యోగానందం!
అక్షర తూణీరం
ఇప్పటివాళ్ల కోసం ‘సెలాసనాల’ రూపకల్పన చేస్తే బాగా క్లిక్ అవుతుంది. ‘సెల్ఫీ పాదాసనం’, ఇలా సెలాసనాలైతే ఎన్ని గంటలైనా నడుస్తాయి.
రెండురోజుల పాటు దేశాన్ని యోగాసనాలతో ఒక ఊపు ఊపేశారు. మహానేత నుంచి మామూలు నేతల దాకా రకరకాల యోగ భంగిమల్లో కనిపించి జాతికి సందేశాన్నీ, స్ఫూర్తినీ ఇచ్చారు. ఒకడికి పుట్టె, ఇద్దరికి పుట్టె, అర్థరాత్రి అందరికీ పుట్టె అని సామెత. మొన్న యోగా దినోత్సవం రోజు అర్థ భూగోళం యోగ ముద్రల్లో నిలిచింది. రేడియోలు, పత్రికలు, టీవీలు యోగ ఘోషతో మార్మోగాయి.
యోగా గురువులు రంగంలోకి దిగి దాని ప్రాశస్థ్యాన్నీ, ప్రాచీనతనీ వివరించారు. వేల సంవత్సరాలుగా ఈ మహత్తర కళ మన దగ్గర ఉంది. ఇది భారతీయుల విద్య. రోజూ కాసేపు యోగా చేసి, ధ్యానముద్రలో కూచుంటే లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకున్నట్టేనన్నారు ప్రధాని మోదీ. మనల్ని ప్రశాంతంగా ఏ ప్రధాని బతకనిచ్చాడు కాబట్టి? ఇంతకు ముందొక ప్రధాని మూత్ర యజ్ఞాన్ని ఆచరిస్తూ ఎందరికో స్ఫూర్తిని చ్చారు. కానీ చాలామంది నాగరీ కులు, మూత్రము సేవించి ‘నూరేళ్లు జీవించుటకన్న, మద్యము సేవించి అరువదేండ్లు బతుకుట మేల’ని తీర్మానించుకు న్నారు. కొన్నాళ్లు ‘ఆయిల్ పుల్లింగ్’ ఆంధ్ర రాష్ట్రాన్ని పుక్కిలి పట్టి వదిలింది. చంద్రబాబుకి ప్రత్యా మ్నాయాలంటే నమ్మకం, ఇష్టం. రాజకీయాల్లో కాదు, ఇలాంటి వైద్య విషయాల్లో. హైదరాబాదు చేపమందు ఆయన హయాంలో ప్రపంచ ప్రాచుర్యం పొందింది. తరువాత అది మందు కాదు, ప్రసాదం అయింది. అంటే కేవలం నమ్మకం.
యోగ పతంజలి చాలా పూర్వీకుడే. ‘పురాణ మిత్యేవ న సాధు సర్వమ్’ అని కూడా మన పూర్వీకులే చెప్పారు. అయినా ఇప్పుడు పతంజలిని పక్కన పెట్టి వేరే బ్రాండ్ నేమ్‌లు వచ్చాయి. ఇందులోంచి భయంకరమైన వ్యాపార సంస్కృతి పుట్టు కొచ్చినట్టు కనిపిస్తోంది. అరగంట యోగా జాతకాన్ని మార్చేస్తుందని పెద్దలు ప్రచారం చేస్తున్నారు. అయితే, ట్రాఫిక్ పోలీసు రోజూ ఎనిమిది గంటలు యోగాలోనే ఉంటాడు. మెదడునీ శరీరాన్నీ సంలీనం చేస్తాడు. ఒకసారి అతనికి వైద్య పరీక్షలు చేయించండి. భూమి గుండ్రంగా కాదు బల్లపరుపుగా ఉందని మన ప్రాచీనులు నమ్మేవాళ్లు. దానికి ఆకర్షణ శక్తి ఉందని తెలియదు. చెట్టుకి ప్రాణం ఉందని మొన్నమొన్నటి దాకా గ్రహించలేక పోయాం.
ఇంతగా ప్రజారోగ్యం గురించి పట్టించుకునే నేతలు మద్యపానం ఊసెత్తరు. బీడీకట్టల మీద పుర్రెబొమ్మ వేయాలంటే భయం. ఇంకా ఎన్నో కల్తీల గురించి అస్సలు మాట్లాడరు. నీళ్లు, పాలు, కూరలు, పండ్లు, గుడ్లు, మాంసాలు సర్వం కెమికల్స్ నింపుకుని వస్తున్నాయి. వాటిపై ప్రభుత్వ నిఘా ఏ మాత్రం లేదు. ఈనాటి మనుషులకు కొంత వ్యాయామం అవసరమే. యోగా, ధ్యానం ఇవి సాధనాలు.
ఇప్పటివాళ్ల కోసం ‘సెలాసనాల’ రూపకల్పన చేస్తే బాగా క్లిక్ అవుతుంది. కుడి చేత్తో ఫోను పట్టుకుని ఎడమ చెవితో వినడం, అలాగే ఎడమ చెయ్యి కుడిచెవి, రకరకాల కర విన్యాసాలను సెల్ ఆధారంగా చేసుకోవాలి. వృక్షా సనంలో సెల్‌లో భాషించుట, కూర్చుని కాళ్లు చాచి, కాలి వేళ్లకు సెల్ఫీ స్టిక్ ధరింపచేసి, సెల్ఫీ తీసుకొనుట ‘సెల్ఫీ పాదాసనం’. ఇంకా అరవై నాలుగు విధాలు ఎవరికి వారు డిజైన్ చేసుకోగలరు. ఇలా సెలాసనాలైతే ఎన్ని గంటలైనా నడుస్తాయి. జైహింద్!
శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)