ఓరుగల్లు ఓటు చెప్పే పాఠం | orugallu voters teache lesson | Sakshi
Sakshi News home page

ఓరుగల్లు ఓటు చెప్పే పాఠం

Published Mon, Nov 30 2015 1:28 AM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM

ఓరుగల్లు ఓటు చెప్పే పాఠం

ఓరుగల్లు ఓటు చెప్పే పాఠం

విశ్లేషణ
 ఇదేమి తమాషానా, ఇలాంటి వాటికి కోడిపుంజుల కొట్లాటలో వలె 'రండి తేల్చుకుందాం' అని తొడగొట్టి సవాల్ చేసినట్లు చేయడానికి? ఇది వరంగల్ నియోజకవర్గానికి చెందిన విషయం మాత్రమే కాదు. ఇది మొత్తం తెలంగాణ ఓటర్లకు, ప్రజలకు చెందిన విషయం. ఇది ప్రజాస్వామ్య మనుగడకు చెందిన విషయం. ఎందుకంటే ఏది ఈనాడు వరంగల్‌లో జరిగిందో అది రేపు మరొకచోట కూడా జరగవచ్చు. ఇలాంటిది పార్లమెంట్, సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ మూడూ పట్టించుకొని జరగకుండా చూడవలసిన విషయం.

 ఒకసారి వెనక్కి మరలి నెమరు వేసుకుంటే ఎంత సిల్లీగా అనిపిస్తున్నాయి వరంగల్‌లో ప్రతిపక్షాలు ఆశించిన ప్రతిఫలాలు! అచ్చంగా 'గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు' అన్న సామెతలాగుండినవవి.

 అంత పెద్ద పార్టీలకు, వాటిలో కారిపోగా కారిపోగా, పారిపోగా పారిపోగా మిగిలిన చోటామోటా నేతలకు మతిపోయిందనే అనుకోవాలి- ఈ ఎన్నికల్లో వారి పార్టీలకు, వాటి వైపున నిలబడ్డ వారికి జనులు ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశించడం!

 నిన్నమొన్నటి వరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమే ప్రత్యేక తెలంగాణ  సాధించగల పార్టీయని, అదే అంతకాలం నిలదొక్కుకుని ప్రత్యేక తెలంగాణ  ఉద్యమం నడిపిం చకపోతే కేంద్రంలో బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ రెండూ విభజనను ససేమిరా ఒప్పుకునేవారు కారని అనుకున్న ఓటర్లు కొద్దికాలానికే ఆ అన్నవీ, అనుకున్నవన్నీ మరచిపోయి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఎలా ఆశిస్తారు మరి వారు?

 టీఆర్‌ఎస్ ఎన్నో కొన్ని తప్పటడుగులు వేసినా, తప్పుడు పనులు చేసినా, ఇంకా వేస్తున్నా, చేస్తున్నా ఎన్నో కొన్ని మంచి పనులు కూడా చేసింది కదా, చేయతలపెడుతోంది కదా మరి. కాదని ఎవరనగలరు, ఎంత నిరాశకు, నిస్పృహకు గురైన వారైనా?
 
ఇంకొంత సమయం చూడరా!
 మరి అలాంటప్పుడు ఓటర్లు కూడా ప్రభుత్వ పని తీరును ఇదమిత్థంగా నిర్ణయించడానికి ఇంకా కొంత కాలం ఇవ్వాలని అనుకోరా? ఇప్పుడు ప్రభుత్వంపై వినబడుతున్న విమర్శలు ఎక్కువగా 'పనితీరు' గురించే  కానీ, నిర్వహించిన, నిర్వహించదలచిన కార్యక్రమాల గురించి తక్కువన్నది తెలిసిన విషయమే కదా! ప్రజాస్వామ్యంలో 'పనితీరు'కు కూడా చాలా ప్రాధాన్యతుంటుంది. అడిగింది చేయడం, చేయకపోవడం కన్నా మర్యాదగా వినడం ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. కనుక ప్రజాస్వామ్యంలో 'అతడు  ఎవరి మాటా వినడు' అనే విమర్శలకు గురికాకూడదు పరిపాలకుడెవరైనా.

 పోనీ ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీకి నిలబెట్టిన వారు బ్రహ్మాండమైన ప్రతిష్ట కలవారా అంటే, అదీ లేదు. స్థానికులందరికీ తెలిసిన వారా అంటే, అదీ లేదు. టీఆర్‌ఎస్ పార్టీ కన్నా ధన బలమున్నవారా అంటే, అదీ లేదు. ఎవరైనా అతిరథులు, మహారథులు వచ్చి వారి వైపున ప్రచారం చేస్తామన్నారా అంటే అదీ లేదు. పోనీ మునుపటిలాగా సాంప్రదాయ ఓటు బ్యాంకుల్లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే, అవీలేవు. బిహార్ ఎన్నికల్లో వలె ఏదో ఒక ప్రాతిపదికపైన అన్ని ప్రతిపక్షాలు ఏకమై పోటీకి దిగాయా అంటే, అదీలేదు.  మరి ఇక ఏ ఆధారంగా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోటీ చేసిన పార్టీలన్నీ 'మేము సైతం'అని గంతులు వేసినట్లు? నవ్వేవారి ముందర జారిపడడానికా? అదేకదా మరి ఆఖరుకు జరిగింది.

 ఒకవైపు అలాంటి పిచ్చిపని ప్రతిపక్షాలన్నీ చేస్తే టీఆర్‌ఎస్  మాత్రం చేసిన మంచి పనేమిటి? ఎన్నికల్లో గెలవడమా? తెలిసిన వారెవరూ దానిని గొప్ప పని అనరు. అసలు ఈ ఎన్నికలే ఎందుకు కొని తెచ్చు కున్నట్లో అని అంటారు. ఇది కాలం, డబ్బూ వృథా చేయడం అని అంటారు. ఇది ‘మస్తీ’ అని అంటారు.

 ఎంతో ఖర్చుతో, ఎంతో మంది ప్రభుత్వ పరిపాలకులకు వారి సాధారణ పరిపాలనా పనులకు అవరోధం కలిగించి వారిని ఎన్నికల ప్రచారానికి, నిర్వహణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా రప్పించి ఒకసారి కడియం శ్రీహరిని గెలిపించుకొని, ఏదో పెద్ద ఆపత్కాలమెచ్చినట్లు ఆయనను రాజీనామా చేయించి ఆ ఖాళీయైన సీటుకు మరొకసారి ఎన్నికలకు ఎందుకొడిగట్టినట్లు? తిరిగి మరొకసారి అంత వృథా ఖర్చుకు ఎందుకు పాల్పడినట్లు? దానికి బదులు ఆ ఎన్నికలకు ఖర్చయిన డబ్బంతా ఆ నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చిస్తే అది ఇంకెంతో బాగుపడేది కదా? దానినలా ఎందుకు తగలేసినట్లు?  అలాంటి పనిని మంచి పనని ఎవరు మాత్రం ఎందుకు భావిస్తారు? టీఆర్‌ఎస్ చేసిన కొన్ని చెడ్డ పనులలో అన్నిటికన్నా మహా చెడ్డపనియని అనుకుంటారు తప్ప.

 ఒలకపోసి ఎత్తడమెందుకు?
 అసలు కడియం శ్రీహరి రాజీనామా చేయకపూర్వమే ఆ నియోజకవర్గ ప్రజలే ఆయనతో మీరు రాజీనామా చేయవద్దని ఎందుకు చెప్పినట్లు, వారే సీఎంతో కూడా శ్రీహరిని రాజీనామా చేయించకండి, మీరా పనికి పూనితే మేము ఎన్నికలు బాయ్‌కాట్ చేస్తామని ధైర్యంగా, వికాస వంతంగా ఎందుకన్నట్లు? ‘‘మా పనల్లా ఒకరిని ఎన్నుకోవడం, అతడు రాజీనామా చేయడం, మీరా యన్ని రాజీనామా చేయించి తిరిగి మరొకర్ని ఎన్నుకోమని మాకు చెబితే మేము కిక్కురుమనకుండా శిరసావహించ డమేనా? మేమేమి గొర్రెలమా అలా చేయడానికి?’’ అని ప్రశ్నించలేదు. వారలా గొంతెత్తనందుకే కదా మరి ఎన్నికలొచ్చాయి? ఇక్కడ ఎవరు గెలిచారు, ఎవరు ఓడారన్నది కాదు ప్రశ్న, ఎన్నికలు ఎందుకు జరపవలసి వచ్చిందన్నది. ఎందుకింత డబ్బు వృథా చేయవలసి వచ్చిందన్నది? ఎందుకు పరిపాలక సిబ్బంది కాలం అలా వృథా చేశారన్నది అంతకన్నా ముఖ్య ప్రశ్న.

 ఇదేమి తమాషానా, ఇలాంటి వాటికి కోడిపుంజుల కొట్లాటలో వలె ‘రండి తేల్చుకుందాం’ అని తొడగొట్టి సవాల్ చేసినట్లు చేయడానికి? ఇది వరంగల్ నియోజకవర్గానికి చెందిన విషయం మాత్రమే కాదు. ఇది మొత్తం తెలంగాణ ఓటర్లకు, ప్రజలకు చెందిన విషయం. ఇది ప్రజా స్వామ్య మనుగడకు చెందిన విషయం. ఎందుకంటే ఏది ఈనాడు వరంగల్‌లో జరిగిందో అది రేపు మరొకచోట కూడా జరగవచ్చు. ఇలాం టిది పార్లమెంట్, సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ మూడూ పట్టించుకొని జరగకుండా చూడవలసిన విషయం. ఇలాంటివి మన రాజ్యాంగం నిషేధించలేదను సాకుతో మనం మన సెన్స్, కామన్‌సెన్స్ రెండూ పోగొట్టుకొని ఇలా చేయవలసిన విషయం మాత్రమేమాత్రం కాదు. స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఏడు దశాబ్దాలు కావొస్తున్నా మన ప్రజా స్వామ్యంలో ఇలాంటిది, లేక ఒక పార్టీ టికెట్‌పై ఎన్నికై మరో పార్టీకి నిస్సిగ్గుగా ఏదో ఒక నెపంతో ఎంపిక చేసిన ఓటర్లను నిర్లక్ష్యం చేసి ఫిరా యింపులకు పాల్పడడం లాంటిది జరగడం, వాటికి అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు అడ్డాలు వేసి నిరసన తెలుపకపోవడం శోచనీయం.
 
ఈ ఫలితాలు రెఫరెండం కాదు
 ఇకపోతే ఈ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వం పనిపై ఒక రెఫరెండమ్ లాంటివని టీఆర్‌ఎస్ పార్టీ అంటోంది కాని, కాదు. స్వల్పవ్యవధిలో జరిగే 'ఉప ఎన్నికలు' రెఫరెండమ్ లాంటివెలా అవుతాయి, దీర్ఘకాలపువవు తాయి కాని? ఈసారి ఉప ఎన్నిక మాత్రం అక్షరాలా తెలంగాణ వచ్చింది, తెచ్చింది ఎవరను అంశంపైననే తేలిన రెఫరెండమ్. అది ప్రత్యేక తెలం గాణ రాష్ట్రం వచ్చింది టీఆర్‌ఎస్ వలననే, అది తెచ్చింది టీఆర్‌ఎస్ మాత్రమేనని తిరిగి మరొకసారి ఓటర్లు ఇదివరకిచ్చిన తీర్పులాంటిది మాత్రమే.

 ఐదేళ్ల తదుపరి వచ్చే ఎన్నికల తీర్పే ప్రభుత్వ పనితీరుకు చెందిన అసలు సిసలైన తీర్పవుతుంది. ఈనాటికిది ఒకే ఒక అంశానికి చెందిన తీర్పు మాత్రమే. ముందొచ్చేదే బహుళ సమస్యలపైన ఇవ్వనున్న తీర్పవుతుంది. అంతవరకు వేచి చూద్దాం. అప్పుడే అంతా అయిపోయిందని ప్రభుత్వమూ అనుకోకూడదు, ప్రతిపక్షాలూ అనుకోకూడదు. ఈ లోపల ప్రతిపక్షాలు సమర్థులైన నేతలను కనుగొనే ప్రయత్నం చేయాలి. ఏ పార్టీకైనా గట్టి నేత కావాలి కాని వట్టి నేత కాదుగదా! ఏరీ మరి అలాంటి వారిపుడు ఏ ప్రతిపక్షంలోనైనా?

 వ్యాసకర్త  డాక్టర్ కొండలరావు వెల్చాల( కన్వీనర్, తెలంగాణ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ఫోరమ్)
 9848195959, krvelchala2012@gmail.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement