ప్రైవేటు విద్యతో ప్రమాదఘంటికలు | Private education is in danger situation | Sakshi
Sakshi News home page

ప్రైవేటు విద్యతో ప్రమాదఘంటికలు

Published Mon, Oct 26 2015 12:58 AM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM

ప్రైవేటు విద్యతో ప్రమాదఘంటికలు - Sakshi

ప్రైవేటు విద్యతో ప్రమాదఘంటికలు

ప్రపంచంలోని పెట్టుబడిదారి సిద్ధాంత కర్తలు, మేధావుల ఆదిగురువైన ఆడమ్‌స్మిత్ కూడా నాడు తన రచనలలో విద్య, వైద్య నిపుణతల అభివృద్ధి వంటి అంశాలలో ప్రభుత్వం పాత్ర గురించి విస్తారంగా చర్చించాడు. చంద్రబాబు మాత్రం, ఈ మొత్తం క్రమానికి విరుద్ధ దశలో ప్రయాణం చేస్తున్నారు. రాజధాని నిర్మాణాన్ని అతి పెద్ద ప్రైవేట్ వెంచర్‌గా మార్చివేశారు. పైగా సమస్త జీవన రంగాలనూ ప్రైవేటుపరం చేసే ప్రక్రియను ఆయన చేపట్టారు. రానున్న కాలంలో, సామాజిక అశాంతికి ఇది ఆరంభం అవుతుంది..!
 
 సమకాలీన ప్రపంచంలో విద్య ప్రజల జీవితాల, జీవన ప్రమాణాల తాలూ కు కీలక నిర్ణేతగా ఉంది. గత 3-4 దశాబ్దాల క్రితం కంటే కూడా నేడు విద్యా వంతులు కావడం అనేది జీవనోపాధికి తప్పనిసరి అవసరంగా మారింది. నేడు కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా పేరిట, దేశీయ యువజనులలో ‘నిపుణతల’ పెంపుదల కోసం శిక్షణా కార్యక్రమాలను చేపడుతోంది.  మన దేశ జనాభాలోని 65% మంది 35 ఏళ్ల వయసులోపున్న యువజనులే. కాగా, వీరిలోని అత్యధికులు నిరక్షరాస్యులూ, లేదా అతిస్వల్పస్థాయి విద్యా స్థాయిని కలిగినవారే. ఉదా :- మనదేశంలోని ఉపాధిరంగంలో ఉన్న కార్మికులలోని 70% మంది మాత్రమే కనీస స్థాయి విద్యావంతులు. అంటే, మిగతా 30% మంది నిరక్షరాస్యులే. పైగా, ఆ 70% మందిలో కూడా 25% వరకు కేవలం ప్రాథమిక విద్యలోపుగా చదువును ఆపేసినవారే. ఇదీ పరిస్థితి. కాగా, మన దేశంలోని విద్యారంగం గత రెండు దశాబ్దాలుగా  మరింతగా పేదలకు దూర మైపోయింది. ప్రైవేటు విద్య ప్రాధాన్యత శ్రుతిమించి పెరిగిపోయి, విద్య నేడు సామాన్య జనానికి అందని ద్రాక్షే అయిపోయింది.
 
 నేడు రాష్ట్రంలో, సీఎం చంద్రబాబు ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన యత్నాలను ఈ నేపథ్యంలోనే మనం చూడాలి. నిజానికి చంద్రబాబు హయాంలోనే 2004 నాటికల్లా పలు విశ్వవిద్యాలయాల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరిట, ఉన్నత విద్యారంగంలో డబ్బుపాత్ర పెరిగిపోయింది. అయి తే, అనంతరం 2004లో ఏర్పడిన వైఎస్‌ఆర్ ప్రభుత్వం, హయాంలో ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ పథకాన్ని ప్రవేశపెట్టడంతో నాటి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ధిక స్థోమత లేని లక్షలాది మందికి విద్యార్జనా అవకాశాలు ఏర్పడ్డాయి.
 కానీ నేడు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఆలోచనలతో టీడీపీ ప్రభుత్వం ముందుకు వస్తోన్న తీరు ముందుముందు మరింత ప్రమాదకరంగా పరిణ మించగలదు.
 
  మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఉన్న ప్రతి దేశంలోనూ ఆర్థిక అసమా నతలు సుదీర్ఘకాలంగా ఉన్నవే. కానీ, అవి ఆ వ్యవస్థల పునాదులను కుదిపివే యకుండా, కాపాడింది - ఆ దేశాల్లోని విద్యారంగాలే. అమెరికా, యూరప్ దేశాలు, జపాన్, చైనా, దక్షిణ కొరియాలవంటి అన్ని మార్కెట్ ఆధారిత దేశా లలోనూ తొలి నుంచీ విద్యారంగంలో ప్రభుత్వానికి పెద్దపాత్ర ఉంది. నేడు, దీనిని ‘సబ్సిడీల వ్యవస్థ’ అని కొందరు విమర్శంచవచ్చును. కానీ, ఈ ‘సబ్సి డీల’ వ్యవస్థ అనేదే, నిజానికి మన దేశంలో కూడా పలు దశాబ్దాలుగా దేశం లోని మెజార్టీ అట్టడుగు వర్గాలకు ఆసరా అయ్యింది. వాస్తవానికి, మన దేశం లోకంటే కూడా ఈ సబ్సిడీలు ధనిక పెట్టుబడిదారీ దేశాలలోనే అధిక స్థాయి లో ఉన్నాయి. తద్వారా అన్ని దేశాలలోనూ సామా జిక చలన శీలతను కాపా డుతూ వచ్చారు.
 
 1950లలో కేరళ రాష్ట్రం దేశంలోని పేద రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. కానీ, అక్కడ ప్రభుత్వాలు ఆరంభించి, కొనసాగించిన సార్వజనీన ఉచిత విద్య, వైద్యం వంటి అంశాలు నేడు ఆ రాష్ట్రాన్ని ‘మానవ అభివృద్ధి సూచిక’పై దేశంలోనే ఉన్నత స్థానంలో నిలిపాయి. అలాగే దక్షిణ అమెరికా ఖండంలోని క్యూబా తన నిబద్ధతతో నేడు ప్రపంచంలోనే అత్యున్నత విద్య, వైద్య రంగా లు ఉన్న దేశాల సరసన నిలిచి, ఐక్యరాజ్యసమితి ప్రశంసలను పొందుతోంది. ఇక, ప్రపంచంలోని పెట్టుబడిదారి సిద్ధాంత కర్తలందరికీ ఆదిగురువైన ఆడమ్ స్మిత్ కూడా నాడు విద్య, వైద్య, నిపుణతల అభివృద్ధి వంటి అంశాలలో ప్రభుత్వం పాత్ర గురించి విస్తారంగా చర్చించాడు. అదీ అసలు విషయం.
 
 కాగా, నేడు దేశంలో సంస్కరణలకు మార్గదర్శకుడనని భావించే చంద్రబాబు నాయుడు గారు మాత్రం, ఈ మొత్తం క్రమానికి విరుద్ధ దశలో ప్రయాణం చేస్తున్నారు. నిజానికి, గత 3-4 దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తం గానూ, సుమారు 2 దశాబ్దాలుగా మన దేశంలోనూ కూడా నయా ఉదార వాద, ప్రపంచీకరణ విధానాలు అమలు జరుగుతున్నాయి. వివిధ రంగాలలో భారీగా ప్రైవేటీకరణ జరిగింది. దీనితో ప్రపంచం అంతటా, నేడు ఆర్థిక అసమానతలు తీవ్రతరం అయ్యాయి. ఉదాహరణకు అమెరికాలో పోగవు తున్న సంపదలోని 99 శాతం భాగం, నేడు ఆ దేశంలోని ఒక్కశాతం మంది అతి పెద్ద ధనికుల పరమౌతోంది. కాగా, మిగతా 1 శాతం సంపద మాత్రమే మిగతా 99% ప్రజలకు దక్కుతోంది. నయా ఉదారవాద విధానాల నీడలో ఉన్న దేశాలు అన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే, 2008లో ప్రపంచ ఫైనాన్స్, ఆర్థిక సంక్షోభాలు మొదలయ్యాయి.
 
 ఈ సంక్షోభం నేడు మరింత లోతుగా వ్యవస్థల మూలాలను తొలిచేస్తోంది. ప్రపంచంలోని ధనిక దేశాలతో సహా అన్ని చోట్లా ప్రజలలో, ముఖ్యంగా యువజనులలో ఇది తీవ్ర అసంతృప్తికీ, వ్యవస్థ పట్ల వ్యతిరేకతకూ దారి తీస్తోంది. యూరో, అమెరికా, జపాన్‌లలో కూడా జరుగుతోన్న రాజకీయ పరిణామాలను దీనిలో భాగంగా నే చూడగలం. అన్ని ధనిక దేశాలలో కూడా జనసామాన్యం వామపక్ష భావాలు ఉన్న నేతలూ, పార్టీల దిశగా మళ్లక తప్పని స్థితి నేడు ఉంది.
 
 ఈ పరిణామాలు అన్నింటి వెనుకనా ఉన్నది గత 3-4 దశాబ్దాలుగా పెట్టుబడిదారీ దేశాలు అన్నింటిలోనూ అమలు జరిగిన ప్రైవేటీకరణ, నయా ఉదారవాద విధానాలే. ఈ విధానాల వలన విద్యారంగం వంటివి కూడా ప్రైవేటుపరం అవుతున్నాయి. అయితే, అక్కడ కొంతలో కొంత ఊరడింపుగా తొలి నుంచి సామాన్య విద్యార్థులు ‘విద్యారుణాల’పై ఆధారపడి చదువుకొనే పద్ధతి ఉంది. కానీ, దీని పాత్ర కూడా నేడు పరిమితమే. పైగా నేడు ప్రపంచంలో విపరీతంగా పెరిగిపోయిన ఆర్థిక పోటీ పరిస్థితుల్లో, వివిధ దేశాలలో ఉపాధి కల్పనా అవకాశాలు భారీగా క్షీణించి పోతున్నాయి.
 
 అంటే, ఒక పక్కన విద్యా సముపార్జన ఖరీదైనదిగా మారిపోతుండగా, మరోపక్కన ఈ ఉపాధి రహిత అభివృద్ధి క్రమం వలన నేడు ప్రపంచంలోని ధనిక దేశాలలో కూడా యువజనుల స్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలోనే యూరప్ లోని గ్రీస్ వంటి దేశాల తాలూకు యువజనులలో నిరుద్యోగిత స్థాయి 50%పైబడే ఉంది. అందుచేతనే నేడు ప్రపంచంలోని ధనిక దేశాలలో, ప్రస్తు తతరం యువజనులను ‘(భవిష్యత్) కోల్పోయిన తరం’గా పిలుస్తున్నారు.  అమెరికా వంటి దేశాలలో నేడు చదువుకునేందుకు తీసుకున్న విద్యా రుణా లను కూడా చెల్లించలేని దుస్థితిలో యువతరం పడిపోతోంది. దీనికి కారణం వీరికి చదువుల అనంతరం ఉపాధి లభించకపోవటమో, లేదా తాత్కాలిక, కాంట్రాక్ట్ లేదా స్వల్ప ఆదాయ ఉపాధి మాత్రమే లభించటమో కారణంగా ఉంది.
 
 అందుచేతనే, 2008లో ఆ దేశీయ బ్యాంకులను దెబ్బతీసిన ‘రియల్ ఎస్టేట్’ రుణాల చెల్లింపుల వైఫల్య సమస్యలాగానే, నేడు ‘విద్యార్థి రుణాలు’ బ్యాంకుల పాలిటి మరో టైం బాంబు కానున్నాయని, అమెరికా నుంచి వెలువడే ‘టైమ్’ పత్రిక ఈ మధ్యనే ఒక వ్యాసంలో హెచ్చరించింది. ఈ కథనం నేపథ్యంలో, నేడు ఈ దేశాలలోని పాలకవర్గాలలో వివిధ విధానాల పట్ల పునరాలోచన జరుగుతోంది. గతంలో ప్రైవేటీకరణ పాలబడి, నేడు తిరిగి ప్రభుత్వపరం అయ్యే దిశగా సాగిన బ్రిటన్‌లోని రైల్వే రంగం తీరు లోనే, పలు దేశాలలో ప్రాథమిక రంగాలు తిరిగి ప్రభుత్వపరం చేయాలనే డిమాండ్ వినపడుతోంది. కాగా, మన పాలకుల విధానాలు దీనికి విరుద్ధ దిశలో సాగుతున్నాయి.
 
 అందులోనూ ఈ విధానాల అమలునే గర్వకార ణంగా భావించే చంద్రబాబు, నేడు ఈ దిశగా మరింత వేగంగా పావులు కదుపుతున్నారు. దీనిలో భాగమే, నేడు ఆయన ప్రైవేటు విశ్వవిద్యాలయాల ప్రస్తావనను తేవడం. నేడు ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణాన్ని అతి పెద్ద ప్రైవేట్ వెంచర్‌గా మార్చివేశారు. ఇక ఇదీ అదీ అని కాక సమస్త జీవన రంగాలనూ ప్రైవేటుపరం చేసే ప్రక్రియను ఆయన చేపట్టారు.

రానున్న కాలంలో, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా యువజనులూ, విద్యార్థులూ, జనసామాన్యం, రైతాంగ వర్గాలలో మరింతగా పెరిగిపోనున్న సామాజిక అశాంతి, అలజడులకు ఇది ఆరంభం అవుతుంది..! ప్రయాణం ఇదే దిశగా సాగితే అంతిమంగా అది చేరేది అశాంతి, అలజడుల తీరాన్ని మాత్రమే. ఇది ఇప్పటికే ప్రపంచం అంతటా నిరూపితమైన కఠోర వాస్తవం...!    
 వ్యాసకర్త సామాజిక, ఆర్థిక విశ్లేషకులు సెల్: 9866179615
 - డి. పాపారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement