మహిళలపై లైంగిక వేధింపులు
విశ్లేషణ
నిందితుడికి ఆరోపణ వివరాలు ఇవ్వకుండా ఎవరు ఫిర్యాదు చేసారో కూడా చెప్పకుండా దాచితే, అతను తన నిర్దోషిత్వాన్ని ఏ విధంగా నిరూపించుకుంటాడు? ఫిర్యాదు ప్రతిని ఆరోపణకు గురైన వ్యక్తికి ఇవ్వాలనేదే న్యాయం.
కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతు న్నాయి. మహిళల పనిచేసే హక్కును కొందరి దుర్మార్గపు చర్యలు హరిస్తున్నాయి, వారి జీవనాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఈ ప్రమాదాన్ని గుర్తించి, పురుషాధిక్య సమాజంలో మహిళలకు ఇటువంటి సందర్భంలో న్యాయం ఇవ్వడం కోసం, ఈ ఆరోపణలు విచారించడానికి మహిళతో కూడిన ఒక నిష్పక్షపాత కమిటీ ఉండాలని సూచించింది. 2013లో పార్లమెంటు ఒక చట్టాన్ని కూడా చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి ఫిర్యాదు ప్రతిని ఇవ్వాలా లేదా అని సందేహిస్తూ ఉంటారు. నేరం చేసిన వ్యక్తికి ఏ నేరం ఎవరిమీద చేసాడో తెలియదా, అది ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు? అని సవాలు కూడా చేస్తూ ఉంటారు.
విచారణ కమిటీ అధ్యక్షులు లేదా సభ్యులుగా ఉన్న మహిళా ఎన్‌జీవో నాయకులు కూడా అడుగు తారు. ఒకరిని భ్రష్టు పట్టించడానికి ఒక మహిళను ఆసరాగా తీసుకుని ఈ రకం ఆరోపణను సృష్టించి నట్టయితే న్యాయం ఏ విధంగా జరుగుతుంది? ఆరోపణ వివరాలే ఇవ్వకపోతే విచారణ జరిగేదేమిటి? నిందితుడికి ఆరోపణ వివరాలు ఇవ్వకుండా ఎవరు ఫిర్యాదు చేసారో కూడా చెప్పకుండా దాచితే, అతను తన నిర్దోషిత్వాన్ని ఏ విధంగా నిరూపించుకుంటాడు? ప్రపంచమంతటా ఫిర్యాదు ప్రతిని ఆరోపణకు గురైన వ్యక్తికి ఇవ్వాలనేదే న్యాయం. ఎంత ఘోరమైన నేరమైనా సరే ఆరోపణ పత్రం ఉండాల్సిందే, అది నిందితుడికి ఇవ్వాల్సిందే.
ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఒక వైద్య కళాశా లలో వైద్య ప్రొఫెసర్ల జంట (భార్యా భర్తలు) తమను విపరీతంగా వేధిస్తున్నారని తొమ్మిది మంది పి.జి. పరిశోధక విద్యార్థులు ఫిర్యాదు చేశారు. వారిలో మగవారు కూడా ఉన్నారు. ఈ కేసులో ఆ ప్రొఫెసర్లిద్దరూ తమపై వచ్చిన ఆరోపణల ప్రతి ఇవ్వమని ఆర్టీఐ కింద అడి గారు. ఈ ప్రతి ఇస్తే ఫిర్యాదుదారుల, నిందితుల బతుకుకే ప్రమాదం ఏర్పడుతుందని, కనుక ఇవ్వబోమని అధికారులు నిరాకరించారు. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు పంపామని వారి ముందు ఈ కేసు ఉందని, కనుక వారినే వివరాలు కోరాలని సూచించారు. మహిళా కమిషన్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవ్వాలని ప్రొఫెసర్లు కోరారు. అవీ ఇవ్వలేదు. ఇద్దరు ప్రొఫెసర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, కార్యాలయాల్లో మహిళలను లైంగిక వేధింపుల నుంచి రక్షించే చట్టం 2013 సెక్షన్ 16 ప్రకారం ఆ ఫిర్యాదు వివరాలు ఇవ్వకుండా నిషేధం ఉందని, ఈ నిషేధ నియ మం ఆర్టీఐ కింద హక్కును కూడా అధిగమిస్తుందని, కనుక ఇవ్వబోమని పి.ఐ.ఓ. వాదించారు. సంబంధిత ఫైల్‌ను కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించ వలసి వచ్చింది. ఆ ఫైలు ఇచ్చారు. అందులో ఫిర్యాదులు పరిశీలిస్తే 23 ఆరోపణలు కనిపించాయి. ఒక్కటీ కూడా లైంగిక వేధింపులకు సంబంధించినట్లు లేదు. ఒకవేళ లైంగిక వేధింపు ఆరోపణ ఉంటే విశ్వవిద్యాలయం వారు విచారణ కమిటీకి పంపితీరాలి, ఆ పని చేయ లేదు. కమిటీ ఉండి తీరాలి. ఒకవేళ కమిటీని నియ మించి ఉండకపోతే ఫిర్యాదు అందిన తరువాతైనా ఏర్పాటు చేయాలి. అదీ చేయలేదు.
జాతీయ మహిళా కమిషన్ కూడా ఆ ఆరోపణ ఉండి ఉంటే ప్రత్యేకంగా ఆ అంశాన్ని విచారించడమో లేదా లైంగిక వేధింపుల వ్యతిరేక విచారణ కమిటీకి పంపడమో చేసి ఉండేది. అవేవీ జరగలేదు. అయినా ఒక మహిళ తనపై లైంగిక వేధింపులు జరిగాయని పురుషుడిపైన ఆరోపణ చేయడం సహజం. కాని ఆరోపణలు భార్యాభర్తల మీద కలిపి చేసినవి. మగ ప్రొఫెసర్ ఆడవారిని వేధించారని, ఆడప్రొఫెసర్ మగ విద్యార్థులను లైంగిక పరంగా వేధించారనీ ఆరోపణలు చేయదలచుకుంటే విడిగా చేస్తారు. ఉమ్మడి ఫిర్యాదుల్లో ఇవి ఉండే అవకాశం తక్కువ. కానీ మగవారు ఆడవారితో కూడిన 9 మంది విద్యార్థుల బృందం భార్యాభర్తల జంటైపైన ఉమ్మడిగా ఇటువంటి ఆరోపణ చేయడం సాధారణంగా జరగదు. అటువంటి ఆరోపణ ఏదీ కనిపించలేదు. మౌలికంగా ఇది లైంగిక వేధింపుల ఆరోపణే కాదు. ఒకవేళ లైంగిక వేధింపుల ఆరోపణే చేశారనుకుంటే, ఆరోపణల ప్రతిని ఇవ్వాలా వద్దా? అనే ప్రశ్నను పరిశీలించాలి.
సమాచార హక్కు చట్టంలో ఏ హక్కు ఉన్నప్పటికీ ఫిర్యాదు వివరాలు ఇవ్వకూడదని సెక్షన్ 16 లైంగిక వేధింపుల చట్టం 2013లో నిషేధం ఉందని యూనివర్సిటీ వాదించింది. సెక్షన్ 16 మహిళలపై వేధింపుల ఆరోపణలను పత్రిక లలో, మాధ్యమాలలో, ప్రజల్లో చర్చించడానికి వీల్లేదని, బాధిత మహిళల గుర్తింపు, చిరునామాలకు ప్రచారం ఇవ్వకూడదని ఉంది. కాని నిందితుడికి ఆరోపణలతో కూడిన ఫిర్యాదు కాపీ కూడా ఇవ్వకూడదని ఎక్కడా లేదని కమిషన్ నిర్ధారించింది. ఉద్యోగులు శిక్షణ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నియమాల వివరాలలో నింది తుడైన అధికారికి ఫిర్యాదు ప్రతి ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఆరు ఫిర్యాదు ప్రతులు ఇవ్వాలని అందులో ఒకటి నిందితుడికి ఇవ్వాలని ఈ చట్టం కింద చేసిన నియమాలు సూచిస్తున్నాయి. కనుక ప్రొఫెసర్లకు ఫిర్యాదు ప్రతి, తదితర పత్రాలు ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. (డాక్టర్ ఎ.ఎల్. అగర్వాల్ వర్సెస్ డిల్లీ యూనివర్సిటీ ఇఐఇ/ఖక/అ/2014/000313-అ కేసులో 2015 డిసెంబర్ 9 న, నా తీర్పు ఆధారంగా).
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com
మాడభూషి శ్రీధర్