మరణమృదంగంలో ‘కారుణ్యం’ | There is no scope for misuse of the law up with specific guidelines | Sakshi
Sakshi News home page

మరణమృదంగంలో ‘కారుణ్యం’

Published Fri, Aug 1 2014 12:22 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

మరణమృదంగంలో ‘కారుణ్యం’ - Sakshi

మరణమృదంగంలో ‘కారుణ్యం’

చట్టాలు బాధితులకూ, పీడితులకూ మేలు కలిగించాలే తప్ప అవి అక్రమార్కులకు కల్పవృక్షాలు కాకూడదు. తగిన జాగ్రత్తలతో, నిర్దిష్టమైన మార్గదర్శకాలతో చట్టం తీసుకొస్తే దుర్వినియోగానికి ఆస్కారం ఉండదు. మతాచారాలను చూపి, దుర్వినియోగమవుతాయని చెప్పి మానవీయ కోణం ఇమిడివున్న అంశంలో తప్పించుకునే ధోరణి మంచిది కాదు.
 
కారుణ్య మరణం లేదా మెర్సీ కిల్లింగ్ చట్టబద్ధమా... మన సమాజంలో ఇది ఆమోదయోగ్యమా కాదా అనే మీమాంస మరోమారు తెరమీదికి వచ్చింది. వైద్య పరిభాషలో ‘యుతనేషియా’గా సంబోధించే కారుణ్య మరణాలపై మీ వైఖరేమిటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకూ సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. దీంతో ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. జీవించే హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ప్రతి పౌరుడికీ లభించే ప్రాథమిక హక్కు.
 
జీవించే హక్కు అంటే జంతువులా బతకడం కాకుండా ఒక వ్యక్తి ఆత్మగౌరవంతో, స్వచ్ఛమైన గాలి, నీరు, ఆరోగ్యంతో జీవించే హక్కు కలిగి ఉండటం. ఈ హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదు. ఇలా జీవించే హక్కును కల్పించిన రాజ్యాంగం మరణించే హక్కు కల్పించిందా? అవయవాలు పనిచేయకుండా దీర్ఘకాలం కోమాలో ఉంటూ జీవచ్ఛవంలా బతుకుతున్నవారికి ‘కారుణ్యమరణం’ ప్రసాదించడం చట్టం బాధ్యతా అనే సందేహాలకు జవాబులు వెదకడం అవసరం.
 
అరుణా రామచంద్ర షాన్‌బాగ్ ముంబైలోని ఒక ఆస్పత్రిలో నర్సుగా పనిచేసింది. ఆస్పత్రి వార్డ్ బాయ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 38 ఏళ్లక్రితం జరిగిన ఈ విషాదఘటన తర్వాత ఆమె కోమాలోకి వెళ్లి జీవచ్ఛవంలా ఆస్పత్రి బెడ్‌పైనే ఉంటున్నది. ఆమెకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలంటూ ముంబైకి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మూడేళ్లక్రితం జస్టిస్ మార్కండేయ కట్జూ, జస్టిస్ జ్ఞాన్‌సుధ మిశ్రాలతోకూడిన ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులో గౌరవంగా మరణించే హక్కు కూడా అంతర్లీనంగా ఇమిడివున్నదని ప్రకటించింది. అయితే, ఇందుకు అనేక మార్గదర్శకాలు నిర్దేశించింది.
 
కొన్నాళ్లక్రితం మన రాష్ట్రంలో జరిగిన ఒక ఘటనను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. వెంకటేశం అనే చురుకైన విద్యార్ధికి అకస్మాత్తుగా అరుదైన జబ్బు దాపురించింది. జబ్బు కారణంగా అతని అవయవాలు ఒక్కోటే చచ్చుబడటం మొదలైంది. తాను నెలకంటే ఎక్కువ బతకనని తెలుసుకుని తనకు కారుణ్యమరణాన్ని ప్రసాదించాలంటూ అతను న్యాయస్థానాల్లో పోరాడాడు. అప్పటికి సుప్రీంకోర్టు తీర్పు వెలువడలేదు గనుక న్యాయస్థానాలు, ప్రభుత్వం అతని వినతిని తోసిపుచ్చాయి.
 
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
తీవ్రమైన అనారోగ్యంతో, భరించలేని బాధతో...అయినవారికి భారంగా, జీవచ్ఛవంలా బతకడంకంటే ‘గౌరవంగా మరణించాలని’ కోరుకున్న సందర్భాల్లో మాత్రమే ఆమోదించాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. అయితే, ఇందుకు సంబంధిత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాల్సి వుంటుంది. హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించాలి. వైద్య నిపుణులు, ఇతర నిపుణులతో కమిటీని నియమించి దాని నివేదికనూ, ఇతర అంశాలనూ సమగ్రంగా పరిశీలించాలి.
 
అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి, తల్లిదండ్రులకు, రోగుల సమీప బంధువులకు... అలాంటివారు లేకుంటే సమీప మిత్రులకు నోటీసులు జారీచేయాలి. వీరి వాదనలు కూడా విన్నాక తీర్పు వెలువరించాలి.చట్టసభలు సమగ్ర చట్టాన్ని రూపొందించేవరకూ ఇదే విధానం కొనసాగించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ తీర్పు వెలువడి రెండేళ్లు గడిచినా ఈ మానవీయ అంశంపై కేంద్రం చట్టం చేయలేదని ‘కామన్ కాజెస్’ దాఖలుచేసిన పిల్‌పై తాజాగా సుప్రీంకోర్టు అందరికీ నోటీసులు జారీచేసింది.
 
మరో కోణమూ చూడాలి
జీవించడమంటే జీవచ్ఛవంలా బతుకీడ్చడం కాదు. ఆరోగ్యంతో హాయిగా జీవనాన్ని కొనసాగించడం. రోగాలబారినపడి, కదల్లేని స్థితిలో తనకు తాను భారం కావడమే కాక... సన్నిహితులకు కూడా భారంగా మారిన వ్యక్తి కారుణ్యమరణాన్ని కోరుకోవడం నాణేనికి ఒక పార్శ్వం. దీన్ని అనుమతించడం మొదలెడితే కార్పొరేట్ ఆస్పత్రులు, కాసులవేటలో మునిగే వైద్యులు అవయవాల మార్పిడికి, విక్రయాలకు తెరలేపే అవకాశాలున్నాయి. అంతేగాదు...ఆస్తి కోసమో, మరే కారణంతోనో తమవారిని కడతేర్చాలనుకునేవారికి ఇదొక ఆయుధమవుతుంది. అందుకే అరుదైన, గత్యంతరంలేని స్థితిలో మాత్రమే కారుణ్యమరణాలను అనుమతించే విధంగా కఠినమైన మార్గదర్శకాలను, నిబంధనలను రూపొందించాలి.
 
మన దేశంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి శిక్షార్హుడు. అందుకు ప్రేరేపించినా, సహకరించినా ఐపీసీ ప్రకారం నేరమే అవుతుంది. అలాంటప్పుడు కారుణ్యమరణాన్ని అనుమతించడం నేరమేనా? అమల్లో ఉన్న చట్టాల ప్రకారం అది నేరమే. అందుకే కొత్త చట్టాన్ని రూపొందించాల్సిన అగత్యం ఏర్పడింది. కొన్ని దే శాల్లో కారుణ్యమరణాలు నేరం కాదు. స్విట్జర్లాండ్‌లో వైద్యుడు రోగి మరణానికి మందులిచ్చి సహకరిస్తే నేరం. రోగి బంధువులు, మిత్రులు సహకరిస్తే మాత్రం నేరంకాదు. నెదర్లాండ్స్‌లో పరిస్థితులనుబట్టి అనుమతించే విధానం ఉంది.
 
రోగి మరణమే మేలని నిర్ణయించుకుని విన్నవించుకుంటే వైద్యుడు కారుణ్యమరణానికి సహకరించాలి. అంతకన్నా ముందు ఆ వైద్యుడు రివ్యూ కమిటీకి నివేదించి అనుమతి పొందాలి. ఆ దేశం ఈ చట్టాన్ని 2002లో తీసుకొచ్చింది. ఆ తర్వాత బెల్జియం కూడా ఈ తరహా చట్టాన్నే చేసింది. బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా తదితర దేశాల్లో కారుణ్యమరణాలు చట్టవిరుద్ధం. ఈ సంగతిని చట్టసభలే తేల్చాలని ఈమధ్యే బ్రిటన్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రం 2002లో కారుణ్యమరణాలను అనుమతించే చట్టం తీసుకొచ్చింది. దాని ప్రకారం కారుణ్యమరణం కోరే రోగికి వైద్యుడు కౌన్సెలింగ్ నిర్వహించాలి.
 
ఆ తర్వాత 15 రోజుల గడువునిచ్చి బాధితుడి బంధువులకు తెలియబరచాలి. వారి అంగీకారాన్ని కూడా పొందాక అధికారులకు వర్తమానం పంపి అనుమతి లభించాక మాత్రమే బాధితుడికి బంధవిముక్తి కల్పించాలి. ఈ ప్రక్రియ మధ్యలో బాధితుడు తన అంగీకారాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఈ చట్టం అమల్లోకి వచ్చాక ఒరెగాన్‌లో దాదాపు 200 మంది ఇలా మరణించారు. అటు తర్వాత ఆ దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టమే చేశాయి.
 
కారుణ్యమరణాలు ఎన్నో రకాలు

కారుణ్యమరణాలన్నీ ఒకటి కాదు. కోమాలో ఉంటూ జీవచ్ఛవంలా బతుకుతూ, ఏళ్లతరబడి నిర్జీవంగా పడివున్నవారికి వైద్యులు ఉద్దేశపూర్వకంగా చికిత్సను ఉపసంహరించడం ఒక రకం. దీన్ని ‘పాసివ్ యుతనేషియా’గా పరిగణిస్తారు. కోమాలో ఉన్నవారికి ఆహారం, ఇతర సదుపాయాలు నిలిపేయడం కూడా కారుణ్యమరణమే. మందులద్వారా తనువు చాలించడానికి తోడ్పడటం మరో తరహా. బతకాలని బలంగా కోరుకోవడం ఏ జీవికైనా ఉండే ప్రాథమిక లక్షణం. కానీ, అత్యంత దుర్భరమైన స్థితికి చేరి, ఇక కోలుకోలేమని తెలిసినవారిలో మరణానికి సిద్ధపడేవారూ ఉంటారు. మన దేశంలో కారుణ్యమరణాలను అనుమతించరాదని 17వ లా కమిషన్ చెప్పగా, 19వ లా కమిషన్ వీటికి అనుకూలంగా మాట్లాడింది. తగిన మార్గదర్శకాలు రూపొందించాలని సిఫార్సు చేసింది.
 
ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భిన్నవాదనలున్నాయి. కారుణ్యమరణం ముమ్మాటికీ ఆత్మహత్యేనని కొందరు...జీవచ్ఛవంలా మారి అందరికీ భారంగా బతకడంకంటే ఇలా మరణించాలనుకోవడమే సరైందని మరికొందరు వాదిస్తారు. చట్టాలు బాధితులకూ, పీడితులకూ మేలు కలిగించాలే తప్ప అవి అక్రమార్కులకు కల్పవృక్షాలు కాకూడదు. తగిన జాగ్రత్తలతో, నిర్దిష్టమైన మార్గదర్శకాలతో చట్టం తీసుకొస్తే దాని దుర్వినియోగానికి ఆస్కారం ఉండదు. అంతే తప్ప మతాచారాలను చూపి, చట్టాలు దుర్వినియోగమవుతాయన్న కారణం చెప్పి ఒక మానవీయ కోణం ఇమిడివున్న అంశంలో తప్పించుకునే ధోరణి ప్రదర్శించడం మంచిదికాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తాజా నోటీసుల నేపథ్యంలో ఎలాంటి వైఖరిని తీసుకుంటాయో చూడాలి.

 వ్యాసకర్త హైకోర్టు న్యాయవాది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement