
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం 117 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో రాత్రి 8 గంటల వరకు 65.61% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం (ఈసీ)తెలిపింది. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ మినహాయిస్తే మూడు దశల్లో ఇప్పటి వరకు 302 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగినట్లయింది. రెండో విడతలో వాయిదా పడిన త్రిపుర (తూర్పు) నియోజకవర్గం పోలింగ్ కూడా మంగళవారం జరిగింది. మూడో విడతతో దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలతోపాటు ఉత్తరాదిన గుజరాత్‌లో పోలింగ్ ముగిసినట్లయింది.
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్‌లో 79.77శాతం పోలింగ్ నమోదైంది. ఈ విడతలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ఎస్‌సీపీ అధినేత శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలే, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, లోక్‌తాంత్రిక్ జనతా దళ్ చీఫ్ శరద్ యాదవ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పశ్చిమబెంగాల్, కశ్మీర్‌లో జరిగిన ఎన్నికల హింసలో ఇద్దరు చనిపోయారు. ఈ విడతలో 2.81 లక్షల బ్యాలెట్ యూనిట్లను వినియోగించగా, వివిధ లోపాలు తలెత్తడంతో 1593 యూనిట్లను మార్చామని ఈసీ తెలిపింది. ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరిగాయి.
అనంత్‌నాగ్‌లో అత్యల్పం..
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికలో అత్యల్పంగా 13.61% (2014లో 39.37%) ఓటింగ్ నమోదైంది. ఈ స్థానానికి మూడు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మంగళవారం పోలింగ్ విధులు ముగించుకుని వస్తున్న ఐటీబీపీ జవాన్ల వాహనంపై కోకర్‌నాగ్ ప్రాంతంలో అల్లరి మూక రాళ్లు రువ్వగా అది బోల్తా పడటంతో ఆ వాహనం డ్రైవర్ చనిపోయారు.
బెంగాల్, యూపీల్లో..
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ నియోజకవర్గం భగ్వాన్‌గోలా సమీపంలోని బలిగ్రామ్‌లో ఓటేయడానికి వెళ్లిన తియారుల్ షేక్ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. తమ కార్యకర్త తియారుల్‌ను టీఎంసీ వాళ్లే చంపారని ముర్షిదాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని అబు హెనా ఆరోపించారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఈసీ ఆదేశించింది. బాలుర్ఘాట్ నియోజకవర్గంలో ఓ పోలింగ్ బూత్ బయట రెండు వర్గాల వారు పరస్పరం బాంబులు విసురుకున్నారు. జంగిపూర్‌లో గుంపును చెదరగొట్టేందుకు సీఆర్‌పీఎఫ్ బలగాలు లాఠీచార్జి చేశాయి. త్రిపురలో పోలింగ్ బూత్ ఏజెంట్లు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి అనుకూలంగా ఓట్లేయిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈటాలోని ప్రిసైడింగ్ అధికారిని విధుల నుంచి తప్పించారు.
పోలింగ్ శాతాలిలా..
గుజరాత్ (26)లో 63.67% పోలింగ్ నమోదైంది. యూపీ(10)లో 61.35%, కేరళ(20)లో 76.82%, కర్ణాటక(14)లో 67.56%, మహారాష్ట్ర(14)లో 57.01%, గోవా(2)లో 73.23%, ఛత్తీస్‌గఢ్(7)లో 64.68%, పశ్చిమబెంగాల్(5)లో 79.67%, ఒడిశా(6)లో 61%, అస్సాం(4)లో 80.73%, బిహార్(5)లో 59.97%, త్రిపుర(1)లో 79.57% పోలింగ్ నమోదైంది. వీటితోపాటు దాద్రానగర్ హవేలీ, డయ్యూ డామన్‌ల్లోని ఒక్కో సీటు కూడా పోలింగ్ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment