వ్యక్తి పూజలకు కొత్త మంత్రాలు!
అక్షర తూణీరం
మనకి దేవుళ్లకేం కొదవలేదు. కాని రాముడంటే మనందరికీ మహాయిష్టం. ఆయన దగ్గర చనువు. సాటివాడు కదా, గోడు వింటాడని నమ్మకం. మనిషి పెద్ద మాయగాడు. అవసరాలను బట్టి మనిషిని దేవుణ్ణి చేస్తాడు. ఆ దేవుడి చుట్టూ అభేద్యమైన గూడు అల్లుతాడు. ఆ దేవుడికి శతనా మావళులు, సహస్ర నామావళులు రచిస్తాడు. గూటికి గట్టి తలుపులు ఏర్పాటు చేసి, బయట ఓ జేగంట ఏర్పాటు చేస్తాడు. నేన్నిన్ను స్తుతిస్తూ మేల్కొలుపులు పాడతాను, అంతవరకూ నువ్ నిద్ర లేవరాదని భక్తిగా దేవుణ్ణి శాసిస్తాడు.
ఎంతైనా దేవుళ్లలో మానవాంశ అంతో ఇంతో ఉంటుంది కదా! అందుకని పొగడ్తలకు మెత్తబడతారు. చెవికింపైన అతిశయోక్తులు వల్లిస్తూ, ‘రామ! రామ! ఇవి సహజోక్తుల’ని వినయం ఒలకబోస్తే నల్లశిల అయినా మెత్తబడాల్సిందే. ఒక్కో తెలివి మీరిన భక్తుడు చిత్రంగా నిందాస్తుతులు, స్తుతినిందలు చేసేసి చక్కిలిగింతలు పెట్టేస్తాడు. అప్పుడు మూల విరాట్ తట్టుకోలేక ఇబ్బంది పడుతుంది. నల్లరాతి బుగ్గలు ఎరుపెక్కుతాయి. ‘‘మహా సృష్టిలో మనిషిని తయారుచేసి పప్పులో కాలేశానని నిత్యం పలుమార్లు సృష్టికర్త నాలుక్కరుచుకుంటాడట’’. కానీ వేసిన అడుగు వెనక్కి తీసుకోలేక సతమతమవుతూ ఉంటాడు.
పూజల పేరిట చెవిలో పువ్వులేమిటి? లేకపోతే దేవుళ్లకి పూజలేమిటి? సరే, పెళ్లిళ్లేమిటి? పట్టాభిషేకాలేమిటి? ఉత్సవాల పేరిట వసూళ్లే మిటి? అందులో కైంకర్యా లేమిటి? ఇంత జరుగుతున్నా బొమ్మలా ఉండిపోయానే అని దేవుడు సుప్రభాతానికి ముందు లేచి అప్పుడప్పుడు వర్రీ అవుతూ ఉంటాడు.
ఇతిహాసాలలో, మన ప్రబంధాలలో, కొన్ని నాటకాలలో, నవలల్లో పాత్రలు కవితో సృష్టించబడతాయి. ఒక్కోసారి అవి తెలివిమీరి సృష్టికర్త అదుపు తప్పుతాయి. ఎదురు శాసించడం మొదలుపెడతాయి. శ్రీరామనవమి పేరు చెప్పుకుని వడపప్పు, పానకాలు సేవించి తరించింది జాతి. భక్తిని నిషాగా ఎక్కించగల ప్రత్యేక మానవులు మనలోనే ఉన్నారు.
మనిషిని దేవుణ్ణి చేసి గుడి కట్టినప్పుడు, ఆ మనిషి ఆదర్శాలన్నీ గుడి పునాదిరాళ్లు అవుతాయి. అక్కడ నుంచి గుడి తాలూకు ధర్మకర్తల జగన్నాటకానికి తెరలేస్తుంది. ఇంతకీ విగ్రహంగా నిలిచిన నిన్నటి మనీషి ఏమి హితం చెప్పాడో వినిపించుకోరు. పెద్దగా శంఖాలు ఊదుతూ, మంత్రాలు చదువుతూ హితాలు, ఆదర్శాలు చెవిన పడనియ్యరు. ఇక జనానికి కనిపించేవి- బొమ్మకి క్షీరాభిషేకాలు, సమయానికి తగుదండలు మాత్రమే.
అంబేడ్కర్ స్ఫూర్తిని పంచడం శ్రేయోదాయకమే గాని ఆకాశాన్ని ముద్దాడే స్థాయి విగ్రహం ఆ మహనీయుని ఆత్మకు సంతృప్తిని ఇస్తుందా? పులిని చూసి నక్క వాత అన్నట్టు, ఇప్పుడు అమరావతిలో ఇంకో అంగుష్ఠమాత్రం ఎత్తయిన విగ్రహం అవతరించబోతోంది. పీఠం ఎక్కి రెండేళ్లయాక అసలు అంబేడ్కర్ చలవతోనే నేను ప్రధాని పీఠం ఎక్కానంటూ మోదీ గద్గదస్వరంతో ప్రకటించారు. శిలావిగ్రహాలు, వాటికి పూజలు వద్దు. రాముడి ఆదర్శం ఒక్కటి ఆచరణలో పెడదాం. ఆకాశమెత్తు అంబేడ్కర్ బొమ్మలొద్దు. బాబాసాహెబ్ ఒక్కమాటని అనుసరిద్దాం. వ్యక్తి పూజలకు కొత్త మంత్రాల రచన వద్దు.
శ్రీరమణ,
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)