నిర్వాసితులంటే ఎందుకీ కక్ష? | Polavaram dam on state government's attitude | Sakshi
Sakshi News home page

నిర్వాసితులంటే ఎందుకీ కక్ష?

Published Wed, Jun 17 2015 12:01 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

నిర్వాసితులంటే ఎందుకీ కక్ష? - Sakshi

నిర్వాసితులంటే ఎందుకీ కక్ష?

పోలవరం డ్యామ్ కోసం నిర్వాసితులైన వారంతా దళితులు, వెనుకబడిన వర్గాలే.  రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఆ వర్గాలపట్ల దానికి ఎలాంటి శ్రద్ధాలేదని భావించే విధంగా ఉంది. తూర్పు గోదావరిలోని అంగలూరు, పశ్చిమగోదావరిలోని పోలవరం మండలాలలో గ్రామాలను ఖాళీ చేయించడానికి అధికారులు చూపిన అత్యుత్సాహం దారుణం. ఈ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములకు ఇప్పటి వరకు ఇచ్చిన పరిహారం చాలా తక్కువగా ఉందన్న విషయాన్ని గమనించాలి.
 
 ‘వేయి తుపాకుల కంటే, ప్రతికూలతతో ఉండే నాలుగు వార్తాపత్రికలంటేనే నేను ఎక్కువ భయపడతాను.’ రెండు వందల ఏళ్ల క్రితం ఫ్రెంచ్ సేనాని నెపో లియన్ బోనాపార్టీ అన్నమాట ఇది. ప్రజాస్వామ్య చైతన్యం వెల్లివిరిసే భారత్ వంటి దేశంలో పత్రికలు నెపోలియన్ కాలానికి మించి ప్రజాభిప్రాయాన్ని నిర్మించే పనిని నిర్వహిస్తున్నాయి. కాబట్టే పోలవరం ప్రాజెక్టు కోసం భూము లు కోల్పోయి నిర్వాసితులుగా మిగిలిపోయిన వేలాది మందికి పత్రికలూ, మీడియాయే ఆశాజ్యోతులుగా కనిపిస్తున్నాయి. కానీ, ఈ వ్యాసం ఉద్దేశం పోలవరం డ్యామ్ ఉపయోగాల గురించి చర్చించడం కాదు. అక్కడి నిర్వాసిత కుటుంబాలకు చెందిన వేలాది మంది మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపు తున్న అమానవీయ ధోరణి గురించి వెల్లడించడంతో పాటు, ఆ సమస్యను ఎంత సులభంగా పరిష్కరించే అవకాశం ఉన్నదో చెప్పడమే.
 
 నిర్వాసితులూ, వాళ్ల సమస్యలూ వికారంగా ఉంటాయి తప్ప, సినీతా రల జీవితాల మాదిరిగా తళుకు బెళుకులతో ఆకర్షణీయంగా ఉండవు. చానళ్లు కూడా ఏదైనా ఒక విషాదం పట్ల ఒకరోజుకు మించి దృష్టి పెట్టవు. ఇంతకీ అసలు సమస్య- పోలవరం ప్రాజెక్టు, అందుకు అవసరమైన మౌలిక వస తుల కల్పన, కాలువల తవ్వకం వంటి అవసరాలకు భూమిని సేకరించారు. దీనికి చాలా తక్కువగా, బ్రిటిష్ ఇండియా ఏలుబడిలో రూపొందించిన భూసేకరణ చట్టం-1894 నిర్దేశించిన మేర పరిహారం ప్రకటించారు. కొత్తగా భూసేకరణ చట్టం-2013 అమలులోకి వచ్చింది. కానీ దీనిని ఇక్కడి నిర్వాసితులకు వర్తింపచేయడంలేదు. ఈ నిర్వాసితులలో ప్రధానంగా ఉభ యగోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాల వారు ఉన్నారు. ఈ పథకం కోసం ఇప్పటి దాకా సేకరించినట్టు చెబుతున్న భూమి దాదాపు 30,000 ఎకరాలు. వచ్చే ఐదేళ్లలో మరో రెండు లక్షల ఎకరాలు అవసరమవుతాయి.
 
 ఈ పథకం కోసం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం, తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలాలలో ఖాళీ చేయించిన గ్రామాల వారు తక్కువ నష్ట పరిహారం పొందుతున్నారు. అంటే ఆ పరిహారం 1894 నాటి భూసేకరణ చట్టం ప్రకారమే తప్ప, కొత్తగా వచ్చిన 2013 భూసేకరణ చట్టం నిబంధనల మేరకు అందడం లేదు. ఇదీ సమస్య. ఇందుకు సంబంధించిన కొన్ని వాస్తవాలు మొదట తెలియాలి. భూసేక రణ చట్టం 2013 ఆమోదం పొందడానికి ముందు ఖాళీ చేయించిన గ్రామా లకు లేదా సేకరించిన భూములకు తాజా పరిహారం గురించి తాము సిఫా రసు చేయలేమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాటుతోంది. ఈ వాస్తవాలను పరి శీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ మూడు జిల్లాలకు చెందిన ఏడు లక్షల మంది నిర్వా సితులకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సంగతి అవగాహనకు వస్తుంది.
 
 పోలవరం, దేవీపట్నం మండలాల భూములతో పాటు, డ్యామ్ కుడి, ఎడమ కాలువల నిర్మాణం కోసం ప్రభుత్వం 25,000 ఎకరాల భూమిని కూడా సేక రించింది. ఈ పరిణామాలతో పోలవరం, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాలకు చెందిన రైతులు ఎదుర్కొంటున్న ఇక్కట్లు దిగ్భ్రాంతిని కలిగిస్తు న్నాయి. సారవంతమైన భూములను ఎకరాకు రూ.1.5 లక్షలు చెల్లించి తీసు కున్నారు. కానీ ప్రస్తుతం వీటి మార్కెట్ ధర ఎకరం రూ.45 లక్షలు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పేదలుగా మార్చింది. అదెలాగంటే, పోలవరం మండలంలో డ్యామ్ కోసం భూములు ఇచ్చి నిర్వాసితులైన వారికి ఇళ్ల స్థలా లు ఇవ్వడానికి బుట్టాయగూడెం మండలం, ముద్దపగడం గ్రామంలో భూమి ని సేకరించారు.
 
 ఇలాంటి అవసరాల కోసమే ప్రగడపల్లి అనే చోట కూడా భూమిని సేకరించారు. నివేశన స్థలాల కోసం భూమిని సేకరించడం తప్పు కాదు. కానీ సస్యశ్యామలమైన వారి భూములకు ఎకరాకు రూ. 1.5 లక్షలు వెల కట్టడం ఏమిటి? పైగా కొత్త చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించేం దుకు ముందుకు వస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డడం దేనికి? మరో పక్క, పోలవరం డ్యామ్‌ను జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించినందున, ఇకపై ఆ డ్యామ్ ఖర్చులతో, నష్టపరిహారం చెల్లింపులతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అదంతా కేంద్రమే చూసుకోవాలని ఇటీవల రాష్ట్ర ప్రభు త్వం తరచూ చెబుతోంది.
 
 కొత్తచట్టం నిర్వాసితులకే అనుకూలం
 భూములను సేకరించడం, గ్రామాలను ఖాళీ చేయించడం వంటి పను లు 2013 చట్టం కంటే ముందే జరిగినప్పటికీ, కొత్త చట్టంలోని సెక్షన్ 24(2) చాలా సరళమైన భాషలో, సుస్పష్టంగా ‘1894 నాటి చట్టం మేరకే భూ సేకరణ జరిగినప్పటికీ, అందుకు సంబంధించిన పరిహారం చెల్లించినప్పటికీ, సంబంధిత వ్యక్తులు దానిని స్వీకరించినప్పటికీ, కొత్త చట్టం జనవరి 1, 2014కు ఐదేళ్ల ముందే రావలసి ఉంది కాబట్టి వారికి ఆ కొత్త చట్టం మేరకే పరిహారం ఇవ్వాలి’ అని నిర్దేశిస్తున్నది. పోలవరం డ్యామ్ కోసం డిసెంబర్ 31, 2009కు ముందే భూసేకరణ జరిపారు.
 
 అదే సెక్షన్‌లో, అంటే 24(2)లోని రెండో భాగం కూడా నిర్వాసితులకే మరింత అనుకూలంగా ఉంది. ఆ భాగం ఇలా పేర్కొంటున్నది: ‘నిర్వా సితులు డబ్బు స్వీకరించినప్పటికీ, తమ భూములను అప్పగిస్తూ వారు పత్రాల మీద సంతకాలు చేసినప్పటికీ, గ్రామాలను ఖాళీ చేయించి, ఇళ్లు తీసుకున్నప్పటికీ- వారంతా జనవరి 1, 2014 నాటికి అక్కడ ఉన్నవారే. ఆ భూములను సాగు చేసుకుంటున్నవారే. కాబట్టి కొత్త చట్టం మేరకే పరిహారం అందించాలి.’
 
 పోలవరం డ్యామ్ జాతీయ పథకం. రాష్ట్ర ప్రభుత్వానికి దీనితో సంబం ధం లేదు. కానీ కేంద్రం పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు. దీనిని ఆసరా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా తలదూరుస్తున్నది. అయితే డ్యామ్ నిర్మాణం చేపట్టమనీ, నిర్వాసితులకు న్యాయం చేయమనీ త్వర లోనే న్యాయస్థానాలు కేంద్రాన్ని ఆదేశిస్తాయని ఆశించవచ్చు.
 
 కేంద్రం డబ్బు ఇస్తే డ్యామ్‌ను నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవ నరుల మంత్రిత్వ శాఖను కోరినట్టు తెలుస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ వేల కోట్ల రూపాయలను తన ఆశ్రీతుల పరం చేస్తుంది. ఇలాంటి అవి నీతికి అనుమతించే విధంగా ఉంటే ఆ శాఖ మంత్రి ఉమాభారతి రాజీ నామా చేయాలి.డ్యామ్ కుడి, ఎడమ కాలువల నిర్మాణం కోసం 2005 నుంచి 25,000 ఎకరాల భూమిని సేకరించారు. కానీ డ్యామ్ నిర్మాణంలో జాప్యం జరి గింది. పూర్తికావడానికి మరో 20 ఏళ్లు పడుతుంది. అంటే వినియోగం లోకి రావడం కంటే 35 ఏళ్లకు ముందే ఆ భూములను సేకరించారు. అది కూడా ఎకరాకు మార్కెట్ ధర రూ.45 లక్షలు (నల్లజర్ల, దేవరపల్లి, ప్రగడపల్లి మండలాలలో) ఉండగా, రూ.1.5 లక్షలే చెల్లించారు.
 
 జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం డ్యామ్ కోసం సేకరించిన భూమ లకు కొత్త చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి. ఇందుకు ప్రజలు పెట్టుకున్న విన్నపాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానాలు ఇవ్వాలి. నిజానికి జల వనరుల మంత్రిత్వ శాఖ ఇక్కడి నిర్వాసితుల పట్ల సానుకూలంగా స్పందిస్తు న్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుపుల్ల వేస్తున్నది. మరింత నష్టపరిహారం కోసం నిర్వాసితులు కేంద్రంతో పోరాడుతుంటే, కేంద్ర ప్రభుత్వానికి సాయం గా రాష్ట్రం న్యాయవాదులను ఎందుకు పంపించాలి? ఈ వ్యాసకర్త పెట్టుకున్న దరఖాస్తుపై మే 25, 2015న గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సలహా మండలి ఢిల్లీలో ఒక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశానికి వచ్చిన అధికారి వాస్తవాలు తెలుసుకుని విస్తుపోయారు.
 
 తాను రాష్ట్ర ప్రభు త్వంతో చర్చించి చెబుతానని వెల్లడించారు. అయినా ఇంతవరకు రాష్ట్ర ప్రభు త్వం నుంచి ఇక్కడి వారికి ఎలాంటి సానుకూల సమాధానం అందలేదు. ‘ఒకరే చనిపోతే అది విషాదం. పది లక్షల మంది చనిపోతే అది గణాంకాల విషయం’- ఇది 70 ఏళ్ల క్రితం రష్యా నేత జోసెఫ్ స్టాలిన్ అన్నమాట. దురదృ ష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం అదే పంథాలో ఆలోచిస్తున్నది. పోలవరం డ్యామ్ కోసం నిర్వాసితులైన వారంతా దళితులు, వెనుకబడిన వర్గాలే. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఆ వర్గాల పట్ల దానికి ఎలాంటి శ్రద్ధా లేదని భావించే విధంగా ఉంది. తూర్పు గోదావరిలోని అంగలూరు, పశ్చిమగోదావరిలోని పోలవరం మండలాలలో గ్రామాలను ఖాళీ చేయించడానికి అధికారులు చూపిన అత్యుత్సాహం దారుణం.
 
కానీ అదే ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరిస్తున్నప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లా వాసులను బంధువులుగా ఆదరించింది. కొత్త భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించడానికి తమకు అభ్యంతరం లేదని ఇప్పటికైనా రాష్ట్రం కేంద్రానికి లేఖ రాయాలి. అంగలూరు, దేవరగొంది, పోలవరం మండలాలలో అత్యుత్సా హం చూపిన అధికారులను శిక్షించాలి. ఈ ప్రాజెక్టు కోసం సేకరించిన భూము లకు ఇప్పటి వరకు ఇచ్చిన పరిహారం బంజారాహిల్స్‌లో ఐదు ఎకరాలకు చెల్లించే పైకం కంటే చాలా తక్కువగా చెల్లించిన విషయాన్ని గమనించాలి. అన్నట్టు మన పాలకులంతా ఉండేది బంజారాహిల్స్‌లోనే మరి!
 
 (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)
- పెంటపాటి పుల్లరావు
e-mail:Drpullarao1948@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement