మోదీ శకంలో దూసుకొచ్చిన కొత్త తారలు! | 5 politicians blossomed in 2017 | Sakshi
Sakshi News home page

2017 రౌండప్‌: రాజకీయ యవనికపై వెలిగిన వ్యక్తులు

Published Thu, Dec 21 2017 6:09 PM | Last Updated on Thu, Dec 21 2017 7:30 PM

5 politicians blossomed in 2017 - Sakshi

2017... భారత రాజకీయ చరిత్రను కొత్త మలుపు తిప్పింది. భవిష్యత్‌ నాయకులుగా గుర్తింపు పొందుతున్న వారంతా ఈ ఏడాది వెలుగులోకి వచ్చారు. మోదీ శకం దేదీప్యమానంగా సాగుతున్న సమయంలో.. కొత్త తారలు ఆవిర్భవించడం విశేషమే.

ఈ ఏడాది భారత రాజకీయ యవనికపై కొత్త ముఖాలు ఆవిష్కృతమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీని ఢీ కొట్టే సత్తా ఉన్న నేతలెవరూ లేరా? అని అనుకుంటున్న తరుణంలో.. గుజరాత్‌ యువకులు ఆశాదీపంలా కనిపించారు. గుజరాత్‌ అంటే నాదే అని జబ్బలు చరుచుకునే మోదీకే ముగ్గురు ముప్పయి చెరువుల నీళ్లు తాగించారు. మోదీకి మొదటి అపజయ భయాన్ని కల్గించారు. ఇక దశాబ్దకాలంగా రాజకీయాల్లో ఉన్నా.. శతాబ్దాల కాంగ్రెస్‌ పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉన్నా గుర్తింపు రానీ రాహుల్‌ గాంధీకి ఈ ఏడు బాగా కలిసి వచ్చింది. మిణుకుమిణుకు మంటున్న కాంగ్రెస్‌ పార్టీకి రాహుల్‌ గాంధీ తిరిగి వెలుగులు తీసుకురాగలడనే నమ్మకం ఇప్పుడే మొదలయింది. అలాగే ఉత్తర ప్రదేశ్‌లో రెండు దశాబ్దల కిందట అధికారానికి దూరమయిన భారతీయ జనతాపార్టీకి యోగి ఆదిత్యనాథ్‌ రూపంలో కొత్త శక్తి లభించింది. 

హార్ధిక్‌ పటేల్‌
పటేదార్‌ రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని మొదలు పెట్టిన హార్ధిక్‌ పటేల్‌.. రేపటి తరం రాజకీయ ప్రతినిధిగా గుజరాత్‌లో స్థానం సంపాదించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో నామినేషన్‌ వేసేందుకు కూడా సరిపోయేంత వయసులేని హార్ధిక్‌... ప్రధాని నరేంద్ర మోదీని ముప్పతిప్పలు పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీతో జట్టు కట్టి.. బీజేపీని ఓటమి అంచులవరకూ తీసుకు వచ్చారు. సౌరాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీకి భారీగా సీట్లు వచ్చాయంటే అది హార్ధిక్‌ పటేల్‌ సత్తానే అని చెప్పాలి. 

జిగ్నేష్‌ మేవాని 
సామాజిక వేత్తగా, న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్న జిగ్నేష్‌ మేవానీ.. 2017 గుజరాత్‌ ఎన్నికల్లో రాజకీయ నేతగా మారారు. ప్రధానంగా దళిత నేతగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని జిగ్నేష్ చేసిన విమర్శలు.. ప్రజల ఆలోచనా సరళిలో మార్పు తెచ్చిందని చెప్పుకుంటారు. కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ జిగ్నేష్‌.. వడ్గావ్‌ నియోజక వర్గం నుంచి 19 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. భవిష్యత్‌ గుజరాత్‌ నేతగా ఇప్పటికే ప్రజలు భావిస్తున్నారు. 

అల్ఫేష్‌ ఠాకూర్‌ 
గుజరాత్‌లో ఓబీసీ నేతగా అల్ఫేష్‌ ఠాకూర్‌.. ఎదిగారు. ఈ ఏడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో.. బీజేపీని, ప్రధాని మోదీ, అమిత్‌ షాల లక్ష్యంగా అల్ఫేష్‌ విమర్శల వర్షం కురిపించారు. గుజరాత్‌ క్షత్రియ ఠాకూర్‌ సేన పేరుతో.. ఆల్ఫేష్‌ ఠాకూర్‌ బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమాలు చేశారు. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన ఎన్నికల్లో.. అల్ఫేష్‌ ఠాకూర్.. బీజేపీ అభ్యర్థిపై 10 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. 

యోగి ఆదిత్యనాథ్‌
యోగి ఆదిత్యానాథ్‌.. మొన్నటి వరకూ గోరఖ్‌పూర్‌ మఠాధిపతిగా, గోరఖ్‌పూర్‌ లోక్‌సభ సభ్యుడిగానే అందరికీ తెలుసు. ఈ ఏడాది యూపీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో.. యోగి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అతివాద హిందూ నేతగా ఆదిత్యనాథ్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇప్పటికే నరేంద్ర మోదీ తరువాత భారత ప్రధాని అయ్యేది యోగి ఆదిత్యనాథ్‌ అని బీజేపీలో ఒక వర్గం ప్రచారం సైతం చేస్తోంది. 

రాహుల్‌ గాంధీ
రాజకీయాల్లోకి 2004లోనే రాహుల్‌ గాంధీ ప్రవేశించినా తిరుగులేని గుర్తింపు మాత్రం ఈ ఏడాదే వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ ఈ మధ్యే బాధ్యతలు తీసుకున్నారు. వారసత్వంగా పార్టీ అధ్యక్షుడు అయ్యాడన్న వాదనలు ఉన్న సమయంలో గుజరాత్‌ ఎన్నికల్లో రాహుల్‌ తొలిసారి తన సత్తాను చాటారు. కూటమి కట్టడంలోనూ, అందరినీ కలుపుకుపోవడంలోనూ, మోదీపై విమర్శలు చేయడంలోనూ రాహుల్‌ పరిణతి ప్రదర్శించారు. ‘నీచ్‌’ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌పై వేగంగా చర్యలు తీసుకుని.. తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement