* తెలంగాణలో 72% పోలింగ్
* తుది వివరాలతో 75 శాతానికి చేరే అవకాశం
* గత రెండు సాధారణ ఎన్నికలకంటే అధికం
* అభ్యర్థుల భవితవ్యంపై తీర్పు ఇచ్చిన ఓటర్లు
* 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాలకు ప్రశాంతంగా ఎన్నికలు.. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు భద్రం
* రీ-పోలింగ్ నిర్వహించాల్సిన కేంద్రాలపై నేడు నిర్ణయం
* ఈవీఎంల మొరాయింపుతో కొన్నిచోట్ల ఇబ్బందులు
* పోలింగ్ స్లిప్పులు లేనిదే అనుమతించని సిబ్బంది
* ఓటర్ జాబితాల్లో తప్పులతో గందరగోళం
* మెదక్, నల్లగొండల్లో అత్యధికంగా 81% పోలింగ్
* బద్దకించిన హైదరాబాదీ.. అత్యల్పంగా 53% నమోదు
సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ర్టంలో ఏర్పడబోయే తొలి ప్రభుత్వాన్ని ఎన్నుకోడానికి తెలంగాణ ఓటర్లు పోటెత్తారు. తమ బంగరు భవితకు బాటలు వేసే నాయకులను గెలిపించుకోడానికి పోలింగ్ కేంద్రాలకు వెల్లువెత్తారు. హామీలు గుప్పిస్తూ బరిలో నిలిచిన అభ్యర్థులకు తమ ఓటుతో సమాధానమిచ్చారు. తెలంగాణ పగ్గాలు ఎవరికి అప్పగించాలో తీర్పునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా బుధవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉద్యమ చైతన్యానికి, ఎన్నికల సంఘం ప్రచారం కూడా తోడుకావడంతో ఈసారి భారీ పోలింగ్ నమోదైంది. గత రెండు సాధారణ ఎన్నికలకన్నా ఎక్కువ ఓటింగ్ జరగడం విశేషం.
పది జిల్లాల్లోని 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాలకు 72 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. గురువారం వరకు అందే తుది సమాచారాన్ని కూడా క్రోడీకరిస్తే... ఇది 75 శాతానికి చేరే అవకాశముందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. తెలంగాణలోని 2.81 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 2.10 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పారు. 2009 ఎన్నికల కంటే దాదాపు రెండున్నర శాతం మేర పోలింగ్ పెరిగిందన్నారు. అక్కడక్కడా చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, రీ పోలింగ్ కోసం జిల్లాల ఎన్నికల అధికారుల నుంచి ప్రస్తుతానికి ఎలాంటి విజ్ఞప్తి అందలేదని ఆయన పేర్కొన్నారు.
గురువారం పార్టీల అభ్యర్థులతో ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు సమావేశమవుతారని, పోలింగ్ కేంద్రాల వారీగా సమీక్ష జరుగుతుందని చెప్పారు. నమోదైన ఓట్ల సంఖ్యను, ప్రిసైడింగ్ అధికారులు ఇచ్చిన స్లిప్పులను పరిశీలించిన తర్వాత ఎక్కడైనా రీ-పోలింగ్ అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో పోలింగ్ కేంద్రంపై మావోయిస్టులు దాడి చేసి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు) ఎత్తుకెళ్లినట్లు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఆరు గంటల్లోపు ఓట్లు వేయడానికి వచ్చిన వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని, కొన్ని చోట్ల రాత్రి పది గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగిందని వెల్లడించారు.
పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్‌రూములకు తరలించి, కేంద్ర సాయుధ బలగాల (సీఆర్‌పీఎఫ్)తో భద్రత కల్పించినట్లు తెలిపారు. అభ్యర్థుల తరఫున కూడా పహారాకు అనుమతిస్తామన్నారు. ఈవీఎంలున్న గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఉదయం 7 గంటలకు ముందు నిర్వహించిన మాక్ పోలింగ్‌లో సమస్యలు తలెత్తిన 208 ఈవీఎంలను మార్చినట్లు భన్వర్‌లాల్ వివరించారు. అలాగే పోలింగ్ జరుగుతున్న సమయంలో మొరాయించిన 198 యంత్రాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో మొత్తం 84,778 బ్యాలెట్ యూనిట్లను వినియోగించినట్లు చెప్పారు.
పోలింగ్‌లో పదనిసలు..
ఎండలు ముదరడంతో ఉదయమే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. అన్ని కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే కొన్ని చోట్ల ఓటింగ్ యంత్రాలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అదనపు ఈవీఎంలను ఉపయోగించి పరిస్థితిని అధికారులు చక్కదిద్దారు. ఓటర్ స్లిప్పులు అందని వారు కాస్త ఇబ్బంది పడ్డారు. పోలింగ్ కేంద్రాల నంబర్లు, ఓటర్ జాబితాలోని క్రమ సంఖ్య ఆధారంగా స్లిప్పులు పొందే క్రమంలో కొంత ఇబ్బందిపడ్డారు.
జాబితాలో పేర్లు లేకపోవడం, గుర్తింపు కార్డులో ఉన్న క్రమ సంఖ్య.. ఓటరు జాబితాలోని సంఖ్యతో సరిపోలకపోవడం, జాబితాలోని ఫొటోలు తారుమారు కావడం వంటివి ఓటర్లను గందరగోళానికి గురిచేశాయి. ఓటరు స్లిప్పులు కావాల్సిందేనని పలుచోట్ల పోలింగ్ సిబ్బంది పట్టుబట్టడంతో ఓటర్లు ఇబ్బందిపడ్డారు. ఈ సమస్యలతో కొందరు ఓటు వేయకుండానే వెనుదిరిగారు.
కాగా, పలు ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ, అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల్లోకి చొచ్చుకుని వెళ్లడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఇన్నోవా వాహనంలో రూ. 2.50 కోట్లు తరలిస్తుండగా అవి కాలిపోవడం సంచలనం సృష్టించింది. మెదక్ జిల్లా గజ్వేల్‌లో దౌర్జన్యం చేస్తున్నారన్న ఆరోపణపై టీడీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మెదక్‌లో పోలింగ్ సిబ్బంది ఒక పార్టీకి ఓట్లు వేయాలని చెబుతున్నారంటూ అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి ఫిర్యాదు చేశారు.
కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలపై టీడీపీ అభ్యర్థి విరుచుకుపడ్డారు. పోలీసులు కూడా ఇళ్లలోకి వెళ్లి లాఠీచార్జ్ చేశారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోనూ పార్టీల మధ్య కొంత అలజడి రేగింది. ఓటర్లు క్యూలో నిల్చోలేదని కొన్ని చోట్ల పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.
పోలింగ్ రోజున ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ జంటనగరాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో పోలింగ్ నమోదు కాలేదు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పార్కులు, సినిమాహాళ్లు, దుకాణాలు మూసేసినా ఫలితం కనిపించలేదు. నగరంలో పోలింగ్ కేంద్రాల చిరునామా తెలుసుకోడానికి ఓటర్లు ఇబ్బంది పడ్డారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ, పోలింగ్ ఏర్పాట్లలో జీహెచ్‌ఎంసీ ఘోరంగా విఫలమైంది. కాగా, తెలంగాణలో జరిగిన ఎన్నికలపై ఒపీనియన్, ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను ప్రసారం చేయడం లేదా పత్రికల్లో ప్రకటించడానికి వీల్లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
గతంకన్నా పెరిగిన ఓటింగ్
2004, 2009 ఎన్నికలకన్నా.. ఈసారి అత్యధిక పోలింగ్ నమోదుకావడం విశేషం. బుధవారం రాత్రి వరకు 72 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే పూర్తి వివరాలు అందిన తర్వాత ఇది మరింత పెరిగే అవకాశముంది. ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం విస్తృత ప్రచారం చేసింది. ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జంటనగరాల్లో అన్ని దుకాణాలను మూసేశారు. ఆఖరికి టీ-కొట్లు కూడా సాయంత్రం వరకు తెరవలేదు. ఈసీ వెల్లడించిన ప్రకారం అత్యధికంగా మెదక్, నల్లగొండ జిల్లాల్లో 81 శాతం పోలింగ్ నమోదైంది.
జనం ఓటెత్తారు
Published Thu, May 1 2014 1:14 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement