అమెరికాకు ‘సిరియా’ కళ్లెం | Syrian Dismissal Seen as 'Jockeying' Ahead of Peace Talks | Sakshi
Sakshi News home page

అమెరికాకు ‘సిరియా’ కళ్లెం

Published Thu, Oct 31 2013 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM

అమెరికాకు ‘సిరియా’ కళ్లెం

అమెరికాకు ‘సిరియా’ కళ్లెం

విశ్లేషణ: సిరియాపై రష్యా వెనక్కు తగ్గుతుందన్న ధీమాతో ఒబామా జూదమాడారు. అంచనాలు తప్పడంతో మధ్యప్రాచ్యంపై అమెరికా ఆధిపత్యాన్ని, అద్వితీయ స్థానాన్ని పోగొట్టుకోవాల్సివచ్చింది. మిత్రులను దూరం చేసుకోవాల్సివస్తోంది. ఇరాక్ యుద్ధంతో మధ్యప్రాచ్య రాజకీయ పటాన్ని తిరిగి రాయాలని అమెరికా భావించింది. ఆ ఆశలను సిరియాలో సమాధి చేసుకొని, అమెరికా తన తలరాతను తానే తిరిగి రాసుకోవాల్సివస్తోంది.
 
 కట్టుకున్నోడు కొట్టాడు, అత్త కొట్టింది, ఆడబిడ్డ కొట్టింది, నేనూ నాలుగు తగిలించి పోతే పోలా... అని దారినపోయే దానయ్య కూడా కొట్టి పోయాడట వెనుకటికో ఇల్లాలిని. అలా తయారైంది అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పరిస్థితి. లేకపోతే అమెరికా సైన్యం అండ లేనిదే బతికిబట్టగట్టలేని రాచరిక సౌదీ ఆరేబియా... భద్రతా మండలి సభ్యత్వాన్ని గెలుచుకున్న వెంటనే తిరస్కరించేదా? ఈ నెల 18న  దౌత్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేయగలిగేదా? సిరియా అంతర్యుద్ధంలాంటి అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించడంలో ఐరాస ైవె ఫల్యానికి నిరసనగానే సౌదీ ఈ అసాధారణ చర్యకు పాల్పడిందనేది పైకి చెప్పే సాకు. నిజానికి అది అమెరికాపై ఆగ్రహ ప్రకటన. సౌదీకి కాబోయే అమీర్‌గా భావిస్తున్న ప్రిన్స్ బందర్ బిన్ సుల్తాన్ (‘బందర్ బుష్’)... ‘ఇది ఐరాసకు పంపుతున్న సందేశం కాదు, అమెరికాకు పంపుతున్న సందేశం’ అని స్పష్టం చేశారు.
 
 రసాయనిక ఆయుధాల నిర్మూలన పేరిట సిరియాపై సైనిక చర్యతో బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సర్వం సిద్ధం చేసుకొని కూడా అమెరికా వెనుకడుగు వేయడమే సౌదీ ఆగ్రహానికి కారణం. మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రాబల్యానికి మూల స్తంభాల్లో ఒకటిగా, చిరకాల మిత్ర దేశంగా ఉన్న తమను అమెరికా ఒంటరిని చేసిందని సౌదీ భావిస్తోంది. సెప్టెంబర్‌లో అతి నాటకీయంగా రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్... ఇంద్రజాలికుడు టోపీలోంచి పావురాన్ని తీసినట్టు సిరియా రసాయనిక ఆయుధాలను నిర్వీర్యం చేసే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అంతే ఠక్కున ఒబామా సైనిక చర్యను విరమించారు. మధ్యప్రాచ్యంలోని చిరకాల సన్నిహిత మిత్రులను అమెరికా దూరం చేసుకోవాల్సి వచ్చింది. నమ్మశక్యం కానివిగా కనిపించే ఈ పరిణామాల తదుపరి మధ్యప్రాచ్య రాజకీయాలలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి.
 
 ‘సిరియా’ మలుపు... పుతిన్ గెలుపు
  సెప్టెంబర్‌లో సిరియాపైకి అమెరికా ఐదు డిస్ట్రాయర్ యుద్ధ నౌకలను ఎక్కుబెడితే... ప్రతిగా రష్యా తన క్షిపణి విధ్వంసక ‘మాస్క్వా’ క్రూయిజర్ సహా పదకొండు యుద్ధనౌకలను రంగంలోకి దించింది. వాటికి తోడు చైనా యుద్ధ నౌకలు కూడా నిలిచాయి. సిరియాపై దాడికి బదులు చెప్పడానికి సిద్ధమయ్యాయి. 1962 నాటి ‘క్యూబా మిస్సయిల్ సంక్షోభం’తో సరితూగక పోయినా ఆ తదుపరి ప్రపంచం ఇలాంటి ఉద్రిక్త పరిస్థితిని ఎరుగదు. ‘గుర్తు తెలియని వారు’ సిరియాపై రెండు క్షిపణులను ప్రయోగించగా అవి గురితప్పినట్టు వార్తలు వచ్చాయి. ఆ ‘గుర్తు తెలియని’ క్షిపణులు స్పెయిన్‌లోని నాటో సైనిక శిబిరం నుంచి ప్రయోగించిన అమెరికా తయారీ టామ్‌హాక్ క్షిపణులనేది ఇప్పుడు బహిరంగ రహస్యం. ఇక వాటిని రష్యా నిర్వీర్యం చేసిన తీరుపై భిన్న కథనాలున్నా గల్ఫ్ దేశాల మీడియా అది రష్యా పనేనని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తోంది.
 
 ఇంతకూ ఒబామా ఎందుకు వెనుకడుగు వేశారు? లిబియాపై రష్యా చివరి నిమిషంలో వెనక్కు తగ్గింది. అలాగే సిరియాపై కూడా అది వెనక్కు తగ్గక తప్పదని ఒబామా ప్రభుత్వం భావించింది. ప్రపంచ మీడియా పండితులంతా దానికి వంత పాడారు. అయితే ఒక్క విషయాన్ని మరిచారు. నాటి రష్యాకు వెన్నెముకలేని ద్మిత్రీ మెద్వదేవ్ అధ్యక్షుడు కాగా నేటి అధ్యక్షుడు పుతిన్! పదమూడేళ్లుగా పుతిన్ రష్యా పూర్వప్రాభవాన్ని సంపాదించడానికి చేస్తున్న కృషినంతటినీ సిరియాలో సమాధి చేసుకోడానికి సిద్ధపడలేదు. సిరియాపై సైనిక చర్యను సహించడమంటే ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌పై దాడికి దిగడానికి అనుమతించడమేనని పుతిన్‌కు బాగా తెలుసు. అందుకే తాడో పేడో తేల్చుకోడానికి సిద్ధపడ్డారు. 70 శాతం అమెరికన్లేగాక, జర్మనీవంటి కీలకమైన యూరోపియన్ దేశాలు సైతం వ్యతిరేకిస్తుండగా సుదీర్ఘ యుద్ధానికి ఒబామా సిద్ధంగా లేరు. అయినా రష్యా వెనక్కు తగ్గుతుందన్న ధీమాతో సర్వం ఒడ్డి జూదమాడారు. ఆయన అంచనాలు తప్పడంతో మధ్యప్రాచ్యంపై అమెరికా ఆధిపత్యాన్ని, ఆధిక్యతను, అద్వితీయ స్థానాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. నమ్మకమైన మిత్రులనుకున్నవారిని అందరినీ దూరం చేసుకోవాల్సి వస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఒబామా రష్యా, చైనాలతో తలపడాల్సి వచ్చేసరికి తోక ముడిచారు. పరువు దక్కించుకోడానికి రష్యా ‘హామీ మేరకు’ సైనిక చర్యను విరమించారు.
 
 ‘నమ్మక ద్రోహం’
 హడావిడిగా ఇరాన్ నూతన అధ్యక్షుడు హస్సన్ రుహానీతో ఒబామా మొట్టమొదటిసారిగా పోన్‌లో సంభాషించారు. దీంతో రష్యా ప్రతిపాదనకు అసద్ తల ఊపారు, అమెరికా కనుసన్నల్లోని ‘ఫ్రీ సిరియన్ నేషనల్ ఆర్మీ’ ఠక్కున అసద్‌తో శాంతి చర్చలకు అంగీకరించింది. రెండేళ్ల క్రితం నాటి రష్యా పాత ప్రతిపాదన... సిరియాపై జెనీవాలో శాంతి చర్చలకు తెరలేచింది. ఇరాన్‌తో అణు చర్చలకు కూడా హఠాత్తుగా దారి తెరచుకుంది. చకచకా జరిగిపోయిన ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలోని అమెరికా నమ్మకమైన మిత్రులంతా ఖంగుతిన్నారు.  ఇరాన్, అమెరికాల మధ్య సయోధ్య కుదిరితే దానిపై ఆంక్షల ఎత్తివేత తథ్యం. అదే జరిగితే ప్రాంతీయ శక్తిగా ఇరాన్ సౌదీకేగాక, ఇజ్రాయెల్‌కు కూడా గట్టి పోటీదారవుతుంది. సిరియా, ఇరాన్ యుద్ధాలపై ఆ రెండు దేశాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి.
 
 సౌదీ, ఖతార్‌లు సిరియాలోని అల్‌కాయిదా అనుబంధ ఉగ్రవాద మూకలకు అపారంగా నిధులను సమకూర్చాయి. అమెరికా ైవె ఖరిని సౌదీతో పాటూ దాని నేతృత్వంలోని గల్ఫ్‌సహకార మండలి దేశాలన్నీ నమ్మక ద్రోహంగా పరిగణిస్తున్నాయి. భద్రతారాహిత్యానికి గురవుతున్నాయి. జూలైలో రష్యాతో రహస్య ఆయుధాల ఒప్పందం కోసం ప్రయత్నించిన బందర్ బుష్ నేడు తిరిగి రష్యా వేపు చూస్తున్నారు. ఇజ్రాయెల్ ఒంటరిగానైనా ఇరాన్ అణుకర్మాగారాలపై దాడులు చేసే విషయాన్ని పరిశీలిస్తోంది. ఇదిలా ఉండగా అరబ్బు దేశాలకు ‘ఆదర్శ నమూనా’గా అమెరికా కీర్తించే టర్కీ కూడా ఒబామాపై ఆగ్రహంతో ఉంది. సిరియాలో అసద్ పాలనను అంతం చేయడానికి పట్టుబట్టిన టర్కీ ప్రధాని రెసెప్ తెయ్యిప్ ఎర్డోగాన్ అమెరికా నూతన వైఖరితో తమ దేశ భద్రతపట్ల ఆందోళన చెందుతున్నారు. సహజంగానే ఇరాన్... రష్యా, చైనాలతో సత్సంబంధాల ద్వారా సిరియా నుంచి ముప్పును నివారించుకోవాలని ప్రయత్నిస్తోంది.
 
 నాటోలోని ఏకైక ముస్లిం మెజారిటీ దేశమైన టర్కీ నేడు నాటోయేతర క్షిపణి రక్షణ వ్యవస్థలపై ఆధారపడటం అవసరమని భావిస్తోంది. ఈయూలో చేరుతానని ఊరిస్తున్న ఎర్డోగాన్ యూరోపియన్ కంపెనీలను కాదని... క్షిపణి రక్షణ వ్యవస్థల కోసం (ఎఫ్‌డీ-200) 300 కోట్ల డాలర్ల కాంట్రాక్టును చైనాకు కట్టబెట్టారు. పైగా ఇరాన్‌కు ఆయుధాలను సరఫరా చేస్తున్నందుకుగానూ అమెరికా ఆంక్షలకు గురైన చైనా కంపెనీ సీపీఎమ్‌ఐఈసీతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మరోవంక ఈ నెల మొదటి వారంలో ఎర్డోగాన్ ప్రభుత్వం ఇరాన్‌తో సత్సంబంధాలకు పటిష్టమైన ‘వారథి’ని నిర్మించింది. ఇజ్రాయెల్ తరఫున గూఢచారులుగా పనిచేస్తున్న పది మంది ఇరానీయుల జాబితాను ఇరాన్‌కు అందజేసింది. దీంతో అమెరికా టర్కీకి తమ పేట్రియాట్ క్షిపణుల సరఫరాను నిలిపివేసిందనేది వేరే సంగతి. అమెరికా గూటి చిలుక అనుకున్న ఎర్డోగాన్ రెక్కలు గట్టుకొని కొత్త మిత్రులను అన్వేషించుకుంటున్నారు.  
 
 దెబ్బ మీద దెబ్బ
 సిరియా సమస్యపై ఒబామాకు ‘నాకింగ్ పంచ్’ను (పడగొట్టే దెబ్బ) రుచి చూపించిన పుతిన్ అదే ఉత్సాహంతో అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బ మీద దెబ్బ తీస్తున్నారు. మధ్య ఆసియా ప్రాంతంలోని ఒకప్పటి సోవియట్ యూనియన్ రిపబ్లిక్కుల చమురు సంపదపై రష్యా ఆధిపత్యాన్ని దెబ్బ తీయడానికి అమెరికా, ఈయూలు చేస్తున్న ప్రయత్నాలకు గండి కొట్టడానికి ఇదే సమయమని భావించారు. అందుకే యూరోపియన్ యూనియన్‌లో చేరడానికి ఒప్పందం కుదుర్చుకోడానికి సిద్ధంగా ఉన్న ఉక్రేనియాకు హెచ్చరికను జారీ చేశారు. నవంబర్ చివర్లో ఈయూతో జరిగే సమావేశంలో ఉక్రెయిన్ ఆ ఒప్పందంపై సంతకాలు చేస్తే తమ ‘కస్టమ్స్ యూనియన్’ సభ్యత్వంపై ఆశ వదులుకోక తప్పదని తేల్చేశారు. ఉక్రెయిన్ విదేశీ వాణిజ్యంలో 36 శాతం వాటా రష్యా, బెలారస్, కజకిస్థాన్‌లతో కూడిన ఆ కూటమితో జరిగేదే. రష్యా కూడా ఈయూకు ప్రధాన వాణిజ్య భాగస్వామే. మిత్రుని మిత్రుడు మిత్రుడు కానవసరం లేదు. పేకాట పేకాటే బామ్మర్ది బామ్మర్దే. రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ జనాభాలో సగం మంది రష్యాతో అనుబంధానికే ప్రాధాన్యం ఇస్తారు. రష్యా మాట పెడ చెవిని పెడితే రష్యా జాతీయుల ఆధిక్యత ఉన్న తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో వేర్పాటువాద ఉద్యమాలు తలెత్తితే రష్యా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ప్రధాని మెద్వదేవ్ స్పష్టం చేశారు.
 
 ఇది బ్లాక్ మెయిల్ కాదని, రష్యాతో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ప్రతి చర్యని ముక్తాయించారు. మధ్య ఆసియాలో రష్యన్ భల్లూకం తిరిగి పంజా విసురుతున్న సమయంలో  అమెరికా ఆ ప్రాంతంలోని తమ ఏకైక సైనిక స్థావరాన్ని ఎత్తివేయక తప్పడం లేదు. క్రిజిగిస్థాన్ ప్రభుత్వం అమెరికా సైనిక స్థావరం కొనసాగింపునకు అంగీకరించలేదు... ఎందుకో చెప్పనవసరం లేదు. ఇరాక్ యుద్ధంతో మధ్యప్రాచ్యపు రాజకీయ పటాన్ని తిరిగి రాయాలని అమెరికా భావించింది. ఆ ఆశలన్నిటినీ సిరియాలో సమాధి చేసుకొని, అమెరికా తన తలరాతను తానే తిరిగి రాసుకోవాల్సి వస్తోంది. ఇదంతా రష్యా తిరిగి బలీయమైన శక్తిగా ఆవిర్భవించిన ఫలితమో, చైనా అగ్రరాజ్యంగా మారిన ఫలితమో కాదు. అమెరికా ‘సామ్రాజ్య’ ప్రాభవం అస్తమిస్తున్న సూచన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement