స్పందన
ఒకరి కాళ్ల కింద చమురు వుంది, మరొకరి పరిసరాల్లో ఖనిజాలున్నాయి. ప్రపంచ మార్కెట్ అధిపతులకు ఇవి రెండూ కావాలి.
ప్రపంచ పరిణామాల్ని గమనించే వారికెవరికయినా సులువుగా అర్థం అయ్యే విషయం ఏమంటే ఇప్పుడు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న ప్రజాసమూహాలు ముస్లింలు, ఆదివాసులు అని. ఒకరి కాళ్ల కింద చమురు వుంది, మరొకరి పరిసరాల్లో ఖనిజాలున్నాయి. ప్రపంచ మార్కెట్ అధిపతులకు ఇవి రెండూ కావాలి. వాటిని దక్కించుకోవాలంటే ముస్లింలు, ఆదివాసుల్ని వాళ్ల స్థానాల నుండి తొలగించాలి. అలా చేయాలంటే చంపదలిచిన కుక్కను పిచ్చిదని ప్రచారం చేయాలి. ఈ పరిణామాలన్నింటినీ ఇప్పుడు మనం నిత్యం డిజిటల్ డిస్‌ప్లేలో చూస్తూనేవున్నాం. ఇంకా అనుమానం వున్నవాళ్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఉపన్యాసాలు విని నిర్ధారణ చేసుకోవచ్చు.
ముస్లిం సమాజానికి బాహ్యాత్మక ముప్పు ముంచుకు వస్తున్నదని ప్రపంచం గుర్తించినప్పుడల్లా స్కైబాబ ఒక కొత్త ఆరోపణతో ముందుకు వస్తుంటారు. ముస్లిం సమాజానికి వచ్చిన ముప్పు అంతర్గతమైనది అనేది వారి ఆరోపణల సారాంశం. భారత ముస్లిం సమాజపు వెనుకబాటుతనానికి కారణాలు వాళ్లు అనుసరిస్తున్న ఆచారాల్లోనే అంతర్గతంగా వున్నాయని తాము రాసినప్పుడు ముస్లిమేతర మిత్రులు కొందరు తమను సంఘసంస్కర్తగా పొగిడేవారు అనే అర్థం వచ్చేలా కొన్నేళ్ల క్రితం ఆయనే ఒక వ్యాసంలో రాసుకున్నారు. బహుశా బయటివాళ్ల పొగడ్తలు కోరుకున్నప్పుడల్లా స్కైబాబ ఇలా ‘అంతర్గత ముప్పు’ సిద్ధాంతాన్ని బయటకు తెస్తుంటారని మనం అర్థం చేసుకోవచ్చు (సాక్షి సాహిత్యం, 18 జూలై 2016).
అస్తిత్వవాద ఉద్యమాలకు ప్రాణప్రదమైనవి రాజకీయార్థిక అంశాలు. స్కైబాబ వ్యాసంలో వీటి ప్రస్తావనే లేదు. భారత ముస్లిం సమాజానికి బయటి నుండి ముంచుకు వస్తున్న ఉపద్రవాన్ని వారు తెలివిగా కప్పిపుచ్చేశారు. అంతేకాక, వ్యాసంలో ‘బయటి నుండి’, ‘బాహ్యాత్మక’ వంటి పదాలు కనిపించకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఆయన వాదానికీ ముస్లిం అస్తిత్వవాదానికీ సంబంధమే లేదు.
ముస్లిం సామాజిక సముదాయంలో అందరూ ఒకే స్థాయిలో మతాచారాల్ని ఆచరించరు. వాళ్లలో మతాన్ని నిష్టగా పట్టించుకునేవారు, అతిగా పట్టించుకునేవారు, అప్పుడప్పుడు మాత్రమే పట్టించుకునేవారు, అస్సలు పట్టించుకోనివారు, మతాతీతంగా వ్యవహరించేవాళ్లు వుంటారు. అయితే, బయటి నుండి ముప్పు పెరిగినపుడు సహజంగానే మొత్తం భారత ముస్లిం సమాజం అప్రమత్తమై ప్రత్యర్థి వర్గాన్ని నిలువరించే పనిలో నిమగ్నమై పోతుంది. అంతా సవ్యంగావున్న కాలంలోకంటే ఆపద ముంచుకొచ్చిన కాలంలోనే ఈ సంఘీభావం స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇతర మత సమూహాల్లోని ఉదారవాదులు సహితం ముస్లిం సామాజిక సముదాయం మీద సానుభూతిని ప్రకటిస్తుంటారు. మతవ్యతిరేకులు కూడా కొందరు వుంటారుగానీ వాళ్లకూ మత సముదాయపు అస్తిత్వ ఉద్యమానికీ సంబంధం ఉండదు.
గతేడాది చివర్లో దేశమంతటా చెలరేగిన అసహన వాతావరణాన్ని మనం ఇంకా మరిచిపోలేదు. ఆ వాతావరణాన్ని ఎవరు ఏ ప్రయోజనాల్ని ఆశించి సృష్టించారో కూడా మనకు తెలుసు. ఈ రోజు సాక్షాత్తూ భారత ప్రధాని ‘భారత సమాజాన్ని అన్ని రకాలుగా చీల్చాలనుకుంటున్న కొందరు గోసేవకుల పేరుతో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే దుకాణాలు తెరిచారు’ అనాల్సివచ్చిందంటే భారత ముస్లిం సమాజం, దానికి సంఘీభావాన్ని ప్రకటిస్తున్న ఇతర ప్రజా సమూహాలూ, మరీ ముఖ్యంగా దళితులూ సమష్టిగా ఏ స్థాయిలో పాలకవర్గాల్ని నిలువరించాయో అర్థం చేసుకోవచ్చు.
భారత ముస్లిం సమాజం రాజకీయార్థిక లక్ష్యాల సాధన కోసం బాహ్యాత్మక పోరాటం సాగిస్తున్న సమయంలో స్కైబాబ ధార్మిక, సాంస్కృతిక అంశాలు చర్చకు తెచ్చారు. పైగా అవి అంతర్గత ముప్పు అంటూ ఇంటాబయటా గందరగోళాన్ని సృష్టించారు. బయటి ముప్పును ఎదుర్కోవడానికి స్వీయసమాజం చేస్తున్న ప్రయత్నాలని వారి రచనలు నిస్సందేహంగా దెబ్బ తీస్తాయి.
–డానీ
9010757776