మోర్తాడ్(బాల్కొండ): త్వరలో నిర్వహించబోయే సహకార ఎన్నికల్లో బోగస్ ఓటర్లు లేకుండా చే యడానికి సహకార శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఫొటోలతో ఉన్న ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తోంది. ఈ ఎన్నికల నుంచి సరికొత్త విధానం సహకార శాఖ అమలు చేస్తోం ది. సహకార సంఘాల ద్వారా పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించని వారి పేర్లు తొలగించి సక్రమంగా రుణాలు చెల్లించిన వారి పేర్లతో ఓటర్ల జాబితాను సహకార శాఖ ఉద్యోగులు సిద్ధం చేశారు. గతంలో కేవలం ఓటర్ల జాబితాల్లో ఓటు హక్కు పొందిన వారి పేర్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఓటర్ల పేర్లతో పాటు వారి ఫొటోలను అతికించి జాబితాలను ఆయా సహకార సంఘాల పరిధిలో అందుబాటులో ఉంచారు.
సహకార సంఘాలలోనే కాకుండా సహకార సంఘం పరిధిలోని గ్రామ పంచాయతీల్లోనే ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 142 సహకార సంఘాలు ఉండగా 1,056 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి సహకార సంఘం పరిధిలోని గ్రామాలలో ఆ గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలను వారం రోజుల నుంచి అందుబాటులో ఉంచారు. ఎవరైనా రుణ గ్రహీతలు బకాయి చెల్లిస్తే వారి పేర్లు చేర్చే అవకాశం ఉంది. అలా కొత్తగా చేర్చిన పేర్లతో ఈనెల 22న తుది జాబితాను ప్రదర్శించే అవకాశం ఉంది. ఏది ఏమైనా సహకార సంఘాల ఎన్నికల్లో బోగస్ ఓటర్లను తొలగించడానికి సహకార శాఖ తీసుకున్న పకడ్బందీ ఏర్పాట్లు సత్పలితాలను ఇస్తాయని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment