
పుష్పార్చన
కల్పారంభంలో శ్రీహరి వరాహావతారమును స్వీక రించిన సందర్భంలో జనులందరి హితాన్ని కోరిన వాడై, ‘నా నామసంకీర్తన చేయండి. నన్నే శరణు వేడం డి. భక్తితో సుగంధ భరితమైన పుష్పాలను నాకే సమ ర్పించండి’ అని పేర్కొన్నాడు. అదేవిధంగా శ్రీకృష్ణావ తారమెత్తి అర్జునునకు గీతోపదేశం చేస్తూ ఎవరైతే నా పట్ల అనన్య భక్తి కలిగియుండి ప్రేమతో పత్రాన్నో పుష్పాన్నో సమర్పిస్తారో, దాన్ని నేను ఆదరంతో స్వీకరిస్తాను అని తెలియజెప్పాడు.
వరాహస్వామి ఉపదేశాన్ని మానవులు సరిగ్గా మనసుకెక్కించుకున్నారో లేదోనని భావించిన జగ న్మాత భూదేవి మరొక్కసారి పరమాత్మకు ప్రీతిని కలి గించే హరినామ సంకీర్తనను, భక్తితో శ్రీహరి పాదాల సన్నిధిలో చేయవలసిన పుష్పార్చనను, శ్రీహరియే రక్ష కుడనే భావంతో చేయవలసిన శరణాగతిని గురించి తెలుపడానికి శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుల తనయ గోదాదేవిగా అవతరించినది. గోదాదేవి ఎన్నటికీ వాడి పోని, అద్భుత భావగంధ భరితాలైన వాక్పుష్పాలను ఒక్క దగ్గరకు చేర్చి 30 పాటలతో తిరుప్పావై అనే పామాలికను తమిళంలో సమర్పించినది. దీనిలోని మాయనై అను 5వ పాశురంలో తిరుప్పావై వ్రత సమయంలో అంద రూ పుండరీకాక్షుని నామసంకీర్తనం చేస్తూ శ్రీహరి పాదపద్మ సన్నిధిలో భక్తితో పవిత్ర పుష్పాలను సమర్పించ మని గోదాదేవి భక్తులకు ప్రబోధించినది.
ఆదిశంకరులు ‘‘పరమాత్మకు పరిమళ భరిత పుష్పాలను సమర్పించుటకై ఎక్కడెక్కడో భక్తులు తిరు గుతూ ఉంటే నొచ్చుకుంటాడు. ఈ బాహ్య పుష్పాల గురించి శ్రమించకుండా భక్తులు, మనస్సు అనెడి పువ్వును పరమాత్మకు సమర్పిస్తే ఆ శ్రీహరి పరమానం దమును పొందును’’ అని తెలిపారు.
మన పూర్వులైన పెద్దలు శ్రీహరికి ప్రీతికరము లైన పుష్పాలు 8 కలవని పేర్కొన్నారు. ఏ ప్రాణిని కూడా వాక్కులతోనో, చేష్టలతోనో, దుష్ట ఆలోచనలతో గాని హింసించకుండా ఉండే అహింస అనే పుష్పం మొదటిది. వాక్పాణిపాద పాయు ఉపస్థలు అను ఐదు కర్మేంద్రియములను, త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వా, ఘ్రాణ ములు అనే ఐదు జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియం గాను, జ్ఞానేంద్రియం గాను చెప్పబడే మనస్సును అదు పులో పెట్టడం అనే ఇంద్రియ నిగ్రహం రెండవ పుష్పం. సకల ప్రాణుల పట్ల దయకలిగి ఉండటం అనే దయా పుష్పం మూడవది. అనుకూల ప్రతికూలాలను సహిం చడం అనే క్షమా పుష్పం నాలుగవది. లౌకిక పారమా ర్థిక క్షణిక శాశ్వత విషయాలను గుర్తించుటకు ఉపక రించే జ్ఞానమనే పుష్పం ఐదవది. తపమనే పుష్పం ఆర వది. నిరంతర భగవద్ధ్యా నమనే పుష్పం ఏడవది. సర్వ భూత హితకరమైన సత్య మనే పుష్పం ఎనిమిదవది.
ఎన్నడూ వాడిపోని ఆత్మగుణములనే ఈ ఎనిమిది పుష్పాలతో భక్తులు పూజిస్తే శ్రీమహావిష్ణువు పరమప్రీ తిని పొందుతాడని మన పూర్వులైన పెద్దలు ఉపదేశిం చారు. ఈ ఉపదేశాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం.
సముద్రాల శఠగోపాచార్యులు