బూటకపు తుపాన్
బైలైన్
‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్’ రాజేంద్రకుమార్ విషయమై కేజ్రీవాల్‌ను హెచ్చరించినా, ఆయనకు కీలకమైన పదవిని కట్టబెట్టారు. కారణమేమిటో సమాధానం చెప్పకుండానే ఆయన, తాను చేసిన పనిని కప్పిపుచ్చుకోవడం కోసం నిప్పులేని పొగను సృష్టించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తన వ్యక్తిగత సిబ్బందిలోని ఒకరి కార్యా లయంపై సీబీఐ దాడి చేయడంతోనే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అకారణమైన ఈ ఆగ్రహాన్ని రంధ్రాన్వేషణగానో. రెచ్చి పోవడంగానో, ఏదో బయట పెట్టడంగానో వర్గీకరించాల్సి ఉంటుంది. రంధ్రా న్వేషణగా అర్థం చేసుకోవడం సులువు. వాస్తవాలన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వక్రీకరణకు పాల్పడటం మాత్రమే మీరు చేయగలిగినది.
ఈ వివాదానికి కేంద్రంగా ఉన్న ప్రభుత్వోద్యోగి రాజేంద్రకుమార్ గత చరిత్ర వివాదాస్పదమైనదని తెలిసీ కేజ్రీవాల్ ఆయనను అధికార స్థానంలో నియమించారు. ఒక నిర్దిష్ట కంపెనీకి కాంట్రాక్టులు లభించేలా కుమార్ తన అధికారాన్ని ఉపయోగిం చినట్లు వెల్లడైంది. ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్’ అనే ప్రజా నిఘా సంస్థ రాజేంద్రకుమార్ విషయమై కేజ్రీవాల్‌ను ముందుగానే హెచ్చరించింది. అయినా ఆయన పట్టించుకోకపోగా, కీలకమైన పదవిని ఆయనకు కట్టిబెట్టారు. అందుకు కారణమేమిటో సమాధానం చెప్పకుండానే ఆయన దాన్ని కప్పి పుచ్చుకోవడం కోసం నిప్పులేని పొగను సృష్టించారు. రాజకీయాల్లో ఇది అతి పాత ఎత్తుగడ. ప్రధాని నరేంద్ర మోదీపై దూషణలతో దాడి చేశారు. అటుమీదట, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై దాడికి దిగారు. అది కూడా ఇప్పటికే అరిగిపోయి, అప్రతిష్టపాలైన ఆరోపణలకు తిరిగి ప్రాణం పోయాలని ప్రయత్నించడం ద్వారా.
అరుణ్ జైట్లీపై ఆరోపణలు రెండేళ్ల క్రితమే తుస్సుమని పోయాయి. యూపీఏ ప్రభుత్వమే ఆయన నిర్దోషని ప్రకటించింది. ‘సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ’ ఆఫీస్‌ను ఆ ఆరోపణలపై దర్యాప్తు చేయమని యూపీఏ ఆదేశించింది. త్వరితంగానే దర్యాప్తును పూర్తి చేయించారు. యూపీఏ హయాంలోనే 2013 మార్చి 21న మోసం జరగలేదని ప్రకటించారు. అక్కడితో ఆ కథ ముగిసిపోయింది. సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో జైట్లీ క్రికెట్ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అవినీతి వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్, ఈ ఆరోపణలను ఎన్నడూ ఒక సమస్యగా చూసింది లేదు.
ఒక ఉన్నత ప్రభుత్వాధికారిని కాపాడటం కోసం కేజ్రీవాల్ ఎందుకిలా బూటకపు తుపాన్‌ను సృష్టించి నట్టు? అధికార యంత్రాగాన్ని తుదికంటా పరిరక్షిం చాలనే భావోద్వేగభరితమైన నిబద్ధత కారణమని అనలేం. రాజేంద్ర కుమార్ ఘటనకు కొద్ది రోజుల ముందే సీబీఐ, మరో ఢిల్లీ ప్రభుత్వాధికారిపై దాడి చేసింది. ఆయన్ను కాపాడటానికి బదులు కేజ్రీవాల్ ఆ ప్రతిష్టలో కాస్త వాటా దక్కించుకోవడం కోసం ఆరాటపడ్డారు. మరి రాజేంద్రకుమార్‌ను కాపాడటం కోసం కేజ్రీవాల్ ఇంత రాజకీయ పెట్టుబడిని పణంగా ఎందుకు పెడుతున్నట్టు? దానికి స్పష్టమైన సమాధానం ఇంకా లభించ లేదు. చాలా ఊహాగానాలున్నాయి. ఉదాహరణకు, ఢిల్లీ శాసనసభ గత ఎన్నికల్లో ఆప్ ఖాతాకు చేరిన అంతుచిక్కని ఆ రెండు కోట్ల రూపాయల చెక్కును చెప్పొచ్చు. ఆమ్‌ఆద్మీ పార్టీకి నైతికంగా జన్మనిచ్చిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మించడంలో కేజ్రీవాల్‌కు సన్నిహిత సహచరులైన శాంతిభూషణ్, ప్రశాంత్‌భూషణ్, యోగేంద్ర యాదవ్‌లు ఆయనతో వేరుపడ్డ విషయం తెలిసిందే. అందుకు కారణం వారాయన ఉద్దేశాలలోని నిజాయితీని శంకించడమే.
కొన్ని సందర్భాల్లో ఒక ఘటనకు సంబంధించిన ఉద్దేశించని పర్యవసానాలు ఒక వ్యక్తి ఆలోచనా క్రమానికి చెందిన ఆసక్తికరమైన కోణాలను బయట పెడతాయి. అధికారం కోసం పోరాటాల్లో శత్రుత్వానికి కొదవేమీ ఉండదు. అలాగే ఆ శత్రుత్వంలో వ్యక్తిగతమైనదీ ఉండదు. పార్లమెంటు వేదికగా ఒకరిని మరొకరు అంతగా రెచ్చగొట్టుకునే ఎంపీలు సెంట్రల్ హాల్లో కలిసినప్పుడు కుబుర్లలోకి దిగిపోతారు. పైగా ప్రజాస్వామిక చర్చలో ఎప్పుడూ సంయమనం ఉంటుంది. దూషణ లక్ష్యాన్ని ఎన్నడూ గాయపరిచేదిగా ఉండదు. ప్రధాని నరేంద్రమోదీపై విషం కక్కడంలో సంయమనాన్ని పూర్తిగా కోల్పోయిన కేజ్రీవాల్‌నే అది చూలకన చేసింది. ప్రజాస్పందన ప్రతికూలంగా ఉన్నదని గ్రహించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడేటప్పుడు... నేను హర్యానాలో ఓ గ్రామంలో పుట్టినవాడిని అంటూ రెండు, మూడు మాటలను తప్పుగా ప్రయోగించారు. ఉద్దేశ పూర్వకంగా పదేపదే చేసిన ఆ వ్యాఖ్య, గ్రామాల పట్ల ఆయనలో అంతర్నిహితమై ఉన్న తృణీకార భావాన్ని వ్యక్తం చేస్తుంది. పక్షపాత పూరితమైన భావాలకు బందీ అయినవారి ఆలోచనా రీతి ఇదే.
భారత ప్రజాస్వామ్యం గురించి మీరు ఏమైనా అనొచ్చుగానీ, అది ఎన్నడూ నీరసమైనది కాదు. అధికారం, సవాళ్లనే ఐదంకాల కథావస్తువులోని రెండంకాలు గడచిపోయేసరికి పాత్రధారులు తమ మౌలిక నిజ స్వభావాన్ని వెల్లడించేవారుగా మారిపోతే, ఆశ్చర్యకరమైన అంశాలు పలురెట్లు పెరుగుతాయి. కేంద్ర రంగస్థలిపై ప్రమాదాలు లేదా తప్పులు చోటుచేసుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. పైగా అది ఏవిధంగానైనా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేది కూడా. అత్యాశను బహిర్గతం చేయాల్సిన అవసరమేమీ లేదు. అదెప్పుడూ తనకు తానే డప్పేసి చాటుకుంటుంది. అత్యాశ, విషాదాంత కథానాయకుని తీవ్ర బలహీనత మాత్రమే కానవసరం లేదు. అది డాన్ క్విక్జోట్‌కు (పనికిరాని కత్తులతో గాలిమరలపై పోరాడేవాడు) సైతం ఆ వ్యాధి సోకవచ్చు.