పాలకుల ‘తాకట్టు’ గుట్టు విప్పిన తరిమెల | Tarimela nagi reddy Sacrifices his life for India | Sakshi
Sakshi News home page

పాలకుల ‘తాకట్టు’ గుట్టు విప్పిన తరిమెల

Published Thu, Feb 11 2016 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

పాలకుల ‘తాకట్టు’ గుట్టు విప్పిన తరిమెల

పాలకుల ‘తాకట్టు’ గుట్టు విప్పిన తరిమెల

భారతదేశం తన జాతీయతను సమున్న తంగా నిలుపుకోవాలని ఆకాంక్షిస్తూ తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన సమరయోధుల్లో తరిమెల నాగిరెడ్డి ఒకరు. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, గాంధీ ప్రభావం నుంచి మార్క్సిజం వైపు ఆకర్షితులై పీడిత ప్రజల కోసం నిరంతరం తపించిన వ్యక్తి తరిమెల నాగిరెడ్డి. ‘యుద్ధం దాని ఆర్థిక ప్రభా వాలు’ అన్న పుస్తక ప్రచురణకు గాను 1940లో ఆయనపై బ్రిటిష్ ప్రభు త్వం రాజద్రోహం నేరం మోపి రెండేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది.

1969లో అదే రాజద్రోహ నేరంతో ఆయనకు భారత పాలకులు కూడా నాలుగేళ్ల శిక్ష విధించారు. నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు ఉద్యమంలో అత్యంత కాలం జైళ్లల్లో లేదా రహస్య జీవితంలో గడిపారు. మద్రాసు ప్రెసిడెన్సీలో కర్నూలు రాజధానిగా గల ఆంధ్ర ప్రదేశ్‌లో లేదా హైదరాబాద్ రాజధానిగా గల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు. పార్లమెంట్ సభ్యుడిగా, అకౌంట్స్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఆయన కొనసాగారు.
 
 నాగిరెడ్డి గొప్ప ఆర్థికవేత్త. మార్క్సిస్టు దృక్పథంతో భారత ఆర్థిక వ్యవస్థను అనితరసాధ్యంగా విశ్లేషించారు. 1969-70 మధ్యనే ఆయన తన కోర్టు ప్రకటనలో ‘భారతదేశం తాకట్టు’కు గురైందని ప్రకటిం చారు. అంతకుముందు ఆయన అసెంబ్లీకి రాజీనామా చేసినప్పుడు.. భారత పాలకులు కార్పొరేట్ రంగం కోసం, ప్రపంచ బ్యాంక్ ప్రయోజ నాల కోసం ఎలా పని చేస్తున్నారో వివరించారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించలేదని, నేడు దేశాన్ని పాలించే వారంతా విదేశీ పెట్టుబడిదారులకు, భారతదేశంలోని పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నా రని వీరికి ఏమాత్రం జాతీయత లేదని ఆనాడు ఆయన సంచలనమైన ప్రకటన చేశారు.

 భారత పాలకులకు దళారీ స్వభావం కలదని నాగిరెడ్డి పదే పదే చెప్పారు. నేడు కార్పొరేట్ రంగం భారత ప్రభుత్వాలను, రాష్ట్ర ప్రభుత్వాలను వారి వారి దశాదిశలను నిర్దేశించడం నిత్యం చూస్తున్నాం. కనీస జాతీయతా భావం కలవారు ఎవరైనా విదేశీ దోపిడీని, స్వదేశంలోని కార్పొరేట్ రంగ కబంధహస్తాల నుండి భారత ప్రజలను వేరుపర్చ డానికి పోరాటం చేస్తారు. ఆ పనినే తరిమెల నాగిరెడ్డి చేశారు.
 
 నేడు నాగిరెడ్డి శతజయంతి కార్యక్రమాలు ప్రారంభమవుతు న్నాయి. ఈ సందర్భంగా ఆయన రచించిన ‘తాకట్టులో భారతదేశం’ పుస్తకం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. నాగిరెడ్డి గారి వ్యక్తిత్వం చాలా విలక్షణమైనది. ఆంధ్రప్రదేశ్‌లోసంపన్న కుటుంబం నుంచి ఎదిగి వచ్చిన నాగిరెడ్డి అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర నిర్బంధం ఎదుర్కొంటూ ఆధునిక వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ఉస్మా నియా జనరల్ ఆస్పత్రిలో వెంకటరామయ్య అనే మారు పేరుతో జనరల్ వార్డులో పేషెంట్‌గా చేరి 28 జూలై 1976లో మరణించారు. ఒక స్వాతంత్య్ర సమరయోధుడిగా తామ్ర పత్రాలు, పింఛన్లు, భూమి కేటాయింపులు లేదా ఎంపీగా, ఎమ్మెల్యేగా వచ్చే అలవెన్స్‌లను తాను తిరస్కరించారు. ‘ప్రజాసేవలో తరిమెల నాగిరెడ్డి’ పుస్తకంలో అనేక మంది రచయితలు, సామాజికవేత్తలు తమ అనుభవాలను ఎంతో ప్రతిభావంతంగా రచించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో నేడు జరుగనున్న ‘ప్రజాసేవలో తరిమెల నాగిరెడ్డి’ పుస్తకావిష్కరణలో కేఆర్.
 
వేణుగోపాల్ (మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రధాని కార్యాలయం), కె.రామచంద్రమూర్తి (సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్) తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొం టున్నారు. తరిమెల నాగిరెడ్డి స్మారకసంఘం, తరిమెల నాగిరెడ్డి మెమో రియల్ ట్రస్టుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. తరిమెల నాగిరెడ్డి మరణం మనకందరికీ ఒక పెద్ద సవాల్‌ను, బాధ్య తను విసిరింది. ప్రజల కొరకు సామాజిక న్యాయం కొరకు దీక్షతో పని చేయడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి.  (తరిమెల నాగిరెడ్డి శతజయంతి సందర్భంగా నేడు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం గం.10 లకు ‘ప్రజాసేవలో తరిమెల నాగిరెడ్డి’ పుస్తకావిష్కరణ సందర్భంగా)
 వ్యాసకర్త కదలిక సంపాదకులు  
 మొబైల్ : 99899 04389
 - ఇమామ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement