కలిసికట్టుగా సాగిన కాలం | opinion on usa-india relations richard varma | Sakshi
Sakshi News home page

కలిసికట్టుగా సాగిన కాలం

Published Wed, Dec 30 2015 12:50 AM | Last Updated on Sat, Aug 25 2018 3:20 PM

కలిసికట్టుగా సాగిన కాలం - Sakshi

కలిసికట్టుగా సాగిన కాలం

అమెరికా-భారత్ సంబంధాలలో ఈ ఏడాది గొప్ప పరిణామాలు చోటుచేసుకున్నాయి. వచ్చే ఏడాది మన అనుబంధం... ప్రపంచ సౌభాగ్యానికి  హామీనిచ్చే21వ శతాబ్ది కూటమి దిశగా సాగనుంది. మన భాగస్వామ్యం ఇరు దేశాలలోని, ప్రపంచంలోని సామాన్యులను పరిరక్షించి, యువతకు సాధికారతను కల్పిస్తుంది. ప్రపంచశాంతిని పరిరక్షించి, సౌభాగ్యాన్ని, అభివృద్ధిని పెంపొందిస్తుంది. ఎన్నడూ ఇంత వైవిధ్యపూరితమైన, సాంస్కృతిక ప్రత్యేకతలున్న శక్తులు ఉమ్మడి దృష్టితో ప్రపంచానికి మేలు చేసే దృష్టితో ఐక్యం కాలేదు.
 
 ఏడాది క్రితం సరిగ్గా ఈ వారమే, నేనూ నా కుటుంబమూ 12,000 కిలో మీటర్ల ప్రయాణానికి ఉద్వేగభరితంగా సామాన్లు సర్దుకునే పనిలో ఉన్నాం. నా తల్లిదండ్రులు తమ స్వగృహంగా స్వదేశంగా భావించే భారత దేశానికి అమెరికా రాయబారిగా బాధ్యతలను నిర్వహించడం కోసం బయల్దేరాను. అప్పటికే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న తొలి అమెరికా అధ్యక్షునిగా బరాక్ ఒబామా భారత్‌లో జరపనున్న పర్యటనకు ఇరు దేశాల ప్రభుత్వాలు సన్నాహాలను చేస్తున్నాయి. వచ్చే ఏడాది భారీ లక్ష్యాలను సాధించాలనే దృష్టితో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఒబామాలు మానవ సాధ్యమైన సకల విధాలా కృషిచేసి  ద్వైపాక్షిక సహకారాన్ని అబ్బురమనిపించే రీతిలో విస్తరింపజేస్తామని వాగ్దానం చేశారు. 2015లో మనం ఆ దిశగా చేసిన ప్రయత్నాలు అసాధారణ ఫలితాల నిచ్చాయనీ, 2016కు మనం మరింత గొప్ప లక్ష్యాలను ముందుంచు కున్నామనీ సగర్వంగా చెబుతున్నాను.

 సాకారమవుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం
 ఈ ఏడాది, అమెరికా, భారత్‌లు చరిత్రాత్మక వ్యూహాత్మక సహకారాన్ని ఆచరణలోకి తేవడానికి సంబంధించి ముఖ్య చర్యలను చేపట్టాయి. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం... ఏడు దశాబ్దాలుగా శాంతి, సౌభాగ్యాలను పరిరక్షిస్తున్న అంతర్జాతీయ వ్యవస్థల ప్రాతిపదికపై ఇండో- పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి అవగాహనను రూపొందిం చుకున్నాం. మన నేతలు క్రమం తప్పకుండా కలుస్తున్నారు. గత ఆరువారాల్లో మూడుసార్లు కలుసుకున్నారు. భారత ప్రధాని కార్యాల యానికి, అమెరికా అధ్యక్ష కార్యాలయానికి మధ్య టెలిఫోన్ సంభాషణలు తరచుగా జరుగుతున్నాయి. అమెరికా-భారత్- జపాన్‌ల మధ్య మంత్రివర్గ యంత్రాంగాన్ని శాశ్వత ప్రాతిపదికపై ఏర్పాటు చేయడం ద్వారా... ఇండో- పసిఫిక్ ప్రజాస్వామిక సమాజానికి మూడు మూల స్తంభాలుగా ఉన్న మూడు శక్తుల మధ్య సంభాషణను వ్యవస్థీకృతం చేశాం.

 ఈ నెలలో భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అమెరికా పసిఫిక్ కమాండ్‌ను సందర్శించారు. అలాగే జూన్‌లో, అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్ భారత సైనిక  కమాండ్‌ను సందర్శించారు. ఇవి రెండూ ఇలాంటి మొట్టమొదటి ఘటనలు కావడం విశేషం. హిందూ మహాసముద్రంలో  సాగించిన అత్యంత సంక్లిష్టమైన మలబార్ నౌకా విన్యాసాలలో లోతుగా విస్తరిస్తున్న మన భాగస్వామ్యం స్పష్టమైంది.  ఇకపై ఈ విన్యాసాలలో క్రమం తప్పక పాల్గొనాలని జపాన్‌ను ఆహ్వానించాం. రక్షణ సాంకేతికత, వాణిజ్య ఒప్పందం (డీటీడీఐ) కింద విమాన వాహక నౌక, జెట్ ఇంజిన్ సాంకేతికతలపై మనం జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ను ప్రారంభించాం. జనవ రిలో మన స్పెషల్ ఆపరేషన్స్ బలగాలు కలిసి శిక్షణను పొందనున్నాయి. 2016లో జరిగే రెడ్ ఫ్లాగ్ వైమానిక విన్యాసాలలో భారత్ పాల్గొనడం గురించి మేం ఎదురు చూస్తున్నాం. నేపాల్ భూకంపం తదుపరి మన సైనిక వ్యవస్థలు రెండూ చరిత్రాత్మకమైన విధంగా కలిసి పనిచేశాయి. ఇది, మానవతాపరమైన, విపత్తు ప్రతిస్పందనకు సంబంధించిన కార్యకలాపా లను కలిసి నిర్వహించగలిగే మన సంసిద్ధతను పెంపొందింప జేయడానికి దోహదం చేసింది.

 ద్వైపాక్షిక సంబంధాలలో సార్వత్రిక పురోగతి
 ఈ ఏడాది, అమెరికా, భారత పరిశోధకులు ప్రజారోగ్యం, వైద్య అభివృద్ధికి సంబంధించి ప్రపంచాన్ని బాగా వేధిస్తున్న పలు సవాళ్లను ఎదుర్కొన్నారు. మార్చిలో, మన ఉమ్మడి పరిశోధన ఫలితాలు లక్షలాదిగా ప్రాణాలను కాపాడగలిగే రొటావైరస్ వ్యాక్సిన్‌ను అత్యంత కారు చౌకకు అందించడానికి తోడ్పడింది. అమెరికాకు చెందిన ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ సంస్థ, అంటురోగాల నుంచి ముప్పునకు సంబంధించి వివిధ భారత ఆరోగ్య సంస్థలతో 16 కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసింది. క్షయ, తీవ్రమైన మెదడువాపు వ్యాధులపై కలిసి పోరాడటానికి నూతన ప్రయ త్నాలను కూడా మనం ప్రారంభించాం. మన అభివృద్ధి నిపుణులు ఆఫ్రికా వ్యాప్తంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందింపజేసే, పోషకాహార లోపాన్ని తగ్గించే కృషిలో భాగస్వాములుగా పనిచేస్తున్నారు.

 మనం సాధించిన అద్భుత పురోగతిని కళ్లారా చూడాలంటే, ఒక్కసారి గడచిన కొన్నేళ్ల వేపు తిరిగి చూస్తే చాలు. 2005లో, ద్వైపాక్షిక వాణిజ్యం ఇంచుమించు 3,000 కోట్ల డాలర్లుగా ఉండేది. నేడది, 10,400 కోట్ల డాలర్లు. దీన్ని 50,000 కోట్ల డాలర్లకు పెంచాలనే దృష్టితో మనం ఉన్నాం. గత మూడు నెలల్లోనే, ద్వైపాక్షిక వాణిజ్యంలో 500 కోట్లకంటే ఎక్కువే పెరు గుదల ఉంది. ఇందులో జీఈ సంస్థ భారత రైల్వేల వ్యవస్థకు సమకూర్చ నున్న 2.6 బిలియన్ డాలర్ల విలువైన రాబోయే తరం రైలింజిన్లను సమకూర్చడానికి కుదుర్చుకున్న ఒప్పందం కూడా ఉంది. వీటిలో చాలా వరకు భారత్‌లో తయారుకానున్నాయి. 2005లో ఇంచుమించు 200 అమెరికా కంపెనీలు భారత్‌లో పనిచేస్తుంటే, నేడు అవి 500కు పైగానే ఉన్నాయి.
 ఈ ఏడాది మనం వ్యూహాత్మక, వాణిజ్య సంభాషణలను ప్రారంభించి నప్పుడు, ఆర్థిక సంబంధాలను లోతుగా విస్తరింపజే సి, విశాలంచేసే పద్ధతుల గురించి, తద్వారా మన ఇరుదేశాల ప్రజలకు అవకాశాలను సృష్టిం చడానికి దోహదపడటం గురించి చర్చించాం. 2015లో దాదాపు 30,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటుండేవారు. ఈ ఏడాది వారి సంఖ్య 1,32,000కు పైగా పెరిగింది. పదేళ్ల క్రితం సుమారు 4,00,000 మంది భారతీయులు అమెరికాను సందర్శించగా, ఈ ఏడాది 10 లక్షల వీసా దరఖాస్తులను మేం పరిశీలించాం. ఇది రికార్డు స్థాయి. క్లుప్తంగా చెప్పాలంటే, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు బలపడుతు న్నాయి, వృద్ధి చెందుతున్నాయి.

 వాతావరణ ఒప్పందం కోసం కలిసి సాగాం
 ఈ ఏడాది జనవరిలో ఒబామా, మోదీలు వాతావరణ మార్పుల వల్ల మానవాళికి ఎదురవుతున్న తీవ్ర ప్రమాదాన్ని గుర్తించారు. బృహత్తరమైన వాతావరణ ఒప్పందం కుదిరేలా చేయడానికి కట్టుబడి, ఇతరులతో కలిసి పనిచేశారు. ‘ఫుల్‌బ్రైట్-ఇండియా’ వాతావరణ ఫెలోషిప్‌ను మనం ప్రారం భించాం. దాని ద్వారా పరిశుద్ధ విద్యుత్తు అభివృద్ధి భాగస్వామ్యాన్ని (పీఏసీఈ) విస్తరింపజేయడం కోసం, గ్రిడ్‌కు వెలుపల పరిశుద్ధ విద్యుదు త్పత్తి  పరిష్కారాలను, వినూత్న ఆవిష్కరణలను వాణిజ్యీకరించే ప్రక్రియను త్వరితం చేయడం కోసం ఒక కొత్త నిధిని ఏర్పాటు చేశాం. బహుముఖ వేదికల్లో మనం, ఐరాస సుస్థిర అభివృద్ధి లక్ష్యాల క్రమంలో వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కొనడం గురించి మనం ఫలదాయకమైన రీతిలో మాట్లాడాం. హైడ్రోఫ్లోరోకార్బన్‌లుగా పిలిచే సూపర్ గ్రీన్ హౌస్ వాయువుల ఉత్పత్తి, వినియోగాలను దశల వారీగా తగ్గించుకునేలా 2016 మాంట్రియల్ ఒప్పందాన్ని సవరించడానికి కలిసి కృషి చేయడానికి అంగీక రించాం. వాతావరణ మార్పులతో పోరాడాలనే నిశ్చయంతో ఈ నెల పారిస్ సదస్సు ముగియడానికి ఈ ప్రయత్నాలు దోహదం చేశాయి.

  బృహత్తర మైన, పారదర్శకమైన, జవాబుదారీతనం గలిగిన ప్రపంచస్థాయి వ్యవస్థ, వెనక్కు మరల్చలేని అల్పస్థాయి కార్బన్ భవితకు హామీని ఇవ్వగలిగే బలమైన మార్కెట్ సంకేతాన్ని అందించగలుగుతుంది. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ కంటే బాగా తక్కువకు పరిమితం చేయడం కోసం చేయాల్సిన ప్రయాణం సుదీర్ఘమైనదిగానే కాదు, సవాలుగా కూడా నిలుస్తుంది. ఈ తప్పనిసరి బాధ్యతను నిర్వహించడంలో ప్రపంచ కృషికి నాయకత్వం వహించగలగడానికి ఎన్నటికంటే నేడు భారత్, అమెరి కాలు మరింత మెరుగైన స్థితిలో ఉన్నాయి.  

 అమెరికా-భారత్ సంబంధాలలో ఈ ఏడాది గొప్ప పరిణామాలు చోటుచేసుకున్నాయి. వచ్చే ఏడాది అమెరికా-భారత్ అనుబంధం... ప్రపంచ సౌభాగ్యానికి  హామీనిచ్చే 21వ శతాబ్ది కూటమిగా మారే దిశగా సాగనుంది. మన భాగస్వామ్యం మన రెండు దేశాలలోని, ప్రపంచంలోని సామాన్యులను పరిరక్షించి, యువతకు సాధికారతను కల్పిస్తుంది. ప్రపంచ శాంతిని పరిరక్షించడానికి దోహదపడుతుంది. సౌభాగ్యం, అభివృద్ధి మరింత పెంపొందేలా చేస్తుంది. మన మధ్య ఇంకా పలు విభేదాలుంటే ఉండి ఉండవచ్చు. అవి సన్నిహిత భాగస్వాముల మధ్య తరచుగా ఉంటూనే ఉంటాయి. అయితే చరిత్రలో మునుపెన్నడూ ఇంతటి వైవిధ్యపూరితమైన, సాంస్కృతిక ప్రత్యేకతలున్న శక్తులు ఉమ్మడి దృష్టితో ప్రపంచానికి మేలు చేసే దృష్టితో ఐక్యం కాలేదు. రానున్న ఏడాదిలో, మన దేశాలు కలిసి గమ్యం వైపు సాగే క్రమంలో మరింత భారీ లక్ష్యాలతో కూడిన పరిణామాలు సంభవిస్తాయని నేను ఎదురు చూస్తున్నాను.

    

(వ్యాసకర్త: రిచర్డ్ ఆర్ వర్మ,  భారత్‌లో అమెరికా రాయబారి)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement