగస్వామ్యం సంపూర్ణంగా లేకుండా పోయింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు బ్రిటిష్ వారికి సహకరించారు. దానితో ఆ తిరుగుబాటును అణచివేయడం బ్రిటిష్ వారికి సాధ్యపడింది.’’ అని విశ్లేషించారు.
 
‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి!’ అని పిలుపునిచ్చిన మార్క్స్ అందించిన మార్క్సిజం ప్రపంచమంతటా ఎన్నో విప్లవాలకు, ఉద్యమాలకు, తిరుగుబాట్లకు, శ్రామివర్గ దోపిడీ విముక్తికి ప్రేరణగా నిలిచింది. అరుదైన ప్రపంచ కార్మికవర్గ నాయకుడు కార్ల్ మార్క్స్ సమాజంలో దోపిడీ పీడనలున్నంత వరకు ప్రపంచ పీడిత వర్గాలకు మార్గదర్శిగా ఉంటాడు.
 (నేడు కార్ల్ మార్క్స్ జయంతి)
 వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు  మొబైల్: 97055 66213
 - మల్లెపల్లి లక్ష్మయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement