‘ఓటుకు కోట్ల’లో లేదు రక్షణ | No Protection in note for vote case | Sakshi
Sakshi News home page

‘ఓటుకు కోట్ల’లో లేదు రక్షణ

Published Fri, Jun 26 2015 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM

‘ఓటుకు కోట్ల’లో లేదు రక్షణ

‘ఓటుకు కోట్ల’లో లేదు రక్షణ

ఇది, తెలంగాణ-ఆంధ్ర ప్రజల మధ్య వివాదం కానే కాదు. ఒక హత్య జరిగితే ప్రభుత్వమే రంగంలోకి దిగి, హంతకుడి రక్షణకు అధికారాన్ని వినియోగించడం అసంబద్ధం, అసంగతం, అన్యాయం, రాజ్యాంగ విరుద్ధం. ఇదీ అంతే.
 
 చట్టాలను, రాజ్యాంగాన్ని అధికార రాజకీయాలకు ముడి బెట్టడం రూల్ ఆఫ్ లాకు విరుద్ధం. ఓటుకు కోట్ల రూపాయల లంచం ఇవ్వడం రాజ్యాంగ సమస్యా? కాదు. నిందితుడి వ్యక్తిగత సమస్యా? తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమస్యా? ఇటీవలే జాతీయ పార్టీగా ప్రక టించుకున్న అఖిల భారత తెలుగుదేశం పార్టీ సమస్యా? స్టీఫెన్సన్‌తో మాట్లాడిన గొంతు తమదో, కాదో తేల్చు కోలేని ఆ పార్టీ అధ్యక్షుడి సమస్యా? ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వ సమస్యా? ఆ రాష్ట్ర ప్రజల సమస్యా? ఏదేమైనా ఇది తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ప్రజల సమస్య మాత్రం కాదు. నేరం జరిగితే అది ఆ కేసు దర్యాప్తుకు, న్యాయ విచారణకు సంబంధించిన సమస్య. లంచం ఇచ్చిన ఆరోపణకు గురైన నిందితుడు టీడీపీ సభ్యుడు కనుక అది ఆ పార్టీ సమస్య అనుకుంటే నేరాం గీకారపత్రం అవుతుంది. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమస్య గానీ, ప్రజల సమస్య గానీ కాబోదు. ఇది కేవ లం నేర, న్యాయపాలనా వ్యవహారం మాత్రమే. టీడీపీ తెలంగాణలో కూడా అధికారం చేబట్టాలనే ఆశతో ఒక్క ఎంఎల్సీ సీటు కోసం తమ పార్టీ ఎమ్మెల్యే ద్వారా మరో ఎమ్మెల్యేకు లంచం ఇస్తూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కెమెరాలకు చిక్కి నిందితుడైతే, అది ఒక ఎమ్మెల్యే నేరానికి సంబంధించిన విషయం. అందులో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందా? లేదా? అనేది ఏసీబీ దర్యాప్తు చేసి నిర్ణయించాల్సిన అంశం.
 
 ఆ లంచం నేరపు బుర దను ఇతరులంతా ఎందుకు వంటికి పులుముకుంటు న్నట్టు? అంతే కాదు, ఈ బురదను ఏపీ ప్రభుత్వం నెత్తిన పోయడానికీ వీల్లేదు. ఇక ఇది, తెలంగాణ-ఆంధ్రా ప్రజ ల మధ్య ఘర్షణ గాని, వివాదం గాని, విభజన సంబం ధిత అంశం గాని కానే కాదు. కావాలని జనాన్ని ఈ ఊబిలోకి దించడం న్యాయం కాదు. ఒక హత్య జరిగితే మొత్తంగా ప్రభుత్వమే రంగంలోకి దిగి, హంతకుడిని రక్షించడానికి సార్వభౌమాధికారాన్ని వినియోగిస్తే అది అసంబద్ధం, అసంగతం, అన్యాయం, రాజ్యాంగ విరు ద్ధం. ఇదీ అంతే. నేరం జరిగిందన్న ఆరోపణ వచ్చిన ప్పుడు నిజానిజాలు తేలేందుకు న్యాయంగా అన్ని ప్రభు త్వాలు సహకరించాలి. ఏసీబీని తన పని తాను చేసు కుపోనివ్వాలి. ఈ లంచం ఘటన వల్ల పార్టీ పరువు పోకుండా ఉండాలని అనుకోవడం సబబే. కానీ ఆ నేరా రోపణకు తగిన సాక్ష్యాలు లేవని కోర్టులు తేల్చే వరకు ఎదురు చూడవలసిందే. కోర్టులో ఆ కేసు వీగిపోక తప్ప దనే నమ్మకం ఉందా లేక లంచాలు ఇచ్చుకుంటూ కెమె రాలకు చిక్కిన తరువాత తప్పించుకోలేమనే అను మానం ఉందా?
 
 నేరాలను ప్రొత్సహించడానికి గాను వాక్ స్వాతం త్య్రాన్ని దుర్వినియోగం చేయడానికి వీల్ల్లేదని రాజ్యాం గంలోని ఆర్టికల్ 19(2) వివరిస్త్తున్నది. ప్రైవసీని (వ్యక్తి గత గోప్యత) కూడా అందుకు వాడుకోవడానికి వీల్లేదు. నేరాలు చేయబోతున్నారని రూఢిగా సమాచారం అందిన తరువాత ఆ కాబోయే నేరగాళ్ల ఫోన్లను వింటారు, కద లికలపైన నిఘా వేస్తారు, వారిని కలిసే వారినీ గమ నిస్తారు. నేరాలను ఈ విధంగానే నివారిస్తారనీ, పరిశో ధిస్తారనీ, పాలనానుభవం ఉన్న వారికి తెలియజేయా ల్సిన అవసరం లేదు.
 
 ఇక టెలిఫోన్ ట్యాపింగ్ సమస్య.  ఇది ఖచ్చితంగా ప్రైవసీ హక్కుకు భంగకరమైనదే. అది వాక్ స్వాతంత్య్రా నికి దెబ్బ అని పీయూసీఎల్ కేసులో సుప్రీంకోర్టు వివరిం చింది. నేరాలను ప్రోత్సహించడాన్ని నిరోధించడం కోసం, హోం కార్యదర్శి అనుమతిస్తే ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చునని కూడా అది వివరించింది. లంచం ఇవ్వ జూపిన వ్యక్తి ఫోన్‌ను, ఫిర్యాదు చేసిన స్టీఫెన్సన్ ఫోన్‌ను రికార్డ్ చేసినపుడు ఆ ఫోన్‌లో మాట్లాడిన గొంతులన్నీ నేరగాళ్లవి కాకపోయినా, ఆ లంచాన్ని సమర్థిస్తూ మాట్లా డిన గొంతెవరిదో వారు ఆరోపణలెదుర్కోవలసి వస్తుం దని నేర విచారణ ప్రక్రియా చట్టం వివరిస్తున్నది.
 
 హఠాత్తుగా మిలియనీరైన నీరా రాడియాకు చెందిన ఎనిమిది టెలిఫోన్లను ట్యాప్ చేసినపుడు అనేక మంది జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రులు, డీఎమ్‌కే నాయకుల గొంతులు, మాటలు దొరికిపో యాయి. వారి అవినీతి కుతంత్రాలు బయటపడ్డాయి. టెలికం కుంభకోణం వెలుగు చూడటం కూడా అందు లోంచే మొదలైంది. రాజకీయ నాయకులు చేసే అవి నీతిని, దుర్మార్గాలను బయటపెట్టడం కోసం, దేశ భద్రత కోసం, ఫోన్ ట్యాపింగ్ చేయడం రాజ్యాం గబద్ధమైన చర్య. నీరా రాడియా ఫోన్‌లు ట్యాప్ చేసిన ప్పడు ఎందరో రాజ్యాంగ పదవీధరుల గొంతులు కూడా దొరికినా నాటి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం పడి పోలేదు. ఆ టేపుల్లో గొంతులసొంతదార్లయిన నీరా రాడియా, రతన్ టాటా, డీఎంకే నేతలు, జర్నలిస్టులు తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారంటూ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టలేదు. సమ పాలన (రూల్ ఆఫ్ లా) నియమం ప్రకారం వంద రూపాయల లంచం తీసుకున్న ప్రభుత్వోద్యోగిని ఏ విధంగా విచారిస్తారో, అదే విధంగా అయిదు కోట్లు లంచం ఇవ్వజూపిన వ్యక్తులను కూడా విచారించాలి. వారెవరనేది నిర్ణాయక కారణం కాదు, కారాదు. నేరం రుజువైతేనే శిక్షించాలి. అప్పీలు చివరి దాకా తీసుకు పోవచ్చు.
 
 హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో నివ సించే వారి ప్రాణాలకు, ఆస్తులకు, స్వాతంత్య్రాల  రక్షణ కోసం విభజన చట్టంలో సెక్షన్ 8 కొన్ని ప్రత్యేక బాధ్య తలను గవర్నర్‌కు ఇస్తున్నది. అవసరమైనప్పుడు ఈ బాధ్యతను నిర్వర్తించాలి. లంచం కేసు బయటకు వచ్చిం ది కాబట్టి ఇప్పుడు  సెక్షన్ 8 అమలు చేయాలనడం అస మంజసం. పాలనాపరమైన అవసరాలకు శాంతి భద్ర తల సందర్భంలో మాత్రమే గవర్నర్ ఈ సెక్షన్ కింద బాధ్యతలను నిర్వర్తించాలి. లంచాలు ఇచ్చినప్పుడు కాదు. విశాఖలో లాయర్లు వేసిన న్యాయమైన ప్రశ్నకు జవాబు చెప్పడం ఏపీ ప్రభుత్వ బాధ్యత.  
 professorsridhar@gmail.com
 (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
 - మాడభూషి శ్రీధర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement