
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కలెక్టర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ విమర్శించారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులకు కూడా ఎలాంటి అధి కారాలు లేకుండా చేశారని, అంతా అధికార పార్టీ నేతలతో ఏర్పాటైన జన్మభూమి కమిటీల కనుసన్నల్లోనే నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘రాష్ట్రంలో మూడేళ్లుగా రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నీరుగార్చి, పాలనాపరంగా ఘోరంగా విఫలమైన బాబు ముస్సోరి వెళ్లి ఐఏఎస్‌లకు ఎలాంటి శిక్షణ ఇస్తారు? జన్మభూమి కమిటీలతో కలెక్టర్ల అధికారాలన్నింటినీ కత్తిరించానని చెబుతారా?’ అని సూటిగా ప్రశ్నించారు.
సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వరప్ర సాద్ విలేకరులతో మాట్లాడారు.ఏపీలో సీఎం కార్యాలయమే రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తోందన్నారు. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విమర్శిస్తే ఇప్పటి వరకు సమాధానమే చెప్పలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఏ మాత్రం విలువ లేదని వరప్రసాద్ విమర్శించారు. రాష్ట్రంలో దారుణంగా పాలన సాగిస్తున్న బాబు ముస్సోరి వెళ్లి ఐఏఎస్‌లకు పాఠాలు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.