అసెంబ్లీ ఫలితాల సందేశమేమిటి? | what is the message of Assembly results | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ఫలితాల సందేశమేమిటి?

Published Sun, Oct 19 2014 12:20 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

అసెంబ్లీ ఫలితాల సందేశమేమిటి? - Sakshi

అసెంబ్లీ ఫలితాల సందేశమేమిటి?

త్రికాలమ్
 
జవహర్‌లాల్ నెహ్రూ వారసురాలుగా ఇందిరాగాంధీ ఎన్ని ఘనవిజయాలు సాధించినప్పటికీ అవి కటిక పేదరికంలో పుట్టి సామాన్య ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా రాజకీయ జీవితం ప్రారంభించి స్వయంకృషితో అనేక అడ్డంకులు దాటుకొని అత్యున్నత స్థాయికి చేరుకున్న మోదీ విజయంతో సమానం కాజాలవు. ప్రతికూల రాజకీయ పరిస్థితులను ఎదుర్కొని ప్రత్యర్థులను మట్టికరిపించడంలో మాత్రం ఇందిరతో మోదీని పోల్చవచ్చు.
 
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజే వెల్లడికానున్నాయి.  ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు భిన్నంగా అసలు ఫలితాలు ఉండే అవకాశాలు బహు తక్కువనే అభిప్రాయంతోనే ఈ వ్యాఖ్యానం. నేటితో ప్రధాని నరేంద్రమోదీ విజయ పరంపర సంపూర్ణం అవుతుంది. సార్వత్రిక ఎన్నికలలో విజయబావుటా ఎగురవేసిన మీదట, ప్రధానిగా 150 రోజుల పాలన తర్వాత, మరి రెండు రాష్ట్రాలను కాంగ్రెస్ నుంచి కైవసం చేసుకున్న అనంతరం మోదీ ప్రతిష్ఠ పతాక స్థాయికి చేరుతుంది. ఇదే గరిష్టం. ఇంతకంటే పైకి పోయే అవకాశం లేదు.  ఈ స్థాయిలో ఎల్లకాలం ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు తగ్గుతుంది. ఎంత త్వరగా తగ్గుతుంనేది మోదీ మనస్తత్వంపైనా, పనితీరుపైనా ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్షం పోరాట పటిమ కూడా మోదీ ప్రభ ఎంతకాలం వెలుగుతుందో నిర్ణయిస్తుంది.

 అనూహ్య పరిస్థితులలో గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా వెళ్ళిన మోదీ కేశూభాయ్ పటేల్ వంటి హేమాహేమీలను ఎదిరించి పార్టీలోనూ, ప్రభుత్వం లోనూ  నిలదొక్కుకోవడమే కాకుండా, మతకలహాలు సృష్టించిన సంక్షోభాన్ని సైతం అధిగమించి  మూడు వరుస విజయాలు సాధించారు. అదే విధంగా మధ్యప్రదేశ్‌లో శివరాజ్ చౌహాన్, ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్ మూడవ పర్యాయం నిరుడు నవంబరులో జరిగిన ఎన్నికలలో తమ పార్టీని గెలిపించుకున్నారు. ఇటువంటి ఘనకీర్తిని ఢిల్లీలో షీలాదీక్షిత్ సొంతం చేసుకున్నారు. మహారాష్ట్రలో సైతం స్వయంకృతాపరాధం వల్ల ఇప్పుడు ఓటమిని చవిచూస్తున్న  కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీల సంకీర్ణం మూడుసార్లు ఎన్నికలలో గెలుపొంది పదిహేను సంవత్సరాలు అప్రతిహతంగా రాజ్యం చేసింది. మోదీ రాజకీయ జీవితంలో  పరాజయం ఇంతవరకూ లేదు. దాని అర్థం ఎప్పటికీ ఓటమి ఉండదని కాదు. మోదీ చాలా తెలివైన, నైపుణ్యం కలిగిన, ధైర్యవంతుడైన సమరయోధుడని గుర్తించాలి. నేలవిడిచి సాము చేయడం అలవాటు లేని మోదీకి క్షేత్రజ్ఞానంతో పాటు శాస్త్రజ్ఞానం కూడా ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కొని ఎన్నికల ప్రచారం నిర్వహించడంలో సిద్ధహస్తుడు. సర్వస్వం వొడ్డి ప్రమాదపుటం చుల్లో ఖడ్గవిన్యాసం చేయగల తెగువ కలవాడు.

సార్వత్రిక ఎన్నికలకు కొన్ని మాసాల ముందు భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా నియుక్తుడైన క్షణం నుంచి మొన్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసే వరకూ మోదీ చెలరేగిపోయిన తీరు స్వతంత్ర భారత చరిత్రలో అపూర్వమైనది. తొలిప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వారసురాలుగా ఇందిరాగాంధీ ఎన్ని ఘనవిజయాలు సాధించినప్పటికీ అవి కటిక పేదరికంలో పుట్టి సామాన్య ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా రాజకీయ జీవితం ప్రారంభించి స్వయంకృషితో అనేక అడ్డంకులు దాటుకొని  అత్యున్నత స్థాయికి చేరుకున్న మోదీ విజయంతో సమానం కాజాలవు. ప్రతికూల రాజకీయ పరిస్థితులను ఎదుర్కొని ప్రత్యర్థులను మట్టికరిపించడంలో మాత్రం ఇందిరతో మోదీని పోల్చవచ్చు. 1960 దశకం ద్వితీయార్థంలో పార్టీలోని అనుభవజ్ఞులైన నాయకుల ఆధిపత్యధోరణికి అడ్డుకట్ట వేయడానికి నాటి ప్రధాని ఇందిర కాంగ్రెస్ పార్టీని చీల్చవలసి వచ్చింది. అంతపని అవసరం లేకుండానే మోదీ పార్టీ వ్యవస్థాపకులైన అడ్వానీ, మురళీమనోహర్ జోషీలను పూర్వపక్షం చేసి పార్టీ పగ్గాలను హస్తం గతం చేసుకున్నారు. తన అనుచరుడు, అమిత విశ్వాసపాత్రుడు అమిత్ షాకి అప్పగించారు. ఇందుకు ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం సహకారం లేకపోలేదు. 2009 నాటి సార్వత్రిక ఎన్నికలలో అడ్వానీ నాయకత్వాన్ని కూడా నాగపూర్ అధిష్ఠానం బలపరిచింది. నాడు అడ్వానీ సాధించలేని విజయాలను నేడు మోదీ నమోదు చేయగలగడానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి, మోదీ వ్యక్తిత్వ ప్రభావం. రెండు, కాంగ్రెస్ అధినేతల మానసిక దౌర్బల్యం.
 మే నెలలో లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు తగిలిన దెబ్బనుంచి ఆ పార్టీ ఇప్పటికీ కోలుకోలేదు. 543 స్థానాలకు ఎన్నికలు జరిగితే 44 స్థానాలు మాత్రమే గెలుచుకున్న జాతీయ పార్టీ దిగ్భ్రాంతికి గురికావడంలో ఆశ్చర్యం లేదు. కానీ నాలుగు మాసాలు గడి చినా కాలూచేయీ కూడదీసుకోలేకపోవడం, పోరాటేచ్ఛ పూర్తిగా నశించడం ఆ పార్టీ కార్యకర్తలను కలవరపరస్తోంది. సార్వత్రిక ఎన్నికలలో గొప్ప విజయం సాధించిన భాజపా అనంతరం 13 రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో దారుణంగా ఓడిపోయింది. కానీ మోదీ గుండెజారలేదు. రె ట్టింపు ఉత్సాహంతో, పట్టుదలతో  ప్రచార సమరం సాగించారు.  ఉప ఎన్నికలలో పరాజయం చెందిన భాజపా బలహీనతను వినియోగించుకోవాలని ప్రయత్నించిన ప్రాంతీయ పార్టీలను తోసిరాజన్నారు. హర్యానాలో బెట్టు చేసిన మిత్రపక్షంతో తెగ తెంపులు చేసుకోవడం ఒక ఎత్తయితే మహారాష్ట్రలో పాతికేళ్లు సహవాసం చేసిన శివసేనతో స్నేహబంధాన్ని తెంచుకోవడం ఒక ఎత్తు. ఇది మోదీ-షా జోడీ రాజకీయ చతురతకూ, సమయజ్ఞతకూ, సాహసానికీ నిదర్శనం.

 వైరిపక్షాల ప్రతీకలనూ, స్ఫూర్తిప్రదాతలను సొంతం చేసుకోవడం మోదీ రాజకీయంలో మరో వినూత్న కోణం. సర్దార్ పటేల్‌ను కాషాయపార్టీ ప్రాతః స్మరణీయుల జాబితాలో చేర్చుకోవడంతో ఆగకుండా మహాత్మాగాంధీనీ, నెహ్రూను కూడా భాజపా శ్రేణులు అరాధించే జాతీయ నాయకుల వరుసలో కలిపేసుకోవడం చిత్రమైన రాజకీయం. ఇందుకు అభ్యంతరం చెప్పే స్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేదు.  ఛత్రపతి శివాజీ వీర మరాఠా వారసత్వాన్ని   భాజపాకే ఆపాదించుకోవడం శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే కుమారుడు ఉద్ధవ్‌ఠాక్రేకి అరికాలి మంటి నెత్తికి తెప్పించింది. భాజపా స్థానిక నాయకులను ఆయన ఆదిల్‌షా సేనాని అఫ్జల్ ఖాన్ బలగంతో పోల్చి కసితీర్చుకున్నారు. అఫ్జల్‌ఖాన్ ను శివాజీ హతమార్చిన విషయం గుర్తు చేశారు. మోదీ, షాలు గుజరాత్ నుంచి మహరాష్ట్రపైన పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారని  మహారాష్ట్ర నవనిర్మాణ సేన నాయకుడు రాజ్‌ఠాక్రే ధ్వజమెత్తారు. 1950లలో జరిగిన సంపూర్ణ మహారాష్ట్ర ఉద్యమాన్ని గుర్తుచేశారు. అప్పుడు ముంబయ్‌ని ప్రత్యేక రాష్ట్రంగా  ఏర్పాటు చేయడానికి గుజరాత్ నాయకులు ప్రయత్నించి విఫలమైన సంగతి జ్ఞాపకం చేశారు. మరాఠీ ఆస్మిత (మరాఠీ ఆత్మగౌరవం)ప్రసక్తి తెచ్చి భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సామ్యం కనిపించింది. లోక్‌సభ ఎన్నికలలో ఈ ధోరణి లేదు. అప్పటికి భాజపా, శివసేన మిత్రపక్షాలు. కాంగ్రెస్, ఎన్‌సీపీ నాయకులు కూడా పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.  ఒకరిని ఒకరు ఓడించుకునేందుకు పన్నాగాలు పన్నారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ యుద్ధరంగంలోకి పూర్తిగా దిగనే లేదు. మాటవరుసకి రెండు బహిరంగ సభలలో పాల్గొని ప్రచారం అయిందనిపించారు. కాంగ్రెస్ అభ్యర్థులు సోనియా సభలు కావాలని కోరుకున్నారు కానీ రాహుల్ కావాలని అడగనే లేదు.

ఇక మీదట రాజకీయ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? కాంగ్రెస్‌కి ముందున్నది గడ్డుకాలం. రాహుల్ నాయత్వంపైన తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉన్నది. పలుకున్న నాయకులు భాజపాలోకో, మరో పార్టీలోకో వలసపోయే ప్రమాదం ఉంది. ఈశాన్య రాష్ట్రాలకూ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకూ పార్టీ పరిమితమైపోయే అవకాశం ఉంది. మహారాష్ట్ర వంటి ఆర్థికసౌష్టవం కలిగిన రాష్ట్రం చేజారిపోతే కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం నడవడానికి అవసరమైన ఇంధనం లభించక పార్టీ నిర్వీర్యమైపోతుంది. ఇటువంటి ప్రమాదాలను అధిగమించగల శక్తి ఇప్పటికీ సోనియాగాంధీకి ఉన్నదని నమ్మేవారు చాలామంది ఉన్నారు. ఇక భాజపా పరిస్థితి వేరు.  మోదీ-షా జంట కత్తికి కొంతకాలంపాటు ఎదురు ఉండదు. మోదీ ప్రభుత్వం విజయాలు సాధిస్తూ ఆర్థిక వృద్ధి రేటు పెంచినంతకాలం, మత సామరస్యానికీ, శాంతిభద్రతలకూ భంగం కలగనంత వరకూ ఎన్‌డీఏ సర్కార్‌కీ, భాజపాకీ ఢోకా ఉండదు. మోదీ ప్రభుత్వానికి వైఫల్యాలు ఎదురైతే ప్రతిపక్షాల ఉత్సాహం పెరుగుతుంది. మోదీ నియంతగా మారితే, దేశప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్వవహరిస్తే 1970 దశకంలో ఇందిరాగాంధీని ఓడించేందుకు ప్రతి పక్షాలన్నీ ఏకమైనట్టే  ఇప్పుడు కూడా మోదీ వ్యతిరేక శక్తులన్నీ ఒక్క తాటిపైకి వస్తాయి. తెలుగు రాష్ట్రాలలో పది వామపక్షాల నాయకులూ ఒక చోట కూర్చొని తమ వైఫల్యాలకు కారణాలు అన్వేషిస్తున్నారు. ఇతరులను అడిగి తెలుసు కుంటున్నారు.  ఇది వామపక్షాల ఐక్యతకు దారి తీస్తుందనడం తొందరపాటు అవుతుంది కానీ మోదీ నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తే మాత్రం ఈ క్రమం వేగవంతం అవుతుంది. ఇతర పక్షాలు కూడా ఈ వేదికపైకి చేరతాయి.  ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిర అంటూ దేవకాంత్ బారువా నినాదం చేసినట్టుగానే మోదీ ఈజ్ భారత్, భారత్ ఈజ్ మోదీ  అనే ధోరణి కనుక ప్రబలితే అంతే స్థాయిలో ఆయనపట్లా, అధికార కూటమి పట్లా వ్యతిరేకత పెరుగుతుంది. హితవు పలకగల వయస్సూ, అనుభవం కలిగిన భాజపా అగ్రనేతలు నోరు మెదపడానికి సంకోచిస్తున్నారు. మోదీలో కొట్టొచ్చినట్టు కనిపించేది ఆత్మవిశ్వాసం. అది హద్దుమీరి అహంకారంగా మారితే అది ఆయనకూ,  అధికార కూటమికీ, దేశానికీ అరిష్టం అవుతుంది. తెలివితేటలు పుష్కలంగా కలిగిన మోదీకి ఈ సూక్ష్మం తెలియదనుకోవడం పొరపాటు. బయటి శత్రువులు ఎవ్వరూ మోదీని తాకగలిగే పరిస్థితులు లేవు. మోదీ బలం ఆయనే. బలహీనతా ఆయనే.      
 
 కె. రామచంద్రమూర్తి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement