సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ విజయశాంతి
సాక్షి, కొండాపూర్(సంగారెడ్డి): రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరచిన మెదక్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని, రాహుల్ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి అన్నారు. మండల పరిధిలోని మల్కాపూర్ చౌరస్తాలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో మంగళవారం సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన విజయశాంతి మాట్లాడుతూ దేశంలో నేడు జరుగుతున్న ఎన్నికలు, న్యాయానికి, అన్యాయానికి మధ్య అని, ప్రజలు ఎప్పుడూ న్యాయం వైపే వుంటారని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని యువత మొత్తం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చూస్తోందన్నారు.
దేశంలోని ప్రతీ నిరుపేదను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంగా ప్రతి ఇంటికి సంవత్సరానికి 72 వేల రూపాయలను తమ ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించడం శుభపరిణామమన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రూ.2 వేలు కావాలో, రాహుల్ గాంధీ ఇవ్వనున్న రూ.6 వేలు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని తెలిపారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేడీ ఇద్దరూ ఒకటేనని, ఇద్దరూ ప్రజలను మోసం చేసి ఆచరణకు సాధ్యం కాని హామీలను ప్రకటిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీతో కలిసి కేసీఆర్ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని చూస్తున్నారని, 125 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడం ఎవరి వల్లా కాదన్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి గత ఐదేళ్లలో ఎన్నడూ ప్రజలను కలువలేదని, మళ్లీ ఏం ముఖం పెట్టుకుని వస్తున్నాడని ప్రశ్నించారు. అతనికి తగిన గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు సూచించారు.
ఈవీఎంలలో మోసాల వల్లే టీఆర్‌ఎస్ గెలిచింది
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో టీఆర్‌ఎస్ పార్టీ ఈవీఎంలను ట్యాంపరింగ్, రిగ్గింగ్ చేయడం వల్లే గెలిచిందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ జెట్టి కుసుమకుమార్ ఆరోపించారు. ప్రతి గ్రామంలో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా టీఆర్‌ఎస్ పార్టీ ఎలా గెలిచిందో అర్థం కావడం లేదన్నారు. త్వరలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తరువాత అన్ని లెక్కలు తేలుస్తామని తెలిపారు. ఇటీవలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి గెలుపే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందనడానికి నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో మీరు, మీ కుటుంబ సభ్యులు అంతా మంత్రి పదవులు అనుభవిస్తున్నారంటే అది సోనియాగాంధీ దయ వల్లనే అని, గతాన్ని మరిచి ఇప్పుడు సోనియా గాంధీపై విమర్శలు చేయడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
పరిపాలనలో టీఆర్‌ఎస్ విఫలం
ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున జులై తరువాత కేసీఆర్ పరిపాలన ఏంటో తెలుస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. జులై తరువాత నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కేటాయింపులు ఏవిధంగా వుంటాయో అనే విషయంపై స్పష్టత వచ్చిన తరువాత మాట్లాడుతానని తెలిపారు. సింగూర్, మంజీరా నది నుండి నీటి తరలింపులు ఆపాలని కోరిన అప్పటి మంత్రి హరీష్‌రావు అన్యాయంగా నీటిని తరలించుకుపోయాడని, దీంతో సంగారెడ్డి జిల్లాలో గ్రౌండ్ వాటర్ తగ్గిపోయిందన్నారు. తాగు నీరు లేక ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో ప్రజల దాహార్తిని తీర్చేందకు బోర్లు వేద్దామన్నా చుక్క నీరు రాని పరిస్థితి వుందన్నారు. మిషన్ భగీరథ పనులు కొనసాగడం లేదు, రాష్ట్రంలో నిధులు కూడా లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. నవంబర్ తరువాత సంగారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు పర్యటించి నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటానని, గ్రామాభివృద్దికి కావాల్సిన నిధులు, అభివృద్ది పనులపై చర్చిస్తానని తెలిపారు.
సీఎం కేసీఆర్ అల్లుడిగా మాత్రమే హరీష్‌రావు ప్రజలందరికీ తెలుసునని, త్వరలో నా సత్తా ఎంటో హరీష్‌రావుకు చూపిస్తానన్నారు. తనపై విమర్శలు చేస్తే సహించేది లేదని, కార్యకర్తలు అధైర్య పడవద్దని, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో నా కోసం కష్టపడినట్లుగానే ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కు సైతం నియోజకవర్గంలో 80 వేల ఓట్లు వచ్చేలా కష్టపడాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తోపాజి అనంత్‌కిషన్, షేక్ సాబేర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగేష్, రాంరెడ్డి, ప్రభు, పాండురంగం, రామకృష్ణారెడ్డి, డేవిడ్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటేశం గౌడ్, సర్పంచ్ వనపర్తి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment