
ప్రవక్త జీవితం, సందేశం శాంతి
కొత్త కోణం:
అరబ్బు ప్రపంచం తీవ్ర సంక్షోభంలో ఉండగా, తెగల మధ్య చెలరేగుతున్న నిరంతర హింసను ఆపడమెలాగని మహమ్మద్ ప్రవక్త యోచించారు. ప్రజలను ఐక్యం చేయాలని పరితపించారు. సమాజాన్ని హింసా ప్రవృత్తి నుంచి విముక్తం చేసి, శాంతియుత సహజీవనానికి అంకురార్పణ చేయడానికి ప్రవక్త చేసిన కృషి విజయవంతమైంది. ప్రజల మధ్య ఐక్యతను సాధించి అరబ్బు ప్రపంచంలో శాంతిని నెలకొల్పిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. ఆయన శాంతి, ఐక్యతల సందేశం అందరికీ అనుసరణీయం.
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమాజంలోని వివిధ సంఘర్షణల నుంచి అద్భుతాలు ఆవిష్కృతమవుతుంటాయి. కొందరు ఆ సంక్షోభంలో పడికొట్టుకుపోతే, కొందరు ప్రవాహానికి ఎదురీది సమాజానికి నూతనో త్తేజాన్ని అందిస్తారు. సమాజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తారు. అలాంటి వారినే ఒకప్పుడు ప్రవక్తలన్నారు. సమాజ అంగీకారాన్ని పొందిన కొందరు ప్రవక్తల ప్రబోధాలే మతాలై ప్రపంచాన్ని నడిపిస్తుంటాయి. ప్రపంచంలో అత్యధిక భాగానికి వ్యాపించిన బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం మతాలు అవి ఆవిర్భవించిన కాలాల్లో సామాజిక విప్లవాలుగా నిలిచాయి. సమాజ పురోగమనానికి, అభివృద్ధికి దోహదం చేశాయి. కాలంచెల్లిన బానిస సమాజపు పోకడలను కాలదన్ని వినూత్న ఆలోచనలకు అంకురార్పణ చేసిన ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ పుట్టిన రోజు నేడు. ప్రవక్త జన్మది నాన్నే మిలాద్-ఉన్-నబీగా జరుపుకుంటున్నాం. ఆయన జన్మించేనాటికి అరబ్బు ప్రపంచంలో ఉన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన బోధనలు ఆనాటి సామాజాన్ని మౌఢ్యం సుడిగుండం నుంచి గట్టెక్కించి, సామాజిక సంక్షోభాన్ని పరిష్కరించాయని విశదమవుతుంది.
అంధకారంలో మెరిసిన కాంతి రేఖ
మూడు వైపులా సముద్రం చుట్టివున్న ద్వీపకల్పం లాంటి అరబ్బు ప్రాంతం ఆనాడు చాలా తెగలకు ఆవాసంగా ఉండేది. మూడు ముఖ్య తెగలు కీలకమై నవిగా ఉండేవి. మొదటి ప్రవక్తగా భావించే ఇబ్రహీం బోధనలను కాదని, వారు వివిధ రకాల విగ్రహాలకు పూజలు చేసేవాళ్ళు. ఇస్లాం సందేశానికి మూలమైన ‘‘తౌహీద్’’ ఏకేశ్వరోపాసన, దేవుని ఏకత్వ భావనకు వారి మత విశ్వాసాలు విరుద్ధమైనవి. సూర్యచంద్రులను, నక్షత్రాలను, గ్రహాలను, సన్యాసులను, నదులను, పర్వతాలను, మనుషుల్ని, చివరకు జంతువులను, రాళ్ళను, కొండలను, గుట్టలను వారు పూజించేవారు. ఈ బహు దైవారాధన తెగల మధ్య క్రమంగా నిరంతర సంఘర్షణలకు కారణమైంది.
అంతర్గత యుద్ధాలతో అరబ్బు నేలపై రక్తం ఏరులై పారేది. ఫలితంగా రాజకీయ అస్థిరత నెలకొనడమే గాక, సామాజిక, ఆర్థిక జీవితం ఛిన్నాభిన్నమైంది. అనైక్యతతో, మౌఢ్యంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ అరబ్బులు ఎవరికీ లొంగని స్వతంత్ర స్వభావులు. కఠోరమైన ఎడారి జీవితానికి తోడు, కర్తవ్య నిర్వహణ కోసం జీవితాన్ని ధారపోసే విశిష్ట స్వభావం వారిది. అరబ్బు ప్రపంచం తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆ సమయంలోనే మక్కాలో క్రీ.శ. 571 ఏప్రిల్ 22న ప్రవక్త మహమ్మద్ జన్మించారు. సామాజికంగా ఉన్నత స్థానంలో ఉన్న ఖురైష్ తెగకు చెందిన మహమ్మద్ ప్రవక్త చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, తాత ఒడిలో పెరిగారు. అరబ్బు సంప్రదాయాల ప్రకారం పట్టణాలలో పుట్టిన పిల్లలు కూడా బాల్యాన్ని పల్లెల్లో గడిపేవారు. మహమ్మద్ ప్రవక్త కూడా అలా పల్లెలో గొర్రెల కాపరిగా ఎదిగారు. ఆ తెగ నాయకత్వ స్థానానికి రావడానికి కష్టభరితమైన ఆ జీవితం ఆయనకు ఎంతో ఉపకరించింది. తాత మరణం తర్వాత, ఆయన పినతండ్రి దగ్గరికి చేరాడు.
ప్రవక్త శాంతి ప్రస్థానానికి నాంది
అరబ్బులలోని మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు, అనైక్యత ఆయనను చిన్నతనం నుంచే కలవరపరిచాయి. ఖురైష్ తెగ సంప్రదాయాలను ఆయన ఆనాటి నుంచే వ్యతిరేకించారు. విగ్రహారాధనకు దూరంగా ఉన్నారు. ఖురైష్, కైస్ తెగల మధ్య జరిగిన ఫిజార్ యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త కూడా పాల్గొన్నారు. ఆ యుద్ధం ఆయనలో పెద్ద మార్పుని తీసుకొచ్చింది. యుద్ధం తదుపరి ఆయన పినతండ్రి జుబైర్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ చొరవతో ఖురెష్ ప్రముఖులు ఐదు అంశాల తీర్మానాన్ని ఆమోదించారు.
1. ఈ భూభాగం నుంచి అశాంతిని పారద్రోలి శాంతిని నెలకొల్పుతాము, 2. బాటసారుల కోసం రక్షణ సదుపాయాలు కలుగజేస్తాం, 3. నిరుపేదల అవసరాలను తీర్చడానికి సహాయం చేస్తాం, 4. దుర్మార్గుల దౌర్జన్యానికి గురయ్యేవారికి రక్షణ కల్పిస్తాం, 5. దౌర్జన్యపరులకు మక్కాలో స్థానం లేకుండా చేస్తాం. ఈ తీర్మానాన్ని రూపొందించడంలో మహమ్మద్ ప్రవక్తకు కూడా భాగం ఉంది. ఆయన తమ తెగ ఆచారం ప్రకారం వర్తకాన్ని వృత్తిగా స్వీకరించారు. అందులో ఆయన కనబరిచిన నిజాయితీ, సచ్ఛీలత ఎందరినో ఆకర్షించాయి. ప్రజలు ఆయనను సాదిక్ (సత్యసంధుడు), అమీన్ (విశ్వసనీయుడు) అని పిలిచేవారు.
వ్యాపారంలో భాగంగా ఆయన సిరియా, బస్రా, యెమెన్ దేశాల్లో చాలా సార్లు పర్యటించారు. ఆ సమయంలోనే శ్రీమంతురాలు, వ్యాపారవేత్తయిన హజ్రత్ ఖదీజా, మహమ్మద్ ప్రవక్త దీక్షాదక్షతలను తెలుసుకొని, తన వ్యాపార బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆయన నిజాయితీని మెచ్చిన ఆమె, ఆయనకు భార్య కావడానికి సుముఖత వ్యక్తం చేశారు. అలా వారిరువురు జీవిత భాగస్వాములయ్యారు.
సఫా పర్వతంపై నుంచి తొలి సందేశం
అయితే మహమ్మద్ ప్రవక్త రోజురోజుకూ సత్యాన్వేషణపై దృష్టిని కేంద్రీకరించారు. అరబ్బు ప్రపంచంలో చెలరేగుతున్న నిరంతర హింసను ఆపడమెలాగని యోచించారు. ఒంటరిగా నిత్యం తనలో తాను సంఘర్షించేవారు. బహు దేవతల ఆరాధనతో అనైక్యంగా ఉన్న ప్రజలందరినీ ఎలాగైనా ఐక్యం చేయాలని పరితపించేవారు. సంఘర్షణలు, యుద్ధాలు మాన్పించి, సమాజాన్ని శాంతి వైపు నడిపించాలని కలలుగనేవారు. ప్రజలనందరినీ ఏదైనా సందేశం వినిపించడానికో, హెచ్చరించడానికో చెట్టుమీదకు లేదా గుట్టమీదకు ఎక్కి అరవడం ఆ రోజుల్లో అలవాటుగా ఉండేది. ఒకరోజున మహమ్మద్ ప్రవక్త కూడా సఫా పర్వతంపై నుంచి అందర్నీ పిలిచి ‘‘కొండకు ఆవల ఒక పెద్ద సైన్యం నిలిచి ఉందని, అది మీపైకి దండెత్తడానికి సిద్ధంగా ఉందని నేనంటే నా మాటను నమ్ముతారా?’’ అని గట్టిగా అడిగారు.
‘‘నిస్సంకోచంగా నమ్ముతాం. మిమ్మల్ని సత్యసంధులుగా, విశ్వసనీయులుగానే చూశాం’’ అని ప్రజలు జవాబిచ్చారు. అప్పుడు మళ్ళీ మహమ్మద్ ప్రవక్త ‘‘జనులారా! నేను మిమ్మల్ని విగ్రహారాధన చేయరాదని కోరుతున్నాను. ఒకే ఒక్క దేవుణ్ణి ఆరాధించాలని అడుగుతున్నాను. మీరు ఇది కాదన్నారంటే భయంకరమైన శిక్షకు గురవుతారు’’ అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మహమ్మద్ ప్రవక్త తొలి సందేశం ఇదే. అయితే అది విన్న ఖురైష్ ప్రజల కోపం కట్టలు తెంచుకున్నది, కల్లోలం రేగింది. మహమ్మద్ ప్రవక్తపైకి కత్తులతో దూసుకువచ్చారు. హజ్రత్ అనే వ్యక్తి ప్రవక్తకు రక్షణగా నిలిచి ఆయన కోసం ప్రాణత్యాగం చేశారు. ఇస్లాం మార్గంలో మొట్ట మొదటి షహదత్ ఆయనే. ఆ దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డ ప్రవక్త, ఆ తర్వాతా భౌతిక దాడులకు గురయ్యారు. అడుగడుగునా ఛీత్కారాలను, అవమానాలను ఎదుర్కొన్నారు. అయినా క్రమంగా మహమ్మద్ ప్రవక్తను అనుసరించే ఇస్లామీయుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మొట్టమొదట ఇస్లాంను స్వీకరించిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త జీవిత భాగస్వామి ఖదీజానే కావడం విశేషం.
ఇస్లాం చరిత్ర గతిని మార్చిన మదీనా రాజ్యాంగం
కానీ ప్రవక్తపై ఖురైష్ తెగ దాడులు తీవ్రమయ్యాయి. ఆయన అనుయాయులపైనా హింసాకాండ పెచ్చరిల్లింది. దీంతో మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి తన కార్యస్థలాన్ని మార్చాలని భావిస్తుండగా... మదీనా నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. మహమ్మద్ ప్రవక్తకు అండదండలందిస్తానని మదీనా నుంచి సమాచారం అందింది. ప్రవక్త తన మొదటి సందేశం వినిపించిన తర్వాత 11 ఏళ్లకు ఆరుగురు ప్రతినిధుల బృందం మక్కా వచ్చి ఆయనతో విస్తృతంగా చర్చలు జరిపింది. మరుసటి ఏడాది వచ్చిన 12 మంది ప్రతినిధులు ప్రవక్తతో జరిపిన చర్చలు, చేసిన ప్రతిజ్ఞ ‘అకాబా ప్రతిజ్ఞ’గా పేరు మోశాయి. ఆ తరువాత ప్రవక్త మదీనా పట్టణానికి చేరారు. మక్కాలోని ముస్లింలంతా ఆయనను అనుసరించి మదీనాకు వెళ్లారు. మదీనాలోని ఒకటి, రెండు మినహా అన్ని తెగలూ ప్రతి కుటుంబం నుంచి ఒక యువకుడిని ఇస్లాం సేవకు పంపాయి. దీంతో ఇస్లామియా ఉద్యమం కొత్త ఊపుతో ముందుకు సాగింది.
మదీనాలో మహమ్మద్ ప్రవక్త తీసుకున్న రాజకీయ నిర్ణయం ఇస్లాం చరిత్ర గతినే మార్చివేసింది. మదీనాలోని యూదులకు, ముస్లింలకు మధ్య ఒక సామాజిక ఒప్పందాన్ని ఖరారు చేయడం వల్ల ఇస్లాం ఒక ప్రత్యేక దశలోకి అడుగుపెట్టింది. దీనినే ‘మదీనా కాన్‌స్టిట్యూషన్’ అంటారు. ప్రపంచంలోని తొలి లిఖిత పూర్వక రాజ్యాంగంగా కూడా పిలుస్తారు. ఈ ఒప్పందం ఇస్లాం రాజ్యానికి పునాదులు వేసింది. వ్యవస్థీకృత సమాజంలో దేవునికే సర్వసత్తాక అధికారం ఉంటుందని, దైవిక చట్టాలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తారని ఈ రాజ్యాంగం వ్యాఖ్యానించింది. మదీనాలోని స్థానిక అన్సార్లకు, మక్కా నుంచి వచ్చిన ముహజిర్లకు మధ్య సోదర సంబంధాలను నెలకొల్పడం ద్వారా ప్రవక్త నూతన సహోదర మానవ సంబంధాలకు పునాదిని వేశారు.
సమాజాన్ని హింసా ప్రవృత్తి నుంచి విముక్తం చేయడానికి, శాంతియుత సహజీవనానికి అంకురార్పణ చేయడానికి మహమ్మద్ ప్రవక్త చేసిన ప్రయత్నం విజయవంతమైంది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇస్లాం మతం విస్తరించింది. ప్రజల మధ్య ఐక్యతను సాధించి అరబ్బు భూభాగాన్ని నవ నాగరికతలోకి నడిపిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. అందుకే ఆయన చూపిన శాంతి, ఐక్యత నుంచి స్ఫూర్తినొందడం అందరికీ అనుసరణీయమే.
నేడు మిలాద్-ఉన్-నబీ సందర్భంగా...
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మల్లెపల్లి లక్ష్మయ్య( మొబైల్: 97055 66213)