Telangana voters
-
ఫొటోలతో ఓటర్ల జాబితా
మోర్తాడ్(బాల్కొండ): త్వరలో నిర్వహించబోయే సహకార ఎన్నికల్లో బోగస్ ఓటర్లు లేకుండా చే యడానికి సహకార శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఫొటోలతో ఉన్న ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తోంది. ఈ ఎన్నికల నుంచి సరికొత్త విధానం సహకార శాఖ అమలు చేస్తోం ది. సహకార సంఘాల ద్వారా పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించని వారి పేర్లు తొలగించి సక్రమంగా రుణాలు చెల్లించిన వారి పేర్లతో ఓటర్ల జాబితాను సహకార శాఖ ఉద్యోగులు సిద్ధం చేశారు. గతంలో కేవలం ఓటర్ల జాబితాల్లో ఓటు హక్కు పొందిన వారి పేర్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఓటర్ల పేర్లతో పాటు వారి ఫొటోలను అతికించి జాబితాలను ఆయా సహకార సంఘాల పరిధిలో అందుబాటులో ఉంచారు. సహకార సంఘాలలోనే కాకుండా సహకార సంఘం పరిధిలోని గ్రామ పంచాయతీల్లోనే ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 142 సహకార సంఘాలు ఉండగా 1,056 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి సహకార సంఘం పరిధిలోని గ్రామాలలో ఆ గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలను వారం రోజుల నుంచి అందుబాటులో ఉంచారు. ఎవరైనా రుణ గ్రహీతలు బకాయి చెల్లిస్తే వారి పేర్లు చేర్చే అవకాశం ఉంది. అలా కొత్తగా చేర్చిన పేర్లతో ఈనెల 22న తుది జాబితాను ప్రదర్శించే అవకాశం ఉంది. ఏది ఏమైనా సహకార సంఘాల ఎన్నికల్లో బోగస్ ఓటర్లను తొలగించడానికి సహకార శాఖ తీసుకున్న పకడ్బందీ ఏర్పాట్లు సత్పలితాలను ఇస్తాయని చెప్పవచ్చు. -
రాష్ట్ర ఓటర్లు 2,80,64,680
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 2,80,64,680 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కింద గత అక్టోబర్ 12న తొలి అనుబంధ జాబితాను ప్రచురించిన సంగతి తెలిసిందే. అప్పుడు రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,73,18,603గా ఉంది. ఆ తర్వాత ఓటర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి ఓటర్ల జాబితా రెండో అనుబంధాన్ని సోమవారం ఎన్నికల సంఘం ప్రచురించింది. ఈ జాబితాలో కొత్తగా 7,46,077 మంది ఓటర్లు చేరినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్ వెల్లడించారు. రెండో అనుబంధాన్ని ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల సంఘం వెబ్సైట్లో పెడతామన్నారు. సోమవారం రాత్రి ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ ముగిసిందన్నారు. 3 గంటల తర్వాత వచ్చిన వారి నామినేషన్లను స్వీకరించలేదన్నారు. ఇప్పటి వరకు ఆరు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను సమర్పించాయని చెప్పారు. -
ఓరుగల్లు ఓటు చెప్పే పాఠం
విశ్లేషణ ఇదేమి తమాషానా, ఇలాంటి వాటికి కోడిపుంజుల కొట్లాటలో వలె 'రండి తేల్చుకుందాం' అని తొడగొట్టి సవాల్ చేసినట్లు చేయడానికి? ఇది వరంగల్ నియోజకవర్గానికి చెందిన విషయం మాత్రమే కాదు. ఇది మొత్తం తెలంగాణ ఓటర్లకు, ప్రజలకు చెందిన విషయం. ఇది ప్రజాస్వామ్య మనుగడకు చెందిన విషయం. ఎందుకంటే ఏది ఈనాడు వరంగల్‌లో జరిగిందో అది రేపు మరొకచోట కూడా జరగవచ్చు. ఇలాంటిది పార్లమెంట్, సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ మూడూ పట్టించుకొని జరగకుండా చూడవలసిన విషయం. ఒకసారి వెనక్కి మరలి నెమరు వేసుకుంటే ఎంత సిల్లీగా అనిపిస్తున్నాయి వరంగల్‌లో ప్రతిపక్షాలు ఆశించిన ప్రతిఫలాలు! అచ్చంగా 'గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు' అన్న సామెతలాగుండినవవి. అంత పెద్ద పార్టీలకు, వాటిలో కారిపోగా కారిపోగా, పారిపోగా పారిపోగా మిగిలిన చోటామోటా నేతలకు మతిపోయిందనే అనుకోవాలి- ఈ ఎన్నికల్లో వారి పార్టీలకు, వాటి వైపున నిలబడ్డ వారికి జనులు ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశించడం! నిన్నమొన్నటి వరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రత్యేక తెలంగాణ సాధించగల పార్టీయని, అదే అంతకాలం నిలదొక్కుకుని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిపిం చకపోతే కేంద్రంలో బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ రెండూ విభజనను ససేమిరా ఒప్పుకునేవారు కారని అనుకున్న ఓటర్లు కొద్దికాలానికే ఆ అన్నవీ, అనుకున్నవన్నీ మరచిపోయి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఎలా ఆశిస్తారు మరి వారు? టీఆర్ఎస్ ఎన్నో కొన్ని తప్పటడుగులు వేసినా, తప్పుడు పనులు చేసినా, ఇంకా వేస్తున్నా, చేస్తున్నా ఎన్నో కొన్ని మంచి పనులు కూడా చేసింది కదా, చేయతలపెడుతోంది కదా మరి. కాదని ఎవరనగలరు, ఎంత నిరాశకు, నిస్పృహకు గురైన వారైనా? ఇంకొంత సమయం చూడరా! మరి అలాంటప్పుడు ఓటర్లు కూడా ప్రభుత్వ పని తీరును ఇదమిత్థంగా నిర్ణయించడానికి ఇంకా కొంత కాలం ఇవ్వాలని అనుకోరా? ఇప్పుడు ప్రభుత్వంపై వినబడుతున్న విమర్శలు ఎక్కువగా 'పనితీరు' గురించే కానీ, నిర్వహించిన, నిర్వహించదలచిన కార్యక్రమాల గురించి తక్కువన్నది తెలిసిన విషయమే కదా! ప్రజాస్వామ్యంలో 'పనితీరు'కు కూడా చాలా ప్రాధాన్యతుంటుంది. అడిగింది చేయడం, చేయకపోవడం కన్నా మర్యాదగా వినడం ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. కనుక ప్రజాస్వామ్యంలో 'అతడు ఎవరి మాటా వినడు' అనే విమర్శలకు గురికాకూడదు పరిపాలకుడెవరైనా. పోనీ ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీకి నిలబెట్టిన వారు బ్రహ్మాండమైన ప్రతిష్ట కలవారా అంటే, అదీ లేదు. స్థానికులందరికీ తెలిసిన వారా అంటే, అదీ లేదు. టీఆర్ఎస్ పార్టీ కన్నా ధన బలమున్నవారా అంటే, అదీ లేదు. ఎవరైనా అతిరథులు, మహారథులు వచ్చి వారి వైపున ప్రచారం చేస్తామన్నారా అంటే అదీ లేదు. పోనీ మునుపటిలాగా సాంప్రదాయ ఓటు బ్యాంకుల్లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే, అవీలేవు. బిహార్ ఎన్నికల్లో వలె ఏదో ఒక ప్రాతిపదికపైన అన్ని ప్రతిపక్షాలు ఏకమై పోటీకి దిగాయా అంటే, అదీలేదు. మరి ఇక ఏ ఆధారంగా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోటీ చేసిన పార్టీలన్నీ 'మేము సైతం'అని గంతులు వేసినట్లు? నవ్వేవారి ముందర జారిపడడానికా? అదేకదా మరి ఆఖరుకు జరిగింది. ఒకవైపు అలాంటి పిచ్చిపని ప్రతిపక్షాలన్నీ చేస్తే టీఆర్ఎస్ మాత్రం చేసిన మంచి పనేమిటి? ఎన్నికల్లో గెలవడమా? తెలిసిన వారెవరూ దానిని గొప్ప పని అనరు. అసలు ఈ ఎన్నికలే ఎందుకు కొని తెచ్చు కున్నట్లో అని అంటారు. ఇది కాలం, డబ్బూ వృథా చేయడం అని అంటారు. ఇది ‘మస్తీ’ అని అంటారు. ఎంతో ఖర్చుతో, ఎంతో మంది ప్రభుత్వ పరిపాలకులకు వారి సాధారణ పరిపాలనా పనులకు అవరోధం కలిగించి వారిని ఎన్నికల ప్రచారానికి, నిర్వహణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా రప్పించి ఒకసారి కడియం శ్రీహరిని గెలిపించుకొని, ఏదో పెద్ద ఆపత్కాలమెచ్చినట్లు ఆయనను రాజీనామా చేయించి ఆ ఖాళీయైన సీటుకు మరొకసారి ఎన్నికలకు ఎందుకొడిగట్టినట్లు? తిరిగి మరొకసారి అంత వృథా ఖర్చుకు ఎందుకు పాల్పడినట్లు? దానికి బదులు ఆ ఎన్నికలకు ఖర్చయిన డబ్బంతా ఆ నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చిస్తే అది ఇంకెంతో బాగుపడేది కదా? దానినలా ఎందుకు తగలేసినట్లు? అలాంటి పనిని మంచి పనని ఎవరు మాత్రం ఎందుకు భావిస్తారు? టీఆర్ఎస్ చేసిన కొన్ని చెడ్డ పనులలో అన్నిటికన్నా మహా చెడ్డపనియని అనుకుంటారు తప్ప. ఒలకపోసి ఎత్తడమెందుకు? అసలు కడియం శ్రీహరి రాజీనామా చేయకపూర్వమే ఆ నియోజకవర్గ ప్రజలే ఆయనతో మీరు రాజీనామా చేయవద్దని ఎందుకు చెప్పినట్లు, వారే సీఎంతో కూడా శ్రీహరిని రాజీనామా చేయించకండి, మీరా పనికి పూనితే మేము ఎన్నికలు బాయ్‌కాట్ చేస్తామని ధైర్యంగా, వికాస వంతంగా ఎందుకన్నట్లు? ‘‘మా పనల్లా ఒకరిని ఎన్నుకోవడం, అతడు రాజీనామా చేయడం, మీరా యన్ని రాజీనామా చేయించి తిరిగి మరొకర్ని ఎన్నుకోమని మాకు చెబితే మేము కిక్కురుమనకుండా శిరసావహించ డమేనా? మేమేమి గొర్రెలమా అలా చేయడానికి?’’ అని ప్రశ్నించలేదు. వారలా గొంతెత్తనందుకే కదా మరి ఎన్నికలొచ్చాయి? ఇక్కడ ఎవరు గెలిచారు, ఎవరు ఓడారన్నది కాదు ప్రశ్న, ఎన్నికలు ఎందుకు జరపవలసి వచ్చిందన్నది. ఎందుకింత డబ్బు వృథా చేయవలసి వచ్చిందన్నది? ఎందుకు పరిపాలక సిబ్బంది కాలం అలా వృథా చేశారన్నది అంతకన్నా ముఖ్య ప్రశ్న. ఇదేమి తమాషానా, ఇలాంటి వాటికి కోడిపుంజుల కొట్లాటలో వలె ‘రండి తేల్చుకుందాం’ అని తొడగొట్టి సవాల్ చేసినట్లు చేయడానికి? ఇది వరంగల్ నియోజకవర్గానికి చెందిన విషయం మాత్రమే కాదు. ఇది మొత్తం తెలంగాణ ఓటర్లకు, ప్రజలకు చెందిన విషయం. ఇది ప్రజా స్వామ్య మనుగడకు చెందిన విషయం. ఎందుకంటే ఏది ఈనాడు వరంగల్‌లో జరిగిందో అది రేపు మరొకచోట కూడా జరగవచ్చు. ఇలాం టిది పార్లమెంట్, సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ మూడూ పట్టించుకొని జరగకుండా చూడవలసిన విషయం. ఇలాంటివి మన రాజ్యాంగం నిషేధించలేదను సాకుతో మనం మన సెన్స్, కామన్సెన్స్ రెండూ పోగొట్టుకొని ఇలా చేయవలసిన విషయం మాత్రమేమాత్రం కాదు. స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఏడు దశాబ్దాలు కావొస్తున్నా మన ప్రజా స్వామ్యంలో ఇలాంటిది, లేక ఒక పార్టీ టికెట్‌పై ఎన్నికై మరో పార్టీకి నిస్సిగ్గుగా ఏదో ఒక నెపంతో ఎంపిక చేసిన ఓటర్లను నిర్లక్ష్యం చేసి ఫిరా యింపులకు పాల్పడడం లాంటిది జరగడం, వాటికి అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు అడ్డాలు వేసి నిరసన తెలుపకపోవడం శోచనీయం. ఈ ఫలితాలు రెఫరెండం కాదు ఇకపోతే ఈ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వం పనిపై ఒక రెఫరెండమ్ లాంటివని టీఆర్ఎస్ పార్టీ అంటోంది కాని, కాదు. స్వల్పవ్యవధిలో జరిగే 'ఉప ఎన్నికలు' రెఫరెండమ్ లాంటివెలా అవుతాయి, దీర్ఘకాలపువవు తాయి కాని? ఈసారి ఉప ఎన్నిక మాత్రం అక్షరాలా తెలంగాణ వచ్చింది, తెచ్చింది ఎవరను అంశంపైననే తేలిన రెఫరెండమ్. అది ప్రత్యేక తెలం గాణ రాష్ట్రం వచ్చింది టీఆర్ఎస్ వలననే, అది తెచ్చింది టీఆర్ఎస్ మాత్రమేనని తిరిగి మరొకసారి ఓటర్లు ఇదివరకిచ్చిన తీర్పులాంటిది మాత్రమే. ఐదేళ్ల తదుపరి వచ్చే ఎన్నికల తీర్పే ప్రభుత్వ పనితీరుకు చెందిన అసలు సిసలైన తీర్పవుతుంది. ఈనాటికిది ఒకే ఒక అంశానికి చెందిన తీర్పు మాత్రమే. ముందొచ్చేదే బహుళ సమస్యలపైన ఇవ్వనున్న తీర్పవుతుంది. అంతవరకు వేచి చూద్దాం. అప్పుడే అంతా అయిపోయిందని ప్రభుత్వమూ అనుకోకూడదు, ప్రతిపక్షాలూ అనుకోకూడదు. ఈ లోపల ప్రతిపక్షాలు సమర్థులైన నేతలను కనుగొనే ప్రయత్నం చేయాలి. ఏ పార్టీకైనా గట్టి నేత కావాలి కాని వట్టి నేత కాదుగదా! ఏరీ మరి అలాంటి వారిపుడు ఏ ప్రతిపక్షంలోనైనా? వ్యాసకర్త డాక్టర్ కొండలరావు వెల్చాల( కన్వీనర్, తెలంగాణ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ఫోరమ్) 9848195959, krvelchala2012@gmail.com -
జనం ఓటెత్తారు
* తెలంగాణలో 72% పోలింగ్ * తుది వివరాలతో 75 శాతానికి చేరే అవకాశం * గత రెండు సాధారణ ఎన్నికలకంటే అధికం * అభ్యర్థుల భవితవ్యంపై తీర్పు ఇచ్చిన ఓటర్లు * 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాలకు ప్రశాంతంగా ఎన్నికలు.. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు భద్రం * రీ-పోలింగ్ నిర్వహించాల్సిన కేంద్రాలపై నేడు నిర్ణయం * ఈవీఎంల మొరాయింపుతో కొన్నిచోట్ల ఇబ్బందులు * పోలింగ్ స్లిప్పులు లేనిదే అనుమతించని సిబ్బంది * ఓటర్ జాబితాల్లో తప్పులతో గందరగోళం * మెదక్, నల్లగొండల్లో అత్యధికంగా 81% పోలింగ్ * బద్దకించిన హైదరాబాదీ.. అత్యల్పంగా 53% నమోదు సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ర్టంలో ఏర్పడబోయే తొలి ప్రభుత్వాన్ని ఎన్నుకోడానికి తెలంగాణ ఓటర్లు పోటెత్తారు. తమ బంగరు భవితకు బాటలు వేసే నాయకులను గెలిపించుకోడానికి పోలింగ్ కేంద్రాలకు వెల్లువెత్తారు. హామీలు గుప్పిస్తూ బరిలో నిలిచిన అభ్యర్థులకు తమ ఓటుతో సమాధానమిచ్చారు. తెలంగాణ పగ్గాలు ఎవరికి అప్పగించాలో తీర్పునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా బుధవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉద్యమ చైతన్యానికి, ఎన్నికల సంఘం ప్రచారం కూడా తోడుకావడంతో ఈసారి భారీ పోలింగ్ నమోదైంది. గత రెండు సాధారణ ఎన్నికలకన్నా ఎక్కువ ఓటింగ్ జరగడం విశేషం. పది జిల్లాల్లోని 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాలకు 72 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. గురువారం వరకు అందే తుది సమాచారాన్ని కూడా క్రోడీకరిస్తే... ఇది 75 శాతానికి చేరే అవకాశముందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. తెలంగాణలోని 2.81 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 2.10 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పారు. 2009 ఎన్నికల కంటే దాదాపు రెండున్నర శాతం మేర పోలింగ్ పెరిగిందన్నారు. అక్కడక్కడా చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, రీ పోలింగ్ కోసం జిల్లాల ఎన్నికల అధికారుల నుంచి ప్రస్తుతానికి ఎలాంటి విజ్ఞప్తి అందలేదని ఆయన పేర్కొన్నారు. గురువారం పార్టీల అభ్యర్థులతో ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు సమావేశమవుతారని, పోలింగ్ కేంద్రాల వారీగా సమీక్ష జరుగుతుందని చెప్పారు. నమోదైన ఓట్ల సంఖ్యను, ప్రిసైడింగ్ అధికారులు ఇచ్చిన స్లిప్పులను పరిశీలించిన తర్వాత ఎక్కడైనా రీ-పోలింగ్ అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో పోలింగ్ కేంద్రంపై మావోయిస్టులు దాడి చేసి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు) ఎత్తుకెళ్లినట్లు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఆరు గంటల్లోపు ఓట్లు వేయడానికి వచ్చిన వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని, కొన్ని చోట్ల రాత్రి పది గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగిందని వెల్లడించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్‌రూములకు తరలించి, కేంద్ర సాయుధ బలగాల (సీఆర్పీఎఫ్)తో భద్రత కల్పించినట్లు తెలిపారు. అభ్యర్థుల తరఫున కూడా పహారాకు అనుమతిస్తామన్నారు. ఈవీఎంలున్న గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఉదయం 7 గంటలకు ముందు నిర్వహించిన మాక్ పోలింగ్‌లో సమస్యలు తలెత్తిన 208 ఈవీఎంలను మార్చినట్లు భన్వర్‌లాల్ వివరించారు. అలాగే పోలింగ్ జరుగుతున్న సమయంలో మొరాయించిన 198 యంత్రాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో మొత్తం 84,778 బ్యాలెట్ యూనిట్లను వినియోగించినట్లు చెప్పారు. పోలింగ్‌లో పదనిసలు.. ఎండలు ముదరడంతో ఉదయమే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. అన్ని కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే కొన్ని చోట్ల ఓటింగ్ యంత్రాలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అదనపు ఈవీఎంలను ఉపయోగించి పరిస్థితిని అధికారులు చక్కదిద్దారు. ఓటర్ స్లిప్పులు అందని వారు కాస్త ఇబ్బంది పడ్డారు. పోలింగ్ కేంద్రాల నంబర్లు, ఓటర్ జాబితాలోని క్రమ సంఖ్య ఆధారంగా స్లిప్పులు పొందే క్రమంలో కొంత ఇబ్బందిపడ్డారు. జాబితాలో పేర్లు లేకపోవడం, గుర్తింపు కార్డులో ఉన్న క్రమ సంఖ్య.. ఓటరు జాబితాలోని సంఖ్యతో సరిపోలకపోవడం, జాబితాలోని ఫొటోలు తారుమారు కావడం వంటివి ఓటర్లను గందరగోళానికి గురిచేశాయి. ఓటరు స్లిప్పులు కావాల్సిందేనని పలుచోట్ల పోలింగ్ సిబ్బంది పట్టుబట్టడంతో ఓటర్లు ఇబ్బందిపడ్డారు. ఈ సమస్యలతో కొందరు ఓటు వేయకుండానే వెనుదిరిగారు. కాగా, పలు ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ, అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల్లోకి చొచ్చుకుని వెళ్లడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఇన్నోవా వాహనంలో రూ. 2.50 కోట్లు తరలిస్తుండగా అవి కాలిపోవడం సంచలనం సృష్టించింది. మెదక్ జిల్లా గజ్వేల్‌లో దౌర్జన్యం చేస్తున్నారన్న ఆరోపణపై టీడీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మెదక్‌లో పోలింగ్ సిబ్బంది ఒక పార్టీకి ఓట్లు వేయాలని చెబుతున్నారంటూ అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి ఫిర్యాదు చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తలపై టీడీపీ అభ్యర్థి విరుచుకుపడ్డారు. పోలీసులు కూడా ఇళ్లలోకి వెళ్లి లాఠీచార్జ్ చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నియోజకవర్గంలోనూ పార్టీల మధ్య కొంత అలజడి రేగింది. ఓటర్లు క్యూలో నిల్చోలేదని కొన్ని చోట్ల పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పోలింగ్ రోజున ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ జంటనగరాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో పోలింగ్ నమోదు కాలేదు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పార్కులు, సినిమాహాళ్లు, దుకాణాలు మూసేసినా ఫలితం కనిపించలేదు. నగరంలో పోలింగ్ కేంద్రాల చిరునామా తెలుసుకోడానికి ఓటర్లు ఇబ్బంది పడ్డారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ, పోలింగ్ ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ ఘోరంగా విఫలమైంది. కాగా, తెలంగాణలో జరిగిన ఎన్నికలపై ఒపీనియన్, ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను ప్రసారం చేయడం లేదా పత్రికల్లో ప్రకటించడానికి వీల్లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గతంకన్నా పెరిగిన ఓటింగ్ 2004, 2009 ఎన్నికలకన్నా.. ఈసారి అత్యధిక పోలింగ్ నమోదుకావడం విశేషం. బుధవారం రాత్రి వరకు 72 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే పూర్తి వివరాలు అందిన తర్వాత ఇది మరింత పెరిగే అవకాశముంది. ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం విస్తృత ప్రచారం చేసింది. ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జంటనగరాల్లో అన్ని దుకాణాలను మూసేశారు. ఆఖరికి టీ-కొట్లు కూడా సాయంత్రం వరకు తెరవలేదు. ఈసీ వెల్లడించిన ప్రకారం అత్యధికంగా మెదక్, నల్లగొండ జిల్లాల్లో 81 శాతం పోలింగ్ నమోదైంది. -
ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించాలి: కోదండరామ్
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతి ఇచ్చే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీజేఏసీ కన్వీనర్ కోదండరామ్ తెలిపారు. శుక్రవారం కోదండరామ్ హైదరాబాద్‌లో మాట్లాడుతూ... తెలంగాణలో ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలో విజ్ఞతతో వ్యవహరించి ఓటు వేయాలని ఆయన ఓటర్లకు హితవు పలికారు. తెలంగాణ కోసం పోరాడింది ఎవరో .... అలాగే తెలంగాణ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించింది ఎవరో ప్రజలందరికి తెలుసునని కోదండరామ్ వెల్లడించారు. ప్రజలు చాలా వివేకవంతులని ఎవరికి ఓటు వేయాలో వారికి తెలుసునని కోదండరామ్ అన్నారు. -
అన్నింటికీ ‘టీ’ మంత్రమే..!
* క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌ను వెంటాడుతున్న పంచభూతాలు * తెలంగాణ సెంటిమెంటే ఏకైక పరిష్కారమట! పసునూరు మధు: అధిక ధరలు, అస్తవ్యస్త పాలన, గ్రూపు తగాదాలు, నాయకత్వ లోపం, ప్రభుత్వ వ్యతిరేకత... ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్న పంచభూతాలివి. వీటిని ఎదుర్కొని గెలుపు సాధించడం అధికార పార్టీకి ఆషామాషీ కాదు. అయినా సరే, ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. పంచభూతాలను ఢీ కొట్టే మంత్ర దండం తమ దగ్గర ఉందంటున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టించిన తెలంగాణ అంశమే ఇప్పుడు తమ చేతిలో మంత్రదండమైందని సగర్వంగా చెబుతున్నారు. తెలంగాణ మంత్రదండానికి తమపై ఉన్న వ్యతిరేకత పటాపంచలై రాష్ట్రమంతటా కాంగ్రెస్‌కు ఓట్లు కురిపించడం ఖాయమని చెబుతున్నారు. అయితే, తెలంగాణ ఓటర్లు ఎటువైపు మొగ్గుతారనేది మరో ఇరవై రోజుల్లో తేలిపోనుంది. నింగికెగసిన నిత్యావసరాలు గడచిన ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో నిత్యావసరాల ధరలు నింగికెగశాయి. ఐదేళ్ల కిందటి వరకు రూ.30 లోపు ఉన్న సన్నబియ్యం రూ.50కి చేరింది. ఉప్పు, పప్పు, కారం, నూనె వంటి వాటి ధరలు వంద శాతానికి పైగా పెరిగాయి. సగటు పౌరులు సర్కారు నిర్వాకానికి తిట్టుకోని రోజు లేదు. ‘ఆధార్’కు, వంటగ్యాస్‌కు లింకు పెట్టి ముప్పుతిప్పలు పెట్టిన విషయాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఐదేళ్ల కిందట వంట గ్యాస్ సిలిండర్ రూ.300 పైచిలుకు ఉండేది. ‘ఆధార్’తో ముడిపెట్టాక సిలిండర్‌కు రూ.1300 వరకు వసూలు చేసి, సబ్సిడీ నగదును బ్యాంకులో జమ చేయకుండా చావబాదిన జ్ఞాపకాలు జనాన్ని ఇంకా వీడనేలేదు. వ్యవసాయోత్పత్తుల ధరలు మార్కెట్లో చుక్కలను తాకుతున్నా, అన్నదాతలు మాత్రం గిట్టుబాటు ధరలు దక్కక అల్లాడిపోయారు. ఇదేం పాలన బాబోయ్! ధరల పెరుగుదలతో ప్రజలు అల్లాడుతుంటే ఇవేమీ పట్టనట్లుగా పదవుల కోసం ఢిల్లీ చుట్టూ తిరగడంతోనే ఐదేళ్ల పుణ్యకాలాన్ని గడిపేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిసహా తెలంగాణ మంత్రులంతా సగటున వంద సార్లకు తక్కువ కాకుండా హస్తిన వెళ్లొచ్చారంటే అతిశయోక్తి కాదు. ఒకవైపు కనీస సౌకర్యాలు కల్పించకుండా, మరోవైపు పన్నులు వసూలు చేసి ప్రజలను తీవ్ర వేదనకు గురిచేశారు. ఒకవైపు కరెంటు కోతలు కొనసాగిస్తూనే, సర్‌చార్జీల బాదుడుతో నడ్డి విరిచేయడాన్ని జనమింకా మరువలేదు. బస్సు చార్జీలనూ పెంచేసి, ప్రయాణాలంటేనే ప్రజలు భయపడే స్థితి కల్పించారు. గ్రూపు తగాదాలే ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తరువాత అధికార పార్టీలో గ్రూపు తగాదాలు ఒక్కసారిగా జూలు విదిల్చి కాంగ్రెస్ అంటే ఇదేరా... అనే దుస్థితి కల్పించాయి. ఏ జిల్లాలో చూసినా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయి ఆధిపత్య పోరుకు తెరదీశారు. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించడం సాధారణమే అయినా ప్రభుత్వాన్ని అధికార పార్టీ నేతలే ఎండగట్టడం గడచిన ఐదేళ్లలో నిత్యకృత్యమైంది. కార్యకర్తలను ఎమ్మెల్యేలను తిట్టడం... ప్రజాప్రతినిధులు మంత్రులను విమర్శించడం... అమాత్యులు ముఖ్యమంత్రిని ఎండగట్టడం సర్వసాధారణమైంది. ప్రభుత్వ సారథిగా ఉన్న ముఖ్యమంత్రి పదవిని ప్రజల దృష్టిలో పలుచన చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్సేనని చెప్పకతప్పదు. సెన్సెక్స్లా ఎగబాకిన ప్రభుత్వ వ్యతిరేకత అధిక ధరలు, అస్తవ్యస్త పాలన, గ్రూపు తగాదాలే కాకుండా విభజన ఉద్యమాలతో రాష్ట్ర అట్టుడికిపోయింది. ‘సుస్థిర ప్రభుత్వం, అభివృద్ధి, సంక్షేమం’ నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అసలు లక్ష్యాన్ని విస్మరించి తన ఐదేళ్ల పాలనను విభజన ఉద్యమాలతోనే గడిపేసింది. ఎప్పుడు చూసినా బంద్‌లు, ఎటు చూసినా ధర్నాలు... ఎవరిని కదిలించినా రగిలే భావోద్వేగాలతో రాష్ట్రం అట్టుడికిపోయింది. ఈ ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత షేర్ మార్కెట్లో సెన్సెక్స్ మాదిరిగా ఎగబాకింది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, మరెన్ని కష్టాలు వచ్చినా దశాబ్దాలపాటు కాంగ్రెస్ జెండాను వీడని కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు హస్తం పేరు వింటేనే భయపడి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. నడిపించే నాయకుడేరి? పదేళ్ల పాలన పూర్తయింది. ఎన్నికలొచ్చాయి. ఏ రాజకీయ పార్టీకైనా సారథితో ఎన్నికల యుద్దానికి వెళుతుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. సారథి లేకుండానే ఎన్నికల్లోకి వెళుతున్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ శ్రేణులు సైతం ఎవరి నాయకత్వం కింద పనిచేయాలో అర్థంకాని పరిస్థితి. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల మొదలు సీనియర్లు ఎవరిని కదిలించినా అధికారంలోకొస్తే తానే సీఎం అని చెబుతూ గ్రూపులకు తెరదీశారు. ఎవరికి వారే సీఎం అని చెప్పుకుంటూ వెళుతున్నా పార్టీని నడిపించే, ప్రజలను సమీకరించే నాయకుడు మాత్రం కాంగ్రెస్‌లో కరువయ్యారు. తెలంగాణ తెచ్చిన, ఇచ్చిన పార్టీ తమదేనని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఒక్కటంటే ఒక్క బహిరంగ సభ కూడా నిర్వహించలేని దుస్థితిలో ఉన్నారంటే, నాయకత్వ లోపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితేనేం.....జిందా తిలిస్మాత్ ఉందిగా....! పైన పేర్కొన్న అంశాలన్నీ చూశారుగా...కాంగ్రెస్ పార్టీకి ఎన్ని అవరోధాలున్నాయో! అయితేనేం...వాటిని అలవోకగా అధిగమించి తెలంగాణలో అధికారం కైవసం చేసుకుంటామని ధీమాతో టీ కాంగ్రెస్ నేతలున్నారు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, మరెన్ని కష్టాలు పడినా ఆరు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను నెరవేర్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని సగర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ ఒక్క అస్త్రం తమకు రామబాణ ం వంటిదని, ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపిస్తుందని చెబుతున్నారు. ఇదే అంశంతోనే తాము ఎన్నికల్లోకి వెళ్లి అధికారాన్ని కైవసం చేసుకుంటామని చెబుతున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా పార్టీ అతిరథ మహారథులందరినీ ఎన్నికల ప్రచారానికి పిలిపించి తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఎదుర్కొన్న ఇబ్బందులను వివరిస్తూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఏ విధంగా నెరవేర్చామో వివరిస్తామంటున్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఏ తీర్పు ఇస్తారో వేచి చూడాల్సిందే!