కేజ్రీవాల్‌కు మరోసారి జరిమానా..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దాఖలుచేసిన రూ.10 కోట్ల పరువు నష్టం దావాకు బదులివ్వనందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సోమవారం మరోసారి ఢిల్లీ హైకోర్టు రూ.5 వేల జరిమానా విధించింది. ఇదే కేసులో జాప్యం చేసినందుకు కోర్టు గత జులై 27న కేజ్రీవాల్‌కు రూ.10వేల జరిమాన విధించిన విషయం తెలిసిందే.
అక్టోబర్ 12లోగా ఆ రూ.10వేలతో పాటు ఇప్పుడు విధించిన రూ.5000 మొత్తాన్ని ఆర్మీసంక్షేమ నిధిలో డిపాజిట్ చేయడంతో పాటు, ఈ కేసులో వివరణ ఇవ్వాలని కోర్టు జాయింట్ రిజిస్ట్రార్ పంకజ్ గుప్తా కేజ్రీవాల్‌కు సూచించారు. గత మే 15,17 తేదిల్లో కేజ్రీవాల్‌తో పాటు ఆయన పార్టీ ఆప్‌కి చెందిన మరో ఐదుగురు నేతలపై జైట్లీ వేసిన మరో పరువు నష్టం కేసు విచారణ సమయంలో కోర్టులోనే కేజ్రీవాల్ లాయర్ రామ్‌జెఠ్మలాని జైట్లీని దూషించడంతో ఆయన మరో పరువు నష్టం దావాను దాఖలు చేశారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 2000 నుంచి 2013 వరకు వ్యవహరించిన జైట్లీ అసోసియేషన్ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలకు పాల్పడ్డారని కేజ్రీవాల్ ఆరోపించడంతో అప్పట్లో ఆయన జైట్లీ కేజ్రీవాల్‌పై తొలి సారి దావా వేసారు.