కన్నకొడుకును అమ్మిన కసాయి తండ్రిని స్తంభానికి కట్టి కొట్టిన అత్తింటివారు.. కన్నతండ్రి అమ్మేసిన శిశువు
సాక్షి, భువనేశ్వర్ : ఏడు నెలల కన్నబిడ్డను ఓ తాగుబోతు తండ్రి రూ.10 వేలకు పరాయివారికి అమ్మేశాడు. ఈ విషాదకర సంఘటన నవరంగపూర్ జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ ఉదంతం నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ సమితి పూజారిగుడ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సంగ్రామ లోహర అనే వ్యక్తి తన కన్నబిడ్డను రూ.10 వేలకు అమ్మివేశాడని ఉమ్మరకోట్ పోలీస్‌స్టేషన్‌లో సంగ్రామ లోహర భార్య ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. వివరాలిలా ఉన్నాయి. పూజారిగుడ గ్రామానికి చెందిన సంగ్రామ లోహర, భార్య సునాబరీ లోహరలు భార్యాభర్తలు. వారికి ఏకైక మగబిడ్డ జన్మించాడు. ఆ దంపతులు ఈ నెల 8 వ తేదీన ఉమ్మరకోట్‌లో గల దేవి పెండ్రానీ మాత గుడికి పూజ చేసేందుకు బిడ్డతో సహా వెళ్లారు. కుమారుడిని భర్తకు ఇచ్చి పూజా సామగ్రి కొనేందుకు భార్య బయటకు వెళ్లింది. ఈ క్రమంలో అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న రమేష్ పట్నాయక్ మరి కొంతమంది ముందుగా కుదుర్చుకున్న బేరం మేరకు సంగ్రామ లోహరకు డబ్బు ఇచ్చి బిడ్డను తీసుకున్నారు.
కొంతసేపటికి వచ్చిన బిడ్డ తల్లి తన కన్న బిడ్డ ఏడి అని అడగ్గా బిడ్డను అమ్మి వేశానని భర్త చెప్పడంతో గొడవ చేసింది. తన బిడ్డను తనకు ఇవ్వాలంటూ నిలదీసింది. అయితే బిడ్డ చేతిలో పడగానే బిడ్డను కొన్నవారు బిడ్డను తీసుకుని వెళ్లిపోయారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని భార్యను భర్త హెచ్చరించాడు. అనంతరం వారు ఝోరిగాం సమితిలోని భిక్షా గ్రామ పంచాయతీ డెంగాగుడ గ్రామంలో ఉన్న సునాబరి కన్నవారింటికి వెళ్లారు. ఇంటికి వచ్చిన కుమార్తె, అల్లుడిని చూచి ఆనందించిన వారు మనుమడు ఎక్కడ అని అడిగారు. అందుకు అల్లుడు తన కుమారుడు ప్రమాదంలో మరణించాడని అత్త మామలతో చెప్పాడు. తాగుబోతు అల్లుడు చెప్పిన మాటలు వారు నమ్మకుండా కుమార్తె సనాబరిని నిలదీయడంతో జరిగిన విషయం ఆమె తెలిపింది. తన కుమారుడిని భర్త రూ.10 వేలకు అమ్మివేశాడని తెలపగానే వారు ఆశ్చర్యపోయారు.
విచారణ చేస్తున్న పోలీసులు
అల్లుడు చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అల్లుడిని పట్టుకుని కొట్టి స్తంభానికి కట్టివేశారు. అనంతరం భార్య ఈ విషయమై ఉమ్మరకోట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గ్రామనికి వచ్చి స్తంభానికి కట్టేసి కొడుతున్న సంగ్రామ్‌ను విడిపించి స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేయగా తానే తన బిడ్డను అమ్మేశానని అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment