
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. 1995 నుంచి 2004 వరకు ఏ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టారో, 2004 నుంచి 2014 వరకు ఎంత ఖర్చు అయ్యిందో బయట పెట్టాలన్నారు.
ప్రాజెక్టులపై టీడీపీ నేతలు, మంత్రులు వక్రభాష్యాలు మానుకోవాలని హితవు పలికారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన జలయజ్ఞం పనులు దాదాపుగా పూర్తయ్యాయని, రాయలసీమ గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీకి లేదని మండిపడ్డారు. రాయలసీమకు చంద్రబాబు సీఎంగా ఏం చేశారని ప్రశ్నించారు.