అన్నింటికీ ‘టీ’ మంత్రమే..!
* క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌ను వెంటాడుతున్న పంచభూతాలు
* తెలంగాణ సెంటిమెంటే ఏకైక పరిష్కారమట!
పసునూరు మధు: అధిక ధరలు, అస్తవ్యస్త పాలన, గ్రూపు తగాదాలు, నాయకత్వ లోపం, ప్రభుత్వ వ్యతిరేకత... ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్న పంచభూతాలివి. వీటిని ఎదుర్కొని గెలుపు సాధించడం అధికార పార్టీకి ఆషామాషీ కాదు. అయినా సరే, ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. పంచభూతాలను ఢీ కొట్టే మంత్ర దండం తమ దగ్గర ఉందంటున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టించిన తెలంగాణ అంశమే ఇప్పుడు తమ చేతిలో మంత్రదండమైందని సగర్వంగా చెబుతున్నారు. తెలంగాణ మంత్రదండానికి తమపై ఉన్న వ్యతిరేకత పటాపంచలై రాష్ట్రమంతటా కాంగ్రెస్‌కు ఓట్లు కురిపించడం ఖాయమని చెబుతున్నారు. అయితే, తెలంగాణ ఓటర్లు ఎటువైపు మొగ్గుతారనేది మరో ఇరవై రోజుల్లో తేలిపోనుంది.
నింగికెగసిన నిత్యావసరాలు
గడచిన ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో నిత్యావసరాల ధరలు నింగికెగశాయి. ఐదేళ్ల కిందటి వరకు రూ.30 లోపు ఉన్న సన్నబియ్యం రూ.50కి చేరింది. ఉప్పు, పప్పు, కారం, నూనె వంటి వాటి ధరలు వంద శాతానికి పైగా పెరిగాయి. సగటు పౌరులు సర్కారు నిర్వాకానికి తిట్టుకోని రోజు లేదు. ‘ఆధార్’కు, వంటగ్యాస్‌కు లింకు పెట్టి ముప్పుతిప్పలు పెట్టిన విషయాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఐదేళ్ల కిందట వంట గ్యాస్ సిలిండర్ రూ.300 పైచిలుకు ఉండేది. ‘ఆధార్’తో ముడిపెట్టాక సిలిండర్‌కు రూ.1300 వరకు వసూలు చేసి, సబ్సిడీ నగదును బ్యాంకులో జమ చేయకుండా చావబాదిన జ్ఞాపకాలు జనాన్ని ఇంకా వీడనేలేదు. వ్యవసాయోత్పత్తుల ధరలు మార్కెట్‌లో చుక్కలను తాకుతున్నా, అన్నదాతలు మాత్రం గిట్టుబాటు ధరలు దక్కక అల్లాడిపోయారు.
ఇదేం పాలన బాబోయ్!
ధరల పెరుగుదలతో ప్రజలు అల్లాడుతుంటే ఇవేమీ పట్టనట్లుగా పదవుల కోసం ఢిల్లీ చుట్టూ తిరగడంతోనే ఐదేళ్ల పుణ్యకాలాన్ని గడిపేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిసహా తెలంగాణ మంత్రులంతా సగటున వంద సార్లకు తక్కువ కాకుండా హస్తిన వెళ్లొచ్చారంటే అతిశయోక్తి కాదు. ఒకవైపు కనీస సౌకర్యాలు కల్పించకుండా, మరోవైపు పన్నులు వసూలు చేసి ప్రజలను తీవ్ర వేదనకు గురిచేశారు. ఒకవైపు కరెంటు కోతలు కొనసాగిస్తూనే, సర్‌చార్జీల బాదుడుతో నడ్డి విరిచేయడాన్ని జనమింకా మరువలేదు. బస్సు చార్జీలనూ పెంచేసి, ప్రయాణాలంటేనే ప్రజలు భయపడే స్థితి కల్పించారు.
గ్రూపు తగాదాలే
ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తరువాత అధికార పార్టీలో గ్రూపు తగాదాలు ఒక్కసారిగా జూలు విదిల్చి కాంగ్రెస్ అంటే ఇదేరా... అనే దుస్థితి కల్పించాయి. ఏ జిల్లాలో చూసినా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయి ఆధిపత్య పోరుకు తెరదీశారు. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించడం సాధారణమే అయినా ప్రభుత్వాన్ని అధికార పార్టీ నేతలే ఎండగట్టడం గడచిన ఐదేళ్లలో నిత్యకృత్యమైంది. కార్యకర్తలను ఎమ్మెల్యేలను తిట్టడం... ప్రజాప్రతినిధులు మంత్రులను విమర్శించడం... అమాత్యులు ముఖ్యమంత్రిని ఎండగట్టడం సర్వసాధారణమైంది. ప్రభుత్వ సారథిగా ఉన్న ముఖ్యమంత్రి పదవిని ప్రజల దృష్టిలో పలుచన చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్సేనని చెప్పకతప్పదు.
సెన్సెక్స్‌లా ఎగబాకిన ప్రభుత్వ వ్యతిరేకత
అధిక ధరలు, అస్తవ్యస్త పాలన, గ్రూపు తగాదాలే కాకుండా విభజన ఉద్యమాలతో రాష్ట్ర అట్టుడికిపోయింది. ‘సుస్థిర ప్రభుత్వం, అభివృద్ధి, సంక్షేమం’ నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అసలు లక్ష్యాన్ని విస్మరించి తన ఐదేళ్ల పాలనను విభజన ఉద్యమాలతోనే గడిపేసింది. ఎప్పుడు చూసినా బంద్‌లు, ఎటు చూసినా ధర్నాలు... ఎవరిని కదిలించినా రగిలే భావోద్వేగాలతో రాష్ట్రం అట్టుడికిపోయింది. ఈ ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత షేర్ మార్కెట్‌లో సెన్సెక్స్ మాదిరిగా ఎగబాకింది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, మరెన్ని కష్టాలు వచ్చినా దశాబ్దాలపాటు కాంగ్రెస్ జెండాను వీడని కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు హస్తం పేరు వింటేనే భయపడి పారిపోయే పరిస్థితి ఏర్పడింది.
నడిపించే నాయకుడేరి?
పదేళ్ల పాలన పూర్తయింది. ఎన్నికలొచ్చాయి. ఏ రాజకీయ పార్టీకైనా సారథితో ఎన్నికల యుద్దానికి వెళుతుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. సారథి లేకుండానే ఎన్నికల్లోకి వెళుతున్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ శ్రేణులు సైతం ఎవరి నాయకత్వం కింద పనిచేయాలో అర్థంకాని పరిస్థితి. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల మొదలు సీనియర్లు ఎవరిని కదిలించినా అధికారంలోకొస్తే తానే సీఎం అని చెబుతూ గ్రూపులకు తెరదీశారు. ఎవరికి వారే సీఎం అని చెప్పుకుంటూ వెళుతున్నా పార్టీని నడిపించే, ప్రజలను సమీకరించే నాయకుడు మాత్రం కాంగ్రెస్‌లో కరువయ్యారు. తెలంగాణ తెచ్చిన, ఇచ్చిన పార్టీ తమదేనని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఒక్కటంటే ఒక్క బహిరంగ సభ కూడా నిర్వహించలేని దుస్థితిలో ఉన్నారంటే, నాయకత్వ లోపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితేనేం.....జిందా తిలిస్మాత్ ఉందిగా....!
పైన పేర్కొన్న అంశాలన్నీ చూశారుగా...కాంగ్రెస్ పార్టీకి ఎన్ని అవరోధాలున్నాయో! అయితేనేం...వాటిని అలవోకగా అధిగమించి తెలంగాణలో అధికారం కైవసం చేసుకుంటామని ధీమాతో టీ కాంగ్రెస్ నేతలున్నారు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, మరెన్ని కష్టాలు పడినా ఆరు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను నెరవేర్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని సగర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ ఒక్క అస్త్రం తమకు రామబాణ ం వంటిదని, ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపిస్తుందని చెబుతున్నారు. ఇదే అంశంతోనే తాము ఎన్నికల్లోకి వెళ్లి అధికారాన్ని కైవసం చేసుకుంటామని చెబుతున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా పార్టీ అతిరథ మహారథులందరినీ ఎన్నికల ప్రచారానికి పిలిపించి తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఎదుర్కొన్న ఇబ్బందులను వివరిస్తూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఏ విధంగా నెరవేర్చామో వివరిస్తామంటున్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఏ తీర్పు ఇస్తారో వేచి చూడాల్సిందే!