ప్రైవేటు డబ్బు రంగ ప్రవేశం! | Now comes private sector money! | Sakshi
Sakshi News home page

ప్రైవేటు డబ్బు రంగ ప్రవేశం!

Published Sun, Sep 8 2013 12:53 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM

ప్రైవేటు డబ్బు రంగ ప్రవేశం!

ప్రైవేటు డబ్బు రంగ ప్రవేశం!

కాదేదీ ప్రైవేటైజేషన్‌కు అనర్హం అన్నట్టుగా ప్రజోపయోగ సర్వీసుల నుంచి శాంతి భద్రత లు, దేశ రక్షణ సైతం ప్రభుత్వాలు ప్రైవేటీకరిస్తున్నాయి. మరి డబ్బును ప్రైవేటీకరణ చేసేది ఎన్నడు? ఆ రోజులూ వచ్చేశాయి. అయితే ఆ పని ఏ ప్రభుత్వమూ చేయదుగాక చేయదు. అయినా ప్రైవేటు డబ్బు... ‘బిట్‌కాయిన్స్’ రూపంలో పుట్టుకొచ్చింది. ఆగస్టు మూడో వారంలో జర్మనీ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ‘బిట్‌కాయిన్స్’ను చట్టబద్ధమైన చెల్లింపుల సాధనంగా గుర్తించింది. ఎవరి గుర్తింపులూ అవసరం లేకున్నా ముందే ఇంటర్నెట్ డబ్బుగా బిట్‌కాయిన్‌లు చలామణిలోకి వచ్చేశాయి. సరిహద్దులు, ఆంక్షలు లేని స్వతంత్ర, స్వేచ్ఛా ప్రపంచ స్వాప్నికుల సృష్టి ఈ కాయిన్స్. ‘సరిహద్దులు లేని ప్రపం చం’, ‘కేంద్ర బ్యాంకు ప్రమేయంలేని డబ్బు’ లక్ష్యాలతో ఏర్పడ్డ బిట్‌కాయిన్లను ఏ దేశ కేంద్ర బ్యాంకు జారీ చేయదు.
 
అది పూర్తిగా ఇంటర్నెట్ ఆధారితమైన ఎలక్ట్రానిక్ డబ్బు. 2009లో వాటిని ప్రవేశపెట్టినప్పుడు ఒక్కో బిట్‌కాయిన్ విలువ ఐదు సెంట్లు మాత్రమే. నాలుగేళ్లు తిరిగేసరికి నేడు ఒక్కోదాని విలువ 120 డాలరు!్ల ప్రత్యేకి ంచి యూరో సంక్షోభం నేపథ్యంలో బిట్‌కాయిన్లను విస్తృతంగా విని యోగిస్తున్నారు. ఈ డబ్బుతో సాగే లావాదేవీలు పన్నుల వాతలకు అందేవి కావు. దీంతో మొదట్లో నెట్ గేమింగ్‌కు మాత్రమే పరిమితమైన బిట్‌కాయిన్స్ షాపులకు, రెస్టారెంట్లకు విస్తరించాయి. మన దేశంలో బంగారాన్ని సురక్షిత మదుపుగా భావిస్తున్నట్టుగా కొన్ని యూరప్ దేశాల్లో బిట్‌కాయిన్స్‌ను ‘కొంటున్నారు’. మార్కెట్ భాషలో చెప్పాలంటే పోర్ట్ ఫోలియో పెట్టుబడులుగా పెడుతున్నారు. అమెరికా, యూరప్‌లకేగాక ఆసియాకు కూడా విస్తరిస్తున్న బిట్‌కాయిన్లను ఏ సూత్రాలతో లొంగదీయాలనేది అంతుబట్టక విధానకర్తలు తలలు పట్టుకుంటున్నారు. నిజానికి బిట్‌కాయిన్స్ ఏ దేశ కరెన్సీ తలరాతను మార్చగలిగే స్థితికి చేరలేదు. అయినా అది దేశాల సార్వభౌమత్వాల ఉల్లంఘన కిందకు వస్తుందేమోనన్న చింత ప్రభుత్వాలది. 
 
 ఎవరి చింత ఎలా ఉన్నాబిట్‌కాయిన్స్ ఇంటర్నెట్ నుంచి నిజ ప్రపంచంలోకి కూడా ప్రవేశించాయి. ప్రపంచవ్యాప్తంగా 7,500 సుప్రసిద్ధ షాపింగ్‌మాల్స్, రెస్టారెంట్లలో వాటిని స్వీకరిస్తున్నారు. డబ్బులు, క్రెడిట్ కార్డులు లేకుండానే దర్జాగా షాపింగ్‌లు చేసే రోజులు వచ్చేస్తున్నాయని కొందరు అత్యాశావహులైన స్వాప్నికులు అంటున్నారు. 2008లో సతోషి నకామోటో అనే కల్పిత వ్యక్తి పేరిట మొదటిసారిగా బిట్‌కాయిన్‌ల ప్రతిపాదన ప్రపంచం ముందుకు వచ్చింది. ఎవరూ పెద్దగా పట్టించుకోకముందే 2009 జనవరి 3న బిట్‌కాయిన్ల ‘మైనింగ్’ (గనుల తవ్వకం) మొదలైంది. ఈ గనులు నిజానికి ఇంటర్నెట్ సర్వర్లు మాత్రమే. ఆ సర్వర్లు ప్రతి బిట్‌కాయిన్‌కు సంకేతంగా ఒక విలక్షణమైన నంబర్‌ను సృష్టిస్తాయి. 33 అంకెలు, అక్షరాలతో కూడిన ఆ నంబర్‌ను కలిగి ఉండటమం టే ఒక బిట్‌కాయిన్ ఉండటం. అంటే బిట్‌కాయిన్ ఒక నంబర్ మాత్రమే. ఆ నంబర్లను గుర్తుపెట్టుకోనవసరం లేదు. మన అకౌంట్లో అవి ఉంటాయి. డూప్లికేట్లకు తావు లేనే లేదని విమర్శకులు సైతం అంగీకరిస్తున్నారు. ఒక ఖాతాదారునికి మరో ఖాతాదారునికి మధ్య లావాదేవీలు జరుగుతాయి. ఏదైనా వస్తువును 500 డాలర్లకు కొంటే దానికి సరిపడా తమ అకౌంట్లో డిజిటల్ సంతకం చేస్తే చాలు ఆ ఖాతాలోంచి అవి అమ్మకందారు ఖాతాలోకి చేరిపోతాయి. అకౌంట్లను, లెడ్జర్లను పకడ్బంది క్రిప్టోగ్రఫీ (నిగూఢ లిపి) ద్వారా నిర్వహిస్తారు. ఖాతాదార్ల డిజిటల్ సంతకాలను దొంగిలిస్తే తప్ప మోసాలకు తావు లేదు.
 
 బిట్‌కాయిన్లు మాత్రమే ఏకైక ఇంటర్ నెట్ డబ్బుగా చలామణి కావాలనేది ఈ స్వాప్నికుల లక్ష్యాలకే విరుద్ధం. అంతేగాక కేంద్ర బ్యాంకులు కరెన్సీని ఎక్కువగా ముద్రించి, విలువ తగ్గిన కరెన్సీతో ప్రజల జేబులకు చిల్లులు వేయడానికి వ్యతిరేకంగా ఈ డబ్బును సృష్టించామని వాళ్లు అంటున్నారు. 2140 నాటికి 2.10 కోట్ల బిట్‌కాయిన్లు మాత్రమే మైనింగ్ అవుతాయి. ఆ తర్వాత కొత్తవి తయారుకావు. నాలుగేళ్లకు ఒకసారి అంతకు ముందటి ఏడాది విడుదలైన నాణేల్లో సగమే విడుదలయ్యేట్టుగా ఉత్పత్తిని నియంత్రించారు. అందుకే బిట్‌కాయిన్లను పెద్దగా పట్టించుకోనవసరం లేదని కొందరి వాదన. ఎవరి వాదనలు, విమర్శలు ఎలా ఉన్నా బిట్‌కాయిన్ డబ్బు మౌలిక స్వభావాన్ని వెల్లడిస్తోంది. నమ్మకం డబ్బుకు మూలం. రూపాయిని డబ్బుగా నమ్ముతున్నాం కాబట్టే డబ్బు. నమ్మకం పోతే అది వెయ్యి రూపాయలే అయినా అర్థంపర్థంలేని కొన్ని నంబర్లున్న చితు ్తకాగితం. డబ్బు మీద నమ్మకం అంటే డబ్బుకు ఉన్న కొనుగోలుశక్తి మీద ఉన్న నమ్మకమే. అదే నిజం. డబ్బు మీద నమ్మకం పోవడమంటే దాన్ని జారీ చేసే ప్రభుత్వం మీద నమ్మకం పోవడమే. వంద రూపాయల నోటుకు సంచి నిండా కూరగాయలు కొనుక్కున్న ఇల్లాలి సంచి బరువు తగ్గుతుండటమంటే ప్రభుత్వం పరువు తగ్గుతుండటమే. యూరోతోపాటూ ఆ దేశాల ప్రభుత్వాలు కూడా పరువు పోగొట్టుకుంటున్నాయి కాబట్టే బిట్‌కాయిన్ జోష్ సాగుతోందనేది మాత్రం తిరుగులేని వాస్తవం. 
 -పిళ్లా వెంకటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement