రంగంలోకి ఈసీ | Central election commission entered in to Note for vote case | Sakshi
Sakshi News home page

రంగంలోకి ఈసీ

Published Fri, Jun 26 2015 2:08 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

రంగంలోకి ఈసీ - Sakshi

రంగంలోకి ఈసీ

‘ఓటుకు కోట్లు’ కేసులో వీడియో, ఆడియో రికార్డులు ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్
నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసే యత్నం జరిగింది
ఏసీబీ కేసు దర్యాప్తు చేస్తోంది
దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు అందజేయాలని విజ్ఞప్తి
‘ఓటుకు కోట్లు’ వ్యవహారం ముమ్మాటికీ అవినీతే: భన్వర్‌లాల్
ఇది క్రిమినల్ కేసే.. దీనిపై ఏసీబీ మాకు ముందే సమాచారం ఇచ్చింది
కోర్టు తీర్పు అనంతరం ఈసీ తగిన చర్యలు చేపడుతుందని వెల్లడి

 
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఎన్నికల సంఘం ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చు పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవడాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో, ఆడియో రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు సిద్ధమైంది. ఈ రికార్డుల కాపీలను తమకు ఇవ్వాలని కోరుతూ గురువారం నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసు కోర్టు పరిధిలో ఉండడంతో... కోర్టు తీర్పు ఆధారంగా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. అంతేకాదు ఈ రికార్డులను ఫైల్ చేసి ఉంచనుంది. అసలు ఈ ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం పూర్తిగా అవినీతి, క్రిమినల్ కేసేనని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ పేర్కొనడం గమనార్హం. మరోవైపు ‘ఓటుకు కోట్లు’ కేసులో సూత్రధారితో పాటు పలువురు కీలక పాత్రధారులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఏసీబీ ఒక నివేదికను అందజేయనుంది.
 
 అరడజను మంది చట్టసభల సభ్యు ల ప్రమేయమున్న ఈ కేసులో చోటు చేసుకున్న ప్రతి కోణాన్ని ఈసీ దృష్టికి తీసుకురానుంది. ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తన పార్టీ నేతలతో కలసి నడిపిన కుట్ర మొత్తాన్ని వివరించనుంది. కేసులో నిందితులను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం తన న్యాయవాదులతో న్యాయస్థానాల్లో నడిపిస్తున్న వ్యవహారాలను సైతం ఈ నివేదికలో పొందుపరుస్తోంది. ‘ఓటుకు కోట్లు’ కేసులో నాలుగో నిందితుడు మత్తయ్యతో పాటు, నోటీసులు అందుకుని విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కాపాడుతున్న తీరును వివరించనుంది. మొత్తంగా ఈ కేసులో ఎన్నికల సంఘం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడంతో.. ఇందులో నిందితులైన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా పలువురు కీలక వ్యక్తుల చుట్టూ ఉచ్చు బిగుసుకోనుంది.
 
 ఎన్నికల కమిషన్ కన్ను..
 నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టిన వ్యవహారానికి సంబంధించి ఏసీబీ రికార్డు చేసిన వీడియో, ఆడియో సంభాషణల కాపీలను ఇవ్వాలని ఎన్నికల సంఘం గురువారం న్యాయస్థానాన్ని కోరింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, డిప్యూటీ సెక్రటరీ శ్రీదేవసేన అల్లంరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘‘ఈ నెల ఒకటిన తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం జరిగింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ సమర్పించిన అన్ని డాక్యుమెంట్లు, ఇతర ఆడియో, వీడియో రికార్డులు మాకు ఇవ్వండి..’’ అని ఆ పిటిషన్‌లో ఎన్నికల కమిషన్ కోరింది. న్యాయమూర్తి లక్ష్మీపతి ఈ పిటిషన్‌ను పరిశీలిస్తామని సూచిస్తూ విచారణను వాయిదా వేశారు. అయితే తమకు తెలియకుండా ఆ పత్రాలు, వీడియో, ఆడియో సంభాషణలను ఎన్నికల కమిషన్‌కు ఇవ్వవద్దంటూ రేవంత్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో సంభాషణలను తమకు కాపీ చేసి ఇచ్చేందుకు వీలుగా హార్డ్‌డిస్క్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులకు ఇచ్చినట్లు ఏసీబీ అదనపు ఎస్పీ మల్లారెడ్డి కోర్టుకు నివేదించారు. ఇదే విషయాన్ని మెమో రూపంలో కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి సూచించారు.
 
 ఇది ముమ్మాటికీ అవినీతి కేసే: భన్వర్‌లాల్
 ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం ముమ్మాటికీ అవినీతేనని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో జరిగిన కేసు కావడంతో ఇది ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని.. ఓటు కోసం డబ్బు ఇవ్వడాన్ని క్రిమినల్ కేసుగా పరిగణించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల అవినీతిపై ఏ పోలీస్ విభాగమైనా కేసు నమోదు చేయవచ్చని, సాధారణ పోలీసులతోపాటు ఏసీబీ, సీఐడీ, సీబీఐలాంటి దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసులన్నీ ఈసీ పరిశీలిస్తుందని చెప్పారు. కోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికల కమిషన్ తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గురువారం సాయంత్రం భన్వర్‌లాల్ తనను కలసిన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు లంచమిస్తూ పట్టుబడిన వ్యవహారం కచ్చితంగా అవినీతి కేసేనని ఆయన స్పష్టం చేశారు.
 
 ఆ సంఘటన జరిగిన వెంటనే ఏసీబీ తమకు సమాచారం ఇచ్చిందన్నారు. కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల డాక్యుమెంట్లు, ఆడియో, వీడియో రికార్డుల కాపీలను తాము ఏసీబీని కోరగా... అప్పటికే కోర్టుకు సమర్పించినట్లు తెలిపిందన్నారు. అందువల్లే ఆడియో, వీడియో రికార్డుల కాపీలు ఇవ్వాలని ఈసీ తరఫున కోర్టులో మెమో దాఖలు చేసినట్లు భన్వర్‌లాల్ చెప్పారు. ఇప్పటికీ అవి తమకు అందకపోవడంతో గురువారం రిమైండర్ మెమో దాఖలు చేశామన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసు రికార్డులు, ఆధారాలన్నింటినీ ఈసీ ఫైల్ చేస్తుందని.. వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని వెల్లడించారు.

ఎన్నికల కోడ్ పరిధిలోకి వచ్చే క్రిమినల్ కేసుల్లో ఇది సాధారణమని చెప్పారు. ఈ కేసులో రేవంత్‌తో పాటు ఇతరులపై ఏం చర్య తీసుకోవాలనేది కోర్టు తీర్పు తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని భన్వర్‌లాల్ తెలిపారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో రూ.150 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, రాష్ట్రంలో దాదాపు 15 వేల కేసులు నమోదయ్యాయన్నారు. అవన్నీ క్రిమినల్ కేసులేనని, దేశంలోనే ఎక్కడా ఇంత నగదు స్వాధీనం చేసుకోలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement