‘మేక్ ఇన్ ఇండియా’ నల్లేరు మీద నడకేనా?
ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘మేక్ ఇన్ ఇండియా’ విజయవంతం కావడం అవసరమే కానీ, దానికంటే ముందు మన వ్యవసాయ రంగాన్ని వృద్ధిపరిచి, గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం చాలా అవసరం. దేశంలో తయారయ్యే పారిశ్రామిక సరుకులకు డిమాండ్ రావాలంటే స్థానికంగా కొనుగోలు శక్తి పెంచడమే మార్గం.
ప్రపంచంలోనే యువజనులు అత్యధికంగా ఉంటున్న దేశం భారత్. మన జనాభాలోని 65 శాతం మంది 35 ఏళ్లలోపు వయ సువారే. యువజనుల్లో పెరిగిపో తున్న నిరుద్యోగమే మన దేశా నికి అతి పెద్ద సమస్య. ఏటా కోటీ 20 లక్షల ఉపాధి అవకాశా లను కల్పించాల్సి ఉండగా 2006 గణాంకాల ప్రకారం ఏటా 88 లక్షల ఉద్యోగాలనే సృష్టించ గలుగుతున్నాం. అంటే సాలీనా 30 లక్షల ఉద్యోగాల కొరత ఉంది. ఇప్పుడిది మరింత పెద్ద సమస్యగా ఉంది. మన దేశీయ ఆర్థికవ్యవస్థ తాలూకు సమతుల్యతా లోపమే ఈ సమస్యకు మూలం. ఉదా: మన ఆర్థికవ్యవస్థ తాలూకు మూడు రంగాలు - వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు- చూద్దాం.. దేశీయ వ్యవసాయరంగంలో నేటికి 60 శాతం మంది జీవిస్తున్నారు. ఈ రంగం తాలూకు స్థూల జాతీయ వృద్ధి వాటా కేవలం 14 శాతంగానే ఉంది. మన పారిశ్రా మికరంగంపై సుమారు 22 శాతం మేర ఆధారపడి ఉన్నా రు. కాగా, స్థూలజాతీయ వృద్ధిలో ఈ రంగం వాటా 15 శాతంగా ఉంది. ఇక, సేవారంగంలో దేశీయ జనాభాలోని సుమారు 18 శాతం మంది జీవిక పొందుతున్నారు. వ్యవ సాయ, పారిశ్రామికరంగాలతో పోలిస్తే, ఐటీ, బీపీఓ వం టి సేవారంగంలోని అధికాదాయవర్గాల సంఖ్య మొత్తం దేశీయ కార్మిక, ఉద్యోగశ్రేణులలో కేవలం 0.21 శాతం మాత్రమే. దీంతో అధికశాతం ప్రజల కొనుగోలు శక్తి అత్య ల్పంగా ఉంది. అందుకే దేశీయ డిమాండ్ బలహీనమై ఉపాధి కల్పనపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
ఈ నేపథ్యంలోనే అమెరికాలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ఉపన్యాసంలో మోదీ పేర్కొన్న అంశాన్ని గమనిం చాలి. ఆయన దృష్టిలో ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటం అంటే - దానిలో 1/3 వంతు వ్యవసాయం, 1/3 వంతు పరిశ్రమలు, 1/3 వంతు సేవారంగాలుగా ఉండటం. అప్పుడే ఈ మూడు రంగాలలోని దేనిలోనైనా ఎదురయ్యే ఒడిదుడుకులను, మిగతా రెండు రంగాల సాయంతో సమ ర్థంగా ఎదుర్కోగలం. దీని పరిష్కార మార్గంగానే ‘‘మేక్ ఇన్ ఇండియా’’ ప్రకటించారు. అయితే, ‘‘మేక్ ఇన్ ఇండియా’’ విజయం నల్లేరు మీద నడకేమీ కాదు. ప్రధాని నరేంద్రమోదీ తన విదేశీ పర్యటనల్లో బిలియన్ల కొలదీ డాలర్ల మేరకు పెట్టుబడుల వాగ్దానాలను పొందారు. మన వద్ద ఉన్న చౌక శ్రమవల్ల చైనా పరిశ్రమలు దేశంలో అడు గెడతాయని ఆశలు పెట్టుకుంటున్నారు కానీ ‘‘మేక్ ఇన్ ఇండియా’’కు అనేక ప్రతికూల అంశాలున్నాయి.
చైనాలో నేడు శ్రమశక్తి ఖరీదు పెరిగినప్పటికీ ఆ దేశం స్థూల కొనుగోలు శక్తిలో ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఉం ది. ఉదాహరణకు, నేడు విశ్వ లగ్జరీ కార్లలో అధిక భాగం ఛైనాలోనే అమ్ముడవుతున్నాయి. 2016 నాటికి చైనా జీడీపీ అమెరికాను దాటిపోతుందని ఐఎంఎఫ్ అంచనా. కాబట్టి చైనా పరిశ్రమలు మన వద్దకు తరలివస్తాయనుకోవడం భ్రమే. పైగా అంతర్జాతీయంగా వివిధ సరుకులకు ఉన్న మార్కెట్ డిమాండ్ దిగజారి, ప్రపంచ ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్న స్థితిలో ‘‘మేక్ ఇన్ ఇండియా’’ విజయం అంత సులభం కాదు. అమెరికాలో సరుకుల రంగం విస్త రణ, ఉత్పాదకత వృద్ధి వల్ల ఇకపై అది ప్రపంచ దేశాల సరుకులకు మార్కెట్ ఇవ్వకపోవచ్చు. పైగా పలు అభి వృద్ధి చెందుతున్న దేశాలు కూడా చౌక ఎగుమతుల విధా నాలతో మేక్ ఇన్ ఇండియాకు పోటీదారులుగా మారుతు న్నాయి. కాబట్టి ‘‘మేక్ ఇన్ ఇండియా’’ విజయం నల్లేరు మీద నడకేమీ కాదు.
వీటికి తోడు మన దేశంలోని విద్యుత్ శక్తి ఖరీదు, చైనాలోని ఖరీదుకు రెట్టింపుగా ఉంది. అంటే ముందుగా మన మౌలిక సదుపాయాలను వృద్ధి చేసుకోకుండా ‘‘మేక్ ఇన్ ఇండియా’’ను విజయవంతం చేయలేము. నేడు ప్రపంచ ఫ్యాక్టరీగా ఉన్న చైనా ఆటోమేషన్ దిశగా వేగంగా కదులుతోంది. ఈ కారణంచేతనే ఆ దేశం నుంచి వచ్చి పడుతోన్న పలు సరుకుల చౌక ధరలు, నాణ్యతల ధాటికి తట్టుకోలేక మన దేశంలోని అనేక పరిశ్రమలు మూతపడు తున్నాయి. మరో పక్కన మన ‘‘మేక్ ఇన్ ఇండియా’’కు జవాబుగా చైనా ‘‘మేడ్ ఇన్ చైనా’’ విధానానికి శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల దిగుమతులపై చైనా పన్ను రాయితీలనిస్తూ దేశంలోని వృత్తి విద్యా సంస్థలను మరింతగా అభివృద్ధి చేస్తోంది. కాగా, మన దేశంలో నేటికీ 70 శాతం మంది కార్మికులు మాత్రమే అక్షరాస్యులు. వీరిలో కూడా 25 శాతం మంది ప్రాథమిక విద్యను కూడా పూర్తి చేయనివారే. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పినట్లు, మన దేశంలోని నిర్మాణరంగ కార్మికులలో 8 శాతం మందికి మాత్రమే అవసరమైన స్థాయి నిపుణతలు ఉన్నాయి.
‘‘మేక్ ఇన్ ఇండియా’’ అనేది అన్ని పరిస్థితులూ అనుకూలిస్తేనే విజయవంతమయ్యే ప్రణాళిక. కాగా నేడు దేశంలో మెజారిటీ ప్రజలు ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగంపై మన పాలకులు శ్రద్ధ పెట్టగలిగితే, అది మరింత సత్ఫలితాలనివ్వగలదు. ఉదాహరణకు ప్రస్తుతం మనం వ్యవసాయరంగంపై, 100 రూపాయల స్థూల జాతీయ ఉత్పత్తిలో కేవలం 60 పైసలను మాత్రమే ఖర్చు పెడుతు న్నాం.
కాగా, ఈ విషయంలో చైనా 100 రూపాయల జీడీపీలో రూ.5 వ్యవసాయంపై ఖర్చు పెడుతోంది. కాబట్టి ఈ విషయంలో మనం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అంటే వ్యవసాయ రంగంలో అన్ని సదుపాయాలను కల్పించడం ద్వారా మనం ఆ రంగంలో ఆదాయాలను పెంచగలం. తద్వారా మెజారిటీ ప్రజల కొనుగోలుశక్తి పెరిగి, దేశీయ పారిశ్రామిక సరుకులకు కూడా మంచి డిమాండ్ రాగల దు. దాని వలన మన నగర ప్రాంతాలు కూడా పునరుత్తే జం పొందుతాయి. ‘‘మేక్ ఇన్ ఇండియా’’ విజయవం తం కావడం అవసరమే, అయితే దానికంటే కూడా మన వ్యవసాయరంగంలోని వృద్ధి ద్వారా కచ్చితమైన, మరింత మెరుగైన ఆరంభాన్ని చేయగలం...!
(వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు)
- డి. పాపారావు