
ఏవీ ఆ మాటల తూటాలు?
చంద్రశేఖరరావు తాను తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన నాటి నుంచి జరిగిన పరిణామాలను, తనతో నడిచిన వాళ్లను ఈ మహాసభలో గుర్తు చేసుకున్నారు.
దేవులపల్లి అమర్
చంద్రశేఖరరావు తాను తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన నాటి నుంచి జరిగిన పరిణామాలను, తనతో నడిచిన వాళ్లను ఈ మహాసభలో గుర్తు చేసుకున్నారు. ఒకచోట కొంచెం ఉద్వేగానికి కూడా లోనయ్యారు. కొట్టొచ్చినట్టు కనిపించింది ఏమిటంటే తెలంగాణ ఉద్యమానికి అత్యంత దన్నుగా నిలిచి మొత్తం ఉద్యమ విశ్వసనీయతను ఆకాశం ఎత్తుకు పెంచిన రాజకీయ జేఏసీ, అది నిర్వహించిన సకల జనుల సమ్మె, సాగరహారం, మిలియన్ మార్చ్ ఇంకా అనేక పోరాటాల ప్రస్తావనే ముఖ్యమంత్రి ఈ సభలో తీసుకురాకపోవడం.
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. వనరులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి సోమవారం నాటి పరేడ్ గ్రౌండ్స్ సభల వంటి సభలు చాలా సునాయాసంగా జరపవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 14 ఏళ్లు పోరాడి, రాష్ట్రాన్ని సాధించుకుని ఎన్నికలలో ప్రజల మన్నన పొంది అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ బహిరంగ సభ నిర్వహణ టీఆర్‌ఎస్‌కు ‘బాయే హాత్ కా ఖేల్’ (ఎడం చేత్తో సునాయాసంగా ఆడడం) లాంటిదే. బహిరంగ సభల నిర్వహణ తెలంగాణ రాష్ట్ర సమితికి మొదటి నుంచి చాలా సులువైన ఆటే. ఉద్యమం అద్భుతంగా ఉన్నకాలంలో నిర్వహిం చినా, కొంత నిరాశ చోటు చేసుకుంటున్నదని అనిపించిన సమయంలో ఏర్పాటు చేసినా, ఉప ఎన్నికల వేళ అయినా, ఎప్పుడైనా టీఆర్‌ఎస్ నిర్వహిం చిన సభలకు జనం బ్రహ్మాండంగానే హాజరయ్యారు. అటువంటి నిబద్ధత గల నాయకులూ, అంకితభావంతో పనిచేసే కార్యకర్తలూ ఆ పార్టీకి వేల సంఖ్యలో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం తరువాత కరీంనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభ మొదలు, తరువాత వరంగల్, హైదరాబాద్‌లలో- నిర్వహించిన ప్రతి చోటా ప్రాంగణాలు కిక్కిరిసిపోవలసిందే. ఉద్యమకాలంలో తమ నాయకుడు తన మాటలతో మంటలు సృష్టించేవాడు. జనాన్ని పోరాటం వైపు నడిపించే వాడు. కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసేవాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వాక్పటిమ అద్భుతం. ఎంతటివారినైనా కదలకుండా నిలబెట్టేస్తుంది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన వెంటనే జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మొత్తం ప్రచారం ఒంటరిగా పది జిల్లాలలోనూ వందకు పైగా సభలలో ఆయన ప్రసంగించారు. ఆ వాగ్ధాటి పార్టీకి అంతటి ఘన విజయాన్ని సాధించిపెట్టింది.
నిరుత్సాహపరచిన ప్రసంగం
అటువంటి నాయకుడు మొన్న 24వ తేదీన ఫతేహ్ మైదానంలో జరిగిన పార్టీ ప్లీనరీలోనూ, సోమవారం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలోనూ చేసిన ప్రసంగాలు టీఆర్‌ఎస్ శ్రేణులనే తీవ్ర నిరుత్సాహానికి గురిచేశాయి. ఎంతో శ్రమించి లక్షలాదిమందిని సభకు సమీకరించిన మంత్రులు, రెండో శ్రేణి నేతలు, కార్యకర్తలు కూడా అర్థంకాలేదు- అధినాయకుని ప్రసంగం అంత తక్కువసేపు, అంత నిరుత్తేజంగా ఎందుకు సాగిందో. నాయకుని ఉపన్యాసం జనంలో నిరాశ కలిగించిన మాట వాస్తవం. ఆయన మొత్తం ప్రసంగం నలభై నిమిషాల లోపునే ముగిసింది. ఏవో అద్భుతమైన ప్రకటనలు వస్తాయి, ప్రజా సంక్షేమానికీ, అభివృద్ధికీ సంబంధించిన కొత్త పథకాల ప్రకటన ఏమైనా ఉంటుందని ఆశించినవారు సహజంగానే నిరాశకు గురైనారు. మామూలుగా బహిరంగ సభలు జనబలాన్ని ప్రదర్శించుకోవడానికి ఉపయోగపడతాయి. కింది స్థాయి నాయకులు తమ ప్రాబల్యాన్ని ప్రదర్శించుకోవడానికి, అధినాయకత్వం వద్ద మార్కులు వేయించుకోవడానికి కూడా ఉపయోగ పడతాయి. అటువంటి సభలలో రాజకీయ దిశా నిర్దేశం చేసే ప్రసంగాలు ఉండకపోవడం సహజమే. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలో కూడా పార్టీ అధ్యక్షుడి ప్రసంగం నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసే విధంగా సాగలేదు.
అస్పష్టంగా ప్రాజెక్టుల ప్రస్తావన
ముఖ్యమంత్రి తన ముక్తసరి ప్రసంగానికి కారణం చెప్పారు- అప్పుడు మాట్లాడే సమయం, ఇప్పుడు పనిచేసే సమయం అని. చాలా విలువైన మాట చెప్పారు. ప్రభుత్వాధికారులు అందరూ చెయ్యవలసిన పని అది. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తేనే కదా ప్రజలకు సేవలు సక్రమంగా అందేది. తెలంగాణ ముఖ్యమంత్రి చాలా పథకాల గురించి 11 మాసాలుగా మాట్లాడుతున్నారు. కాని వాటి అమలు ఎప్పుడు మొదలవుతుందో స్పష్టత ఇవ్వడం లేదు. ఆ స్పష్టత నిన్నటి బహిరంగ సభలో కూడా రాలేదు. వచ్చే మార్చి నెల నుంచి వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటల కరెంటు కచ్చితంగా ఇస్తామన్నారు. అది ఎట్లా ఇస్తారో చెప్పలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కీలక నాయకుడు హరీశ్‌రావు ఆశ్చర్యపోతూ ఉంటారు, మా ముఖ్యమంత్రి ఏం మాయ చేశారో కాని కరెంట్ కోతలే లేవు అని. కోతలు లేవు అనడం కోతలు కొయ్యడమే అని వారికీ తెలుసు. సాగు వినియోగం సగం పడిపోవడం, ఆ కారణంగానే అనీ, ఎడా పెడా కోతల కారణంగా ఖరీఫ్‌లో పంటలు ఎండిపోవడంతో భయపడి రైతులు ఈ రబీలో పంటలు వెయ్యక విద్యుత్ డిమాండ్ పడిపోయిందే తప్ప, ఇందులో మనం చేసింది ఏమీ లేదని కూడా వారికి బాగా తెలుసు. వచ్చే ఖరీఫ్‌లో తీవ్రమైన కరెంట్ కష్టాలు తప్పవు. అవి ఉండవు అనే భరోసా ఇస్తున్నారు తప్ప, ఎట్లా సాధ్యమో చెప్పడం లేదు.
నిరుద్యోగులకు నిరాశ
ఇక ముఖ్యమంత్రి ప్రసంగంలో రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వివిధ సందర్భాలలో ఆయన ఈ అంశం మీద వివిధ రకాల ప్రకట నలు చేశారు. ఆయన పార్టీ నాయకులు కూడా చేశారు. అంతకు ముందు ఒక సందర్భంలో పార్టీ జనరల్ సెక్రటరీ కె. కేశవరావు అతి స్వల్పకాలంలో ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. అసెంబ్లీ వేదికగా మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్ ఒక సంవత్సరంలోనే లక్ష ఉద్యోగాలు అని చెప్పారు. ఇక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షులైతే కొత్త సంవత్సరం కొత్త ఉద్యోగాలు అని ప్రకటించారు. ఇలా భిన్నమైన ప్రకటనలు నిరుద్యోగ యువతను గందరగోళంలోకి నెడుతున్నాయి. నిరాశకు గురి చేస్తు న్నాయి. ముఖ్యమంత్రి ప్రస్తావించిన మిగిలిన అంశాలు మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్. ఈ రెండు పథకాలకు అవినీతి మట్టి అంటకుండా చూడగలిగితే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. చంద్రశేఖరరావు ఇంకోసారి చరిత్రలో నిలిచిపోతారు. ఇక రెండు గదుల ఇళ్ల పథకాన్ని ఎవరూ సీరియస్‌గా పట్టించు కోవడం లేదు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యమా?
మొత్తం మీద ఆయన చివరలో మరచిపోతే పక్కనున్న వారు గుర్తు చేయడంతో చెప్పిన మాట హైదరాబాద్‌ను సింగపూర్, జపాన్‌లకు మించి, డల్లాస్ నగరంగా తీర్చిదిద్దుతామనడం. హైదరాబాద్‌లో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల గంట మోగింది. ఆ ప్రక్రియను డిసెంబర్‌లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పోటీ చేయలేదు. దానితో రాజధాని నగరంలో ఆ పార్టీకి రాజకీయ అస్తిత్వమే లేదనే ప్రచారం జరిగింది. ఇప్పుడు విపక్ష శాసనసభ్యులను పార్టీలో చేర్చు కోవడం అయినా, నిజాం రాజును పొగడ్తలలో ముంచెత్తడం అయినా, సెటిలర్‌లే లేరు అంతా మావాళ్లే అనడం అయినా జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే. సోమవారం నాటి మహాసభ రానున్న పురపాలక ఎన్నికలను ప్రభా వితం చేస్తుందేమో చూడాలి.
రాజకీయాలంటే ఇంతేనా?
బహిరంగ సభలో రాజకీయ ప్రత్యర్థుల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే పరిమిత మైనాయి. బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్‌ల మీద విమర్శ ప్రస్తావన మాత్రం గానే జరిగింది. రేపు జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కలసి బలమైన పోటీ ఇస్తాయని ముఖ్యమంత్రికీ, ఆయన పార్టీ పెద్దలకూ తెలియంది కాదు. ఇటీవలే జరిగిన శాసన మండలి ఎన్ని కలలో బీజేపీ అభ్యర్థి రామ్‌చందర్‌రావు గెలుపుతోనే అది అర్థమై ఉండాలి. అందుకే తెలుగుదేశం మీద విమర్శకే ఎక్కువ దృష్టి పెట్టారేమో. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు లక్ష్యంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవాడలో నిర్వహిం చాలన్న ఆలోచనను మార్చుకుని హైదరాబాద్‌లో జరపబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇక చంద్రశేఖరరావు తాను తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన నాటి నుంచి జరిగిన పరిణామాలను, తనతో నడిచిన వాళ్లను ఈ మహా సభలో గుర్తు చేసుకున్నారు. ఒకచోట కొంచెం ఉద్వేగానికి కూడా లోన య్యారు. కొట్టొచ్చినట్టు కనిపించింది ఏమిటంటే తెలంగాణ ఉద్యమానికి అత్యంత దన్నుగా నిలిచి మొత్తం ఉద్యమ విశ్వసనీయతను ఆకాశం ఎత్తుకు పెంచిన రాజకీయ జేఏసీ, అది నిర్వహించిన సకల జనుల సమ్మె, సాగర హారం, మిలియన్ మార్చ్ ఇంకా అనేక పోరాటాల ప్రస్తావనే ముఖ్యమంత్రి ఈ సభలో తీసుకురాకపోవడం. రాజకీయాలు ఇట్లానే ఉంటాయేమో! తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఇప్పుడు రాజకీయ పార్టీయే కదా!
datelinehyderabad@gmail.com