శివసాగర్‌ మ్రోగించిన తొలిగంటలు | shiva sagar literature article | Sakshi
Sakshi News home page

శివసాగర్‌ మ్రోగించిన తొలిగంటలు

Published Mon, Apr 17 2017 1:24 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

శివసాగర్‌ (కె.జి.సత్యమూర్తి): 15 జూలై 1931 – 17 ఏప్రిల్‌ 2012 - Sakshi

శివసాగర్‌ (కె.జి.సత్యమూర్తి): 15 జూలై 1931 – 17 ఏప్రిల్‌ 2012

అపూర్వరీతిలో ఆకాశం, నెలవంక, చందమామ, వెన్నెల, వెదురుపొద, సెలయేరు, చిరుగాలి, ప్రేమ, ప్రియురాలు, ఎదురుచూపులు, కన్నీరు, గోరింటాకు, ఏక్‌తార్, ఫీనిక్స్‌లాంటి రంగు, రుచి, వాసన నిండిన ప్రతీకల్ని, శబ్దజాలాన్ని విప్లవ, దళిత కవిత్వంలోకి శివసాగర్‌ పట్టితెచ్చారు.

‘కాలానికి ఒక కవి కావాలి, ఒక కవిత కావాలి, అందుకనే కాలం కడుపుతో ఉండి శ్రీశ్రీని కన్నది’ అనే శివసాగర్‌ కవిత్వపాదం యథాతథంగా ఆయనకి కూడా∙వర్తిస్తుంది. అయితే కాలానికి కవి మాత్రుడే కాదు, యోధుడు కూడా అక్కరకొచ్చినపుడు శివసాగర్‌ కలమూ, ఆయుధమూ చేతపట్టారు. ఆయన జీవిత పర్యంతం ఎంతటి ఉద్యమకారుడో, నిలువెల్లా అంతటి కవి! సాహిత్యరంగం ఆయన ప్రధాన కార్యక్షేత్రం కాదు; రణరంగంలో రాయకుండా ఉండలేని సమయాల్లోనే రాశారు; కవిత్వాన్ని హృదయ సంబంధిగానే భావించారు. అయినప్పటికీ రాజకీయ చైతన్యాన్ని రచనలో ప్రాణంగా ప్రతిష్ఠించారు. ఆయన అనుభవంలోకి రాకుండా, గాఢమైన సహానుభూతి లేకుండా పాట కట్టలేదు, కవిత అల్లలేదు. జీవితం, కవిత్వం అవిభాజ్యమని తన సత్యశోధకమైన ఆచరణతోనూ, వైభవోపేతమైన కవిత్వంతోనూ నిరూపించారు.

శివసాగర్‌ తొలినాళ్ళనుంచీ పాట, కవిత రెండు ప్రక్రియల్నీ స్వీకరించారు. ఆ మార్గమే చివరి వరకు అనుసరించారు. అభ్యుదయ, విప్లవ కవిత్వంలోని మూసధోరణులకు ఎడంగా నిలిచారు. కవిత్వాంశం మొదలుకొని పరిభాష, వ్యక్తీకరణ, నిర్మాణం వరకు తన ప్రత్యేకతని కనబరిచారు. ఒకచోట చెప్పారు: ‘‘అభ్యుదయ రచయితలు చందమామవంటి వాటి జోలికి పోకూడదని మా అభిప్రాయం. అభ్యుదయ కవిత్వంలో పులిచంపిన లేడినెత్తురుండాలి. హోచిమిన్‌ను చదివిన తర్వాతనే చంటిపాప నుంచి చందమామ వరకు విప్లవ కవిత్వంలో ఉండొచ్చని తెలుసుకొన్నాను’’. ఆ ఎరుకతో అపూర్వరీతిలో ఆకాశం, నెలవంక, చందమామ, వెన్నెల, వెదురుపొద, సెలయేరు, చిరుగాలి, ప్రేమ, ప్రియురాలు, ఎదురుచూపులు, కన్నీరు, గోరింటాకు, ఏక్‌తార్, ఫీనిక్స్‌లాంటి రంగు, రుచి, వాసన నిండిన ప్రతీకల్ని, శబ్దజాలాన్ని విప్లవ, దళిత కవిత్వంలోకి ఆయన పట్టితెచ్చారు.

పాట గురించి నాకు ఇచ్చిన ఇంటర్వూ్యలో అన్నారు: ‘‘కవితకంటే పాటకే ప్రజల్లో ఆదరణ ఉంది. పాట ప్రజల్ని తట్టిలేపుతుంది. బలమైన ప్రభావం చూపుతుంది’’. నర్రెంగ సెట్టుకింద నరుడో! భాస్కరుడా!, నా చెల్లీ! చెంద్రమ్మా!, తోటరాముని తొడకు కాటా తగిలిందానీ, విప్పపూల చెట్లసిగను దాచిన విల్లంబులన్నీ, గంగ దాటెళ్ళకే చెల్లెమ్మా, నల్లాటి సూరీడు ఇత్యాది పాటల్ని తలచుకొంటే ఇవాళ్టికీ భావావేశానికి గురికాని వారుండరు. ప్రపంచపు గుండెని కోసిన అనేక సామాజిక, రాజకీయాంశాలను (భోపాల్‌ ట్రాజెడీ, నేను జాఫ్నాలో చనిపోయాను, తీన్‌మీన్‌స్క్వేర్, సద్దాంకు ప్రేమలేఖ, ‘రండి, మమ్మల్ని రేప్‌ చేయండి’ ) ఆయన కవిత్వీకరించారు. ఆయా సంఘటనల్లోని అదృశ్య మూలాలను దర్శించగలిగారు. ప్రగతిశీల రాజకీయ అవగాహనతో వాటిని దృశ్యమానం చేశారు. తెలుగు సాహిత్యంలో పాఠ్యాంశాలుగా ఎన్నదగిన, నడుస్తున్న చరిత్ర, మండుతోన్న మాదిగ డప్పు, ప్యాపిలి, నల్లాటి సూరీడు కవితలూ, పాటలూ రాశారు. అలలు, అమ్మా, రుతుసంగీతం, ఖైదీ గీతం, ఓ పువ్వు పూసింది, ఆమె, అమరత్వం, అడవిలో వెన్నెల, నా కోసం ఎదురుచూడు, ఫీనిక్స్, సూర్యుడు తదితర కవితల్ని చదివితే కవిగా పరిపూర్ణతతో ఆరితీరారని తెలియవస్తుంది.

ఆయన తన సమకాలీన యువకవులకంటే పురోగామిగా ఉండేవారు. అందుకనే ఆ కవిత్వం ఆద్యంతం వీరోచితంగానూ, నవయవ్వన సౌందర్యంతోనూ ప్రకాశించింది. అది విశ్వజనీనత, ఆధునికత, ఆర్ద్రత, స్పష్టత, సాంద్రత, క్లుప్తత వంటి సుగుణాలను క్రోడీకరించడం చేతనే సాధ్యమయింది. అనివార్యమైన ఆ లక్షణాలు కవులనేకులలో కొరవడటం వల్ల విప్లవ, దళిత కవిత్వం ఆశించిన మేర పాఠకులకు చేరువ కాలేకపోయింది. ఏనాటి కవిత ‘ఉరిపాట’ (1972)! అభివ్యక్తిలో ఈనాటికీ కొత్తగానే ఉంటుంది.                  

ఉరికంబం/ మీద నిలిచి/ ఊహాగానం/ చేసెద/
నా ఊహల/ ఉయ్యాలలోన/ మరో జగతి/ ఊసులాడు/
ఉరికంబం/ మీద నిలిచి/ తియ్యని కలలే/ గాంచెద/
రెక్కలిప్పి/ ఎర్రసేన/ నలుదిక్కుల/ ప్రసరించును/
మొక్కవోని/ఎర్రసేన/విముక్తిని/సాధించును.
అంతే అద్భుతమైన కవిత ‘ఏక్‌తార్‌’ (1987).
కన్నీటి చుక్కలా/ కాలం మెరుస్తోంది/
అవునా/
సూర్యోదయాన్ని/ నీ వెంట తీసుకొచ్చావు/
సెలయేటి గలగలల్ని/ నీ వెంట తీసుకొచ్చావు/
జీవిత నిర్వచనాన్ని/ నీ వెంట తీసుకొచ్చావు/
ఇపుడు మమ్మల్ని విడిచి/ నీవు వెళ్ళిపోయావు/
కాలం/ కన్నీటిబొట్లుగా/ బొటబొటా రాలుతోంది/
ఇక్కడ ఏకాంతంలో/ నీ కోసం నిశ్శబ్దంగా విలపిస్తాను/
ఏక్‌తార్‌!/ నిన్ను వేడుకొంటున్నాను/
నా విషాదాన్ని వెక్కిరిస్తూ/ జీవన సంగీతాన్ని వినిపించు/
వినిపించు/ వినిపించు.

శివసాగర్‌ పట్ల తరతరంగా ప్రత్యేక గౌరవం, ఆరాధన భావం. ఆయన ‘ఉద్యమం నెలబాలుడు’ (1983) ఎందరినో ఉజ్వలంగా ప్రభావితం చేసింది. ఉద్యమం తొలిరోజుల్లో అటవీ ప్రాంతంలో ఆయన సంచరించిన కాలంలోనూ, బందిఖానాలోనూ రాసిన కవితలతో ఆ సంకలనం వెలువడింది. ఉద్యమంలో ఏర్పడిన నూతన పరిస్థితుల్లో రాసిన కవితలతో ’నెలవంక’ (1990) వచ్చింది. దళిత సమస్యను చారిత్రక, రాజకీయ, తాత్విక దృక్పథం నుంచి వీక్షించకపోవడం వల్ల అది సంక్షోభంలో పడిందనే అవగాహనలోంచి ‘నడుస్తున్న చరిత్ర’ (2004) ప్రచురించారు. అటుపిమ్మట శివసాగర్‌ కవిత్వం (2004) సమగ్ర సంపుటం తీసుకొచ్చారు. ఆయన కవిత్వం నా యవ్వనకాలాన్ని వశపరచుకొంది. ఆనాటి ఉద్యమంలో పూర్తికాలపు కార్యకర్తనయ్యేందుకు నన్ను పురికొల్పింది. అజ్ఞాతం నుంచి ఆయన బయటకొచ్చిన తర్వాత మాకు పరిచయ మయ్యారు. రండి, కన్నీళ్ళలోని చిరునవ్వుని వెలికితీద్దామనేవారు. కలల కాంతిపుంజాలను తలాకొన్ని పంచిపెట్టేవారు. ఆయనకు గురజాడ, కృష్ణశాస్త్రి, ఎంకిపాటల నండూరి, నయాగరా కవులు, శ్రీశ్రీ, పఠాభి, ఆలూరి బైరాగి అంటే ఇష్టం. మావో, హోచిమిన్, పాబ్లొ నెరుడా అంటే అభిమానం.

కంభం జ్ఞాన సత్యమూర్తిగా ఉపాధ్యాయుడిగానూ, పాత్రికేయుడిగానూ పనిచేశారు. ‘శివసాగర్‌’గా కడవరకు కమ్యూనిస్టుగా జీవించారు. ఏ సంస్థలోనూ దీర్ఘకాలం ఇమడలేకపోయారు. ఈ పరిణామం ఆయనలోని ప్రవాహశీలతనే చూపుతుంది. మరొక ఇంటర్వూ్యలో చెప్పారు: ‘‘మార్క్స్‌ ప్రతిపాదించిన గతితార్కిక చారిత్రక భౌతికవాద దృక్పథాన్నీ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రచించిన కులనిర్మూలన ఉద్యమాన్నీ అవగాహన చేసుకోవాలి. బుద్ధధర్మాన్ని సాంస్కృతిక విప్లవంగా అర్థం చేసుకోవాలి’’. ఒక కొత్త సమాజాన్ని రూపొందించే నూతన మానవుణ్ణి సృష్టించాలి. అది ఓ అనంతయాత్ర. ఆ దిశగా ప్రయాణించడం కవికి అనివార్యమని ఆయన విశ్వసించారు. ఆ అలుపెరుగని యాత్రికుడు వృద్ధాప్యంలో ‘నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు’ (2002) అని జీవితాన్ని అభ్యర్థించారు.

జీవితమా/ నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు/ పొదలో పొంచివున్న అడివి ఎలుగు/
నాపై క్రూరాతి క్రూరంగా దాడిచేసే వేళ/ నడిరాత్రి వెన్నెలమ్మ/ నిశ్శబ్దంగా నా దరి చేరి/
ప్రేమతో నన్ను సాదరంగా అనునయించే వేళ/ జీవితమా/ నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు/
జీవితానికి మరణానికి మధ్య/ నన్ను హల్లో అని పలకరించే/ సరిహద్దు రేఖ మీద/
పసిపాపలాంటి వృద్ధాప్యంలో/ నిబ్బరంగా నిలబడి/ చిరుగాలి సితారా సంగీతాన్ని/
పలికించే వేళ, పలవరించే వేళ/ జీవితమా/ నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు.

‘ఏ విషయాన్నయినా స్పెసిఫిక్‌గా చెబుతూనే జనరలైజ్‌ చేయగలిగితే తర్వాత తరం కూడ చదవ గలుగుతుంది’ అని శివసాగర్‌ పాటించిన రచనా సూత్రమే ఆయనని మళ్ళీ మళ్ళీ చదివింపజేస్తుంది. మనోహర కవితగానూ లేదా హోరెత్తే కవాతు గీతంలానూ విప్లవ, దళిత కవిత్వంలో ఆయన మ్రోగించిన తొలిగంటలు ఎప్పటికీ మార్మ్రోగుతుంటయ్‌.  
    
 నామాడి శ్రీధర్‌
 9396807070

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement