అక్రమాలను క్రమబద్ధీకరిస్తాం!
బంగారు బల్లిని తాకడం ద్వారా సమస్త బల్లిపాట్లని క్రమబద్ధీకరించారు శాస్త్రకారులు. తుమ్మినప్పుడల్లా ‘చిరంజీవ’ అనుకుంటూ, జీవితాన్ని క్రమబద్ధీకరించుకుంటాం. ఈ స్వైన్‌ఫ్లూ తర్వాత ఒకటికి రెండుసార్లు చిరంజీవ అనుకుంటున్నాం. ఏమైనా ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ జనసామాన్యంలోకి బాగా వెళ్లింది.
ఇదొక మంచి అవకాశం. సరి హద్దులు సరిగా లేవా? అను మతులు అసలే లేవా? నియ మ నిబంధనలను సైడు కాల్వ లో తొక్కారా? ఏమీ పర్వా లేదు. సరిచేస్తాం. క్రమబద్ధీకరి స్తాం. మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెడతాం. మిమ్మల్ని పెద్ద మనుషులం చేస్తాం- ఇటీవల రోజుల్లో రెండు రాష్ట్రాలూ తెలుగులో గోసిస్తున్నాయి. ఇదేమీ మనకి కొత్తకాదు. అప్పుడెప్పుడో చైనా వాళ్లు హద్దుమీరి ముందుకొచ్చేస్తే, చేసేది లేక క్రమబద్ధీకరిం చి, గట్టిగా బుద్ధి చెప్పి పంపేశాం. పండుగలకీ పబ్బాలకీ గజనేరగాళ్ల శిక్షల్ని క్రమబద్ధీకరించి, సత్ప్రవర్తన కోటాలో జైళ్ల నుంచి ఇళ్లకి పంపేస్తూ ఉంటారు. మురిగిపోయిన అప్పుని క్రమబద్ధీకరించడాన్ని ‘‘మారిటోరియం’’ అం టారు. పేరుకుపోయిన నల్లధనాన్ని క్రమబద్ధీకరిస్తే అది ‘‘వాలంట్రీ డిస్‌క్లోజర్’’? అపరాధ కానుకతో నామాల స్వామితో ఏ మొక్కునైనా క్రమబద్ధీకరించుకోవచ్చు. ఇం దిరా ప్రియదర్శినితో పెళ్లి జరిపించడానికి ఖాన్‌జీని క్రమబద్ధీకరించారు కర్మచంద్ గాంధి. శివకేశవులకు భేదం లేదంటూ కొందరు కొన్నింటిని, ఛఛ ఉందంటూ కొందరు నుదుటి గీతల్ని క్రమబద్ధీకరిస్తుంటారు.
లిక్కర్ షాపు వేళల్ని తరచూ క్రమబద్ధీకరిస్తుంటా రు. డోసేజ్‌ని క్రమబద్ధీకరించుకోమని సేవించే వారికి డాక్టర్లు, పోలీసులు సూచిస్తూ ఉంటారు. పిల్లల తయారీ ని ఒక పరిశ్రమ చెయ్యొద్దనీ, క్రమబద్ధీకరించుకోమని హెచ్చరిస్తూ ఉంటారు. చదువుల్లో కూడా క్రమబద్ధీకరణ ఉంది. మా పెద్దన్నయ్య థర్డ్‌ఫారమ్ మూడుసార్లు ఫెయిల్ అయితే క్రమబద్ధీకరించి పైతరగతిలో వేశారు. మూడేళ్ల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ఎనిమిదో క్లాసు ప్రభుత్వ పాఠశాల విద్యార్థితో ఎనిమిది అంకెలు చెప్పించండని లోక్‌సత్తా సవాలు విసిరి, వానా కాలం చదువుల్ని క్రమబద్ధీకరించి నలభై రెండుకి కుదిస్తే - కుర్రాళ్లకి కొంచెం క్రమబద్ధంగా ఉం టుందేమో ఆలోచించాలి.
మొన్నటికి మొన్న నగరంలో మూడంతస్తుల అను మతితో ఆరంతస్తులు కడితే, సర్కారు ‘‘ఆయ్’’ అంటూ కళ్లెర్ర చేస్తే - ‘‘మీరు తప్పులో కాలేశారు. మైనస్ రెండు, మై- ఒకటి, జీరో ఆపైన ఏక్‌దోతీన్ లెఖ్ఖ సరిపోయింది పొమ్మన్నాడా పెద్దమనిషి. అధికారులు నాలిక్కరుచు కుని, మైనస్‌లు జీరోల్ని క్రమబద్ధీకరించి ఇకపై ఈ లెక్క లు సాగవన్నారు. ఆర్నెల్లు తిరక్కుండా ఆరుగదుల పర్మి షన్‌లో పన్నెండు గదులు కట్టాడా పెద్ద మనిషి. ఈసారి సర్కార్ రెచ్చిపోయింది. పడగొట్టాల్సిందేనని యంత్రాం గంతో సహా వెళ్లింది. ఇందులో అక్రమం అణుమాత్రం కూడా లేదు. అసలు ఆరుగదులే, ఆ ఎగస్ట్రా ఆరు వాస్తు కోసం కట్టినవే గాని వాడకానికి కాదు అనే సరికి సర్కా రు ఉలిక్కిపడి, ‘‘అయితే ఓకే!’’ - కరచాలనం చేసి ‘‘వద్దండీ. మళ్లీ ఆరుగదులు వాస్తు కోసం వెయ్యాల్సివ స్తుందని’’ పెద్ద మనిషి బతిమాలుకున్నాడు.
మనకి అన్ని తప్పులకీ ప్రాయశ్చిత్తాలున్నాయి. అసలు పశ్చాత్తాపానికి మించిన విరుగుడు లేదు. ప్రతి నిబంధనకి ఒక సవరింపు ఉంటుందని నానుడి. ఉద్య మాలు సఫలమయ్యాక సమస్త సివిల్ క్రిమినల్ కేసుల్నీ క్రమబద్ధీకరిస్తారు. ఆనాటి అవాంఛనీయ ఘటనలు నేడు మధుర ఘట్టాలవుతాయి. నాటి అల్లరిమూకలే నేటి దేశభక్తులు! జీవితంలోనే కాదు సాహిత్యంలో కూడా క్రమబద్ధీకరణలున్నాయ్. ‘‘పూర్వ కవుల ప్రయో గంబులు యాజ్‌టీజ్‌గా గ్రాహ్యంబులు’’ అనే సూత్రం తో రెగ్యులరైజ్ చేసిపడేశారు. బంగారు బల్లిని తాకడం ద్వారా సమస్త బల్లిపాట్లని క్రమబద్ధీకరించారు శాస్త్రకా రులు. తుమ్మినప్పుడల్లా ‘చిరంజీవ’ అనుకుంటూ, జీవి తాన్ని క్రమబద్ధీకరించుకుంటాం. ఈ స్వైన్‌ఫ్లూ తర్వాత ఒకటికి రెండుసార్లు చిరంజీవ అనుకుంటున్నాం. ఏమైనా ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ జనసామాన్యంలోకి బాగా వెళ్లింది. ఎదురింటాయన వీధి చివర ఎదురు పడితే, ఏమిటి నడుచుకుంటూ వెళుతున్నారని అడిగా. ‘‘తలమాసింది. క్రమబద్ధీకరణకి సెలూన్‌కి పోతున్నా’’ అన్నాడాయన. మొత్తానికి భాష సంపన్నం అవుతోంది.
అక్షర తూణీరం: శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)