న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. రేపు ఏడో దశ ఎన్నికల పోలింగ్‌తో ఓట్ల పండుగ సమాప్తం కానుంది. మరో మూడు రోజులు ఎదురు చూస్తే.. మే 23న రాజు ఎవరో బంటు ఎవరో తేలిపోతుంది. ఈ నేపథ్యంలో ఈ సారి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన మహిళా అభ్యర్థులు కేవలం 724 మంది మాత్రమే. చిన్న రాజకీయ పార్టీలు మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించగా.. జాతీయ పార్టీలు మాత్రం ఈ విషయంలో చాలా వెనకబడ్డాయి.
బరిలో నిలిచిన మహిళా అభ్యర్థులు అఫిడవిట్లలో వెల్లడించిన వివరాలను విశ్లేషించిన నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ సంస్థలు అభ్యర్థుల నేర చరిత్ర, విద్య, ఆర్థిక అంశాల గురించి సంయుక్తంగా ఓ రిపోర్డును విడుదల చేశాయి. మొత్తం 724 మంది బరిలో నిలవగా.. 716 మంది అఫిడవిట్లును పరిశీలించిన మీదట ఈ రిపోర్టును విడుదల చేసినట్లు సదరు సంస్థలు వెల్లడించాయి. వివరాలు సరిగా లేనందువల్ల మిగతా ఎనిమిది మంది అఫిడవిట్లను పరిశీలించలేదని పేర్కొన్నాయి. రిపోర్టులోని వివరాలు..
నేర చరితులు..
మొత్తం 724 మంది మహిళలు బరిలో నిలవగా.. వీరిలో 110 మంది మీద క్రిమినల్ కేసులుండగా.. వీరిలో 78 మంది సీరియస్ క్రిమినల్ కేసులున్నట్లు సదరు రిపోర్టు వెల్లడించింది. ఇక పార్టీలపరంగా నేరచరితుల వివరాలు.. కాంగ్రెస్ పార్టీ నుంచి 54 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలవగా.. వారిలో 14 మంది మీద కేసులుండగా.. 10 మీద సీరియస్ క్రిమినల్ కేసులున్నట్లు తెలిపింది. ఇక అధికార బీజేపీ నుంచి 53 మంది పోటీ చేయగా.. 18 మంది క్రిమినల్ కేసులుండగా.. 10 మంది మీద తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి.
బీఎస్పీ నుంచి 24 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇద్దరి మీద, తృణమూల్ నుంచి 23 మంది పోటీ చేయగా.. ఆరుగురు నేర చరితులుండగా.. వారిలో నలుగురి మీద తీవ్ర క్రిమినల్ కేసులున్నట్లు తెలిసింది. ఇక 222 మంది స్వతంత్య్ర అభ్యర్థులు బరిలో నిలవగా.. వీరిలో అత్యల్పంగా కేవలం 22 మంది నేర చరితులుండగా.. 21 మంది మీద తీవ్ర నేరారోపణలు ఉండటం గమనార్హం.
ఆర్థిక నేపథ్యం..
ఈ 716 మందిలో 255 మంది కోటీశ్వరులే కావడం విశేషం. అభ్యర్థుల సగటు ఆస్తి రూ.5.63 కోట్లుగా ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో మథుర నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్న హేమమాలిని రూ.250 కోట్ల ఆస్తులతో కోటీశ్వరులైన మహిళా అభ్యర్థుల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించారు. రూ.220 కోట్ల ఆస్తులతో ఆంధ్రప్రదేశ్‌లోని రాజంపేట టీడీపీ అభ్యర్థి డీఏ సత్యప్రభ రెండో స్థానంలో ఉండగా.. శిరోమణి అకాళీ దళ్ పార్టీ తరఫున పంజాబ్ బఠిండ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రూ. 217 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. ఎనిమిది మంది మాత్రం తమ పేరిట అసలు ఆస్తులు లేవని వెల్లడించారు.
విద్యావంతులు..
ఇక 724 మందిలో 232 మంది అభ్యర్థుల విద్యార్హత ఐదు నుంచి ఇంటర్ లోపే. 396 మంది డిగ్రీ ఉత్తీర్ణులయినట్లు వెల్లడించగా.. 37 మంది అక్షరాస్యులు(రాయడం, చదవడం వరకే పరిమితం) కాగా 26 మంది నిరాక్షరాస్యులుగా ప్రకటించుకున్నారు. ఇక పోటీ చేసిన వారిలో 25 - 50 ఏళ్ల వయసు వారు 531 మంది ఉండగా.. 50 - 81 ఏళ్ల లోపు వారు 180 మంది కాగా.. ఒక్కరు మాత్రం తన వయసు 80 ఏళ్ల కన్నా ఎక్కువే అన్నారు. మరో ముగ్గురు అభ్యర్థులు తమ వయసు వివారాలు వెల్లడించకపోగా.. ఒక అభ్యర్థి తన వయసు 25 కంటే తక్కువగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment