కాల్పనికతను విడనాడతారా?
సందర్భం
మోదీ గాలి ఇంకా ఉందనే అనుమానాలు ఏమైనా మిగిలి ఉంటే, వాటిని కూడా బిహార్ తీర్పు చెల్లాచెదురు చేసింది. ఇప్పుడిక ఆయనను అంచనా వేసేది ప్రధానిగా ఆయన ఆచరణను బట్టి మాత్రమే. పరిపాలన, నిజమైన గణాంకాలు, ద్రవ్యోల్బణం, వృద్ధి, ఉద్యోగాలు, సామాజిక ఐక్యత వంటి ఆంశాల ఆధారంగానే ఆయనను అంచనా వేస్తారు.
బిహార్ ఎన్నడూ దేశంలోని ప్రముఖ రాష్ర్టంగా లేదు. కానీ అది దేశ రాజకీయ వాతా వరణ మార్పుల దిశను సూచించే రాష్ట్రంగా ఉంటోం ది. గత యాభై ఏళ్ల రాజకీయ చరిత్రను ఒకసారి పరికించి చూడండి. నేడు బిహార్ ఏమి ఆలోచిస్తుందో, అదే రేపు భారతావని ఆలోచించేది అవుతుందని అర్థమౌతుంది. 1960 దశాబ్ది మధ్య నుంచి కాంగ్రెస్ ఎదురు దెబ్బలు తినడం మొదలైనది బిహార్‌లోనే. దిగువ-మధ్యస్థ కులాల కూటములు పెంపొందడం అక్కడే ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తరించాయి. 1974 నాటి జేపీ ఉద్యమం మొదలుకొని, చివరకు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రముఖ జాతీయస్థాయి నేతగా ఎదిగేవరకూ... జాతీయ రాజకీయాలపై నిర్ణయాత్మక ప్రభావం చూప గలిగిన మార్పులన్నీ అక్కడే సంభవించాయి. తాజా ఎన్నికల ఫలితాలు కూడా వాటితో పోల్చదగినంతటి ప్రాముఖ్యతను కలిగినవి.
స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ వారసత్వంగా అధి కారాన్ని నిరాటంకంగా అనుభవించింది. ప్రత్యర్థులుగా ఉన్న ప్రతిపక్షాలన్నీ ఐక్యం కావడం మొదలు కావడం తోనే దేశ రాజకీయాలు మారిపోయాయి. ప్రతి పరిణా మమూ పెను వేగంగా జరిగిపోతోంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడచిన 18 నెలల కాలం దశా బ్దాలలాగా అనిపిస్తోంది. ప్రతిపక్షాల ఐక్యతా సూచిక శక్తి ఏమిటో బిహార్ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి. ఈ ఫలితాలు రానున్న రాష్ట్రాల ఎన్నికలకు నమూనాగా మారుతాయి. అలా అని అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో ఏమి జరగనున్నదో ఇప్పుడే చెప్పలేం. కానీ కాంగ్రెస్, వామపక్షాలు సహా ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలన్నీ తమ రాజకీయాలను సమీక్షించుకుం టాయి. తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో గణనీయమైన సంఖ్యలో స్థానాలను సాధించాలని ఆశిస్తున్న బీజేపీ తనకున్న అవకాశాలను తిరిగి అంచనా వేసుకోడం అవసరం.
బిహార్, మోదీకి తగిలిన తొలి ఎదురు దెబ్బేమీ కాదు. 2014 మే, ఢిల్లీ ఎన్నికల్లోనే ఆయన ఎదురు దెబ్బ తిన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రత్యేకతనీ, దేశ వ్యాప్తంగా ఆ ఫలితాలు ప్రభావం చూపగలవి కాదనీ అనుకున్నా... బిహార్ ప్రభావం మాత్రం నిజం. కాబట్టి మోదీ రెండు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఒకటి, రాజ్యసభలో అతి త్వరితంగా సంఖ్యాబలాన్ని పెంచేసుకోగలమనే అభూత కాల్పనికత ఇప్పుడు చెదిరిపోయింది. కాబట్టి పరిపాలనకు అనువుగా తాము సర్దుబాటు కావడం ఎలా? అనేది. పార్లమెంటు సజావుగా సాగి, బిల్లులు ఆమోదం పొందగలిగేలా ప్రతి పక్షాలతో ఆచరణాత్మక మైన సంబంధాల సమీకరణాన్ని సాధించడం అవసరం. అందుకు వారితో చర్చలు సాగించడానికి ఆయన ఇప్పటికైనా అంగీకరిస్తారా? అదేమంత తేలిక కాదు. అందుకు ప్రచారం గాడిలోంచి మోదీ పాత తరహా పరిపాలన అనే గాడిలో కుదురు కోవాల్సి ఉంటుంది.
రెండోది, రాజకీయాలకు సంబంధించినది. మోదీ-షా నాయకత్వ నమూనా ఇప్పుడు ప్రశ్నార్థకమైన దిగా మారింది. బిహార్ ఎన్నికల్లో అమిత్ షాకు విపరీత ప్రాధాన్యం ఇవ్వడమే కాదు, పార్టీలో మోదీ తర్వాత ఆయనను రెండో స్థానంలో కూచోపెట్టారు. పార్టీని ఇలా గుజరాతీలు స్వాధీనం చేసుకోవడం అంతర్గత అసంతృప్తిని రాజేసింది. ఇకనైనా ఆయన ప్రతి రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముందు నిలవడం మాని, పూర్తికాలం ప్రధానిగా పనిచేస్తారా? ఎవరినో ఒకర్ని చావబాదినంత మాత్రాన ఓట్లురాలని 2015 భారతంలో ప్రజలను రెండు శిబిరాలుగా చీల్చే రాజకీయాలు గెలుపును సాధించలేవనడానికి ఆయనకు ఇంకా రుజువులు అక్కర్లేదు. షాతో పాటూ ఆయన కూడా బిహారీ మనసును అర్థం చేసుకోలేకపోయారు. రాజకీయ వివేక శూన్యులై, అవమానకరంగా వారు సాగించిన ఎన్నికల ప్రచారం ఇటీవలి కాలం ఎన్నడూ ఎరుగనిది. వారీ దాష్టీకాన్ని దేశంలో మరెక్కడా ప్రదర్శించకుండా ఉంటారని ఆశిద్దాం.
ఈ రెండో నిర్ణయం పూర్తిగా మోదీదే. దాని పర్యవసానాలు ఆయన పార్టీ సహచరుల మీద బలంగా ఉంటాయి. నిష్పాక్షికంగా నిజంగానే దేశానికి ఏమి అవసరం అనే ది ముందుగా నిర్ణయించుకోవాలి. మోదీ తిరిగి మరింత చిత్తశుద్ధితో తన దృష్టిని పరిపాలనపైనే కేంద్రీకరిస్తే అద్భుతంగా ఉంటుంది. క్లుప్తంగా చెప్పా లంటే, ఈ ఎదురుదెబ్బయినా ఆయనను మరింత ఎక్కువ ప్రధాన మంత్రి వ్యవహార శైలిని అలవరుచుకు నేలా ఒప్పించగలిగితే ఈ ఓటమి ఆయనకు నిజంగానే మేలవుతుంది. ఇప్పుడాయన ప్రతిపక్షాల అగ్రనేతలను కలుసుకుని, పార్లమెంటరీ వాతావరణాన్ని మెరుగు పరచి, పరిపాలన కు నిజమైన ఊపును ఇవ్వడానికి కృషి చేయాలి. విభజించే రాజకీయాలు, అసహనాలకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడాలి, దుర్భాషాభరితమైన సోషల్ మీడియా సేనలకు దూరంగా ఉండాలి. తన ప్రభుత్వం ప్రతికూలాత్మక ధోరణిగలదని పేరు తెచ్చే బాధ్యతారహితమైన, దురభిమాన పార్టీ సహచరులను, వ్యక్తులను, భజనపరులను దూరంగా ఉంచాలి.
2014 నాటి మోదీ విజయానికి ప్రాతిపదిక ఒక వాగ్దానం మాత్రమే. ఆ చెక్కును అప్పుడే నగదుగా మార్చేసుకున్నారు. ఇప్పుడిక ఆయనను అంచనా వేసేది ప్రధానిగా ఆయన ఆచరణను బట్టి మాత్రమే. ఆయన ఉపన్యాస ఝరి ఎంత గొప్పదైనా, ఎన్‌ఆర్‌ఐలను మైమరిపింప జేసేదైనా... పరిపాలన, నిజమైన గణాం కాలు, ద్రవ్యోల్బణం, వృద్ధి, ఉద్యోగాలు, సామాజిక ఐక్యత వంటి ఆంశాల ఆధారంగానే ఆయనను అంచనా వేస్తారు. మోదీ ఎన్నికల జైత్రయాత్రకు బిహార్ ముగింపు పలికింది. ఈ వాస్తవాన్ని అంగీకరించగల నమ్రత ఆయనకు ఉంటే మాత్రమే ప్రధాన మంత్రి కావడం ఆయన పాలిటి అత్యుత్తమమైన పరిణామంగా నిలుస్తుంది.
- శేఖర్ గుప్తా
twitter@shekargupta