
దేశభక్తుడి స్వీయచరిత్ర
- పాత బంగారం
అతిమంచితనం, ఆత్మన్యూనతాభావం;
ఎదిరించవలసిన ప్రతిచోటా సర్దుకుపోవటం;
తన పైవారిమాట కాదనలేని బలహీనత;
తన నీడన ఎదిగినవారే తనను సహించలేకపోవటం; తొలి అడుగు తనదే అయినా తుదికంటా తోవ తొక్కనియ్యని అధినాయకత్వం;
కూతుళ్లు, భార్య మరణశయ్య వంటి దుస్థితిలో ఉన్నా చూపు దేశంవైపే; కొన్ని విషయాలలో ఎంత ఆధునికుడో, ఆధునికులు ఆధునికం అనుకొనే భావాలలో అంత సనాతనుడు;
ఇన్ని వైరుధ్యాల కలనేత జీవితం గడిపిన నేత కొండ వెంకటప్పయ్య. చూడటానికి ఒకింత బలహీనంగా కనబడే యీ పెద్దమనిషి నిజానికి పిట్టపిడుగు వంటివాడు.
స్థూలంగా వెంకటప్పయ్య గొప్పతనం ఏమిటి?
త్రివిధ బహిష్కరణను (కళాశాలలు, ప్రభుత్వోద్యోగాలు, న్యాయస్థానాలను వదిలెయ్యటం) గాంధీగారు ప్రకటించకముందే బంగారు బాతువంటి న్యాయవాద వృత్తిని స్వచ్ఛందంగా వదిలేశారు. ఖాదీ ఉద్యమాన్ని భోగరాజు పట్టాభి సీతారామయ్య ‘‘హైజాక్’’ చేయకముందు ఆ ఉద్యమానికి ఆంధ్రదేశంలో అండాదండా కొండ వెంకటప్పయ్యగారే.
పెదనందిపాడు సహాయనిరాకరణోద్యమం పంతులుగారి పథకం. ఆధినాయకత్వం దీనిని అర్ధాంతరంగా ఆపివేయకపోతే దేశమంతా అనుసరించేంత ఆదర్శప్రాయంగా జరిగింది.
ముక్కుసూటిమనిషి, తాను ఒకపక్షంవాడైనా ఎదుటి పక్షంవైపు న్యాయం కనబడితే దానినే సమర్థించేతత్త్వం.
వెంకటప్పయ్య స్వీయచరిత్ర చదువుతుంటే ఆయన రెండు ధ్యేయాల సాధన కొరకు తపించినట్లు తెలుస్తుంది. మొదటిది భారతదేశ స్వాతంత్య్రం. స్వాతంత్య్రోద్యమం నిరసనల స్థాయి నుండి ఉద్యమరూపు తీసుకొంటున్నప్పటి నుండి ఆయన ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. భరతజాతి స్వేచ్ఛను పొందటం కళ్లారా చూశారు.
రెండవది ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం. అదీ మద్రాసు పట్నం సహితంగా. కొండవారు జీవించి ఉండగా ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడలేదు. ఉన్నా ఆయన సంతోషించేవారు కాదేమో! మద్రాసు మనకు రాలేదుగా.
వెంకటప్పయ్య జీవితాన్ని శోధనగా చదివితే ఆయన నాయకత్వం వహించడానికి, ఆధిక్యత పొందడానికి ప్రాముఖ్యత వహించడానికి పెనుగులాడినట్లు కనబడదు. తన అనుచరులను, నాయకులను చేసి వారికి తాను అనుచరుడయ్యారు. రాజకీయాలు స్వప్రయోజనానికి, స్వలాభానికి కాదు; మానవసేవకు లోక కళ్యాణానికి సాధనం అని ఆయన గ్రహించినట్లు గ్రహించినవారు నాడే తక్కువ.
కొండ వెంకటప్పయ్య స్వీయచరిత్రను తమ అంతిమ సంవత్సరాలలో స్వతంత్రం వచ్చాకే రాశారు. ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్న సమయం వరకు అంటే 1932ల వరకు మాత్రమే తన జీవితగాథను గ్రంథస్థం చేయగలిగారు. దక్షిణభారత హిందీ ప్రచారసభ (ఆంధ్ర) వారు 1952లో కొంత చరిత్రను మొదటి భాగంగా ప్రచురించారు. ఇందులో 1918 వరకు నడిచిన సంఘటనలు ఉన్నాయి. అక్కడినుండి 1932 వరకు జరిగిన గాథను రెండవ భాగంగా 1955లో ప్రచురించారు. రెండు భాగాలను కలిపి ఒకే సంపుటంగా 1966లో ప్రచురించారు.
వెంకటప్పయ్య రచనా వ్యాసంగం కేవలం స్వీయచరిత్రతో ఆగిపోలేదు. ‘సృష్టి విచారం’ అనే సైన్సు గ్రంథం రాశారు. బ్రహ్మం, పరతత్త్వం వంటి ‘‘సీరియస్’’ విషయాలను చర్చిస్తూ ‘‘బ్రహ్మవిచారము’’ రాశారు. జైలులో ఉన్నప్పుడు ‘‘డచ్చి ప్రజాస్వామికం’’ అనే గ్రంథాన్ని అనువాదం చేశారు. ‘‘ప్రాచీన ఇటాలియా చరిత్ర’’ను కూడా అనువాదం చేశారట. వీటన్నింటిలోకీ ఆయన స్వీయచరిత్ర విలువైనది. స్వోత్కర్షతో నింపలేదు. ఉద్యమకారులతో విభేదించే విషయాలను దాచిపెట్టకుండా రాశారు. విలువ తగ్గించే సంఘటనలు పేర్కొనవలసివచ్చినప్పుడు సంయమనం పాటించారు.
(దేశభక్త కొండ వెంకటప్పయ్య స్వీయచరిత్రను ఆయన మరికొన్ని రచనలతో కలిపి ‘సంస్కృతి’ ప్రచురించింది. సంపాదకుడు: మోదుగుల రవికృష్ణ. పై భాగం ఆ సంపాదకీయంలోనిది. పుస్తక పేజీలు: 304(హార్డుబౌండు); వెల: 250; ప్రతులకు: నవోదయా బుక్‌హౌస్, కాచిగూడ; ఫోన్: 040-24652387)