ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడిన కేదార్‌నాథ్ ఆలయంలో తిరిగి పూజలు ప్రారంభం అయ్యాయి.
ఉత్తరాఖండ్‌లో సంభవించిన భారీ వరదలు ప్రఖ్యాత శైవక్షేత్రాన్నిఅతలాకుతలం చేయడమేగాక, వందలాది భక్తులు, స్థానికులను బలిగొన్న విషయం తెలిసిందే.
ఈక్రమంలోనే పూజాధికాలకు దూరమైన కేదార్‌నాథ్‌లో మళ్లీ 86 రోజుల తర్వాత బుధవారం నుంచి ప్రార్థనలు మొదలయ్యాయి.
పవిత్ర, పాపపరిహార కార్యక్రమాల అనంతరం పూజారులు, ఆలయ కమిటీ అధికారులతో కూడిన 24మంది సభ్యుల బృందం
సమక్షంలో ప్రార్థనలు పునరుద్దరణ జరిగాయి.
కాగా కేదార్‌నాథ్ ఆలయ పూజలకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ తన కేబినెట్ సహచరులతో హాజరయ్యేందుకు బయల్దేరినా వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో డెహ్రాడూన్లోనే నిలిచిపోవల్సి వచ్చింది.
కాగా ఆలయంలో చాలారోజులు తర్వాత జరుగుతున్న నేపథ్యంలోనే ఈ ప్రార్థనలు జరుగుతున్నాయే తప్ప భక్తులు సందర్శించే స్థాయి పూజలు ఇవి కావని, వరదల ధాటికి పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు బాగుపరచాల్సి ఉందని అధికారులు తెలిపారు.