
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయాన్ని దక్కించుకున్న నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ మరోసారి అధికార పగ్గాలు చేపట్టింది. గురువారం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవ కార‍్యక్రమంలో మోదీ రెండవసారి ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోదీ చేత ప్రమాణం చేయించారు. కేంద్రమంత్రులకు ఆయా శాఖలను ప్రకటించక పోవడంతో క్యాబినెట్‌లో అతి కీలకమైన ఆర్థికమంత్రి పదవి ఎవర్ని వరించనుందన్న ఉత్కంఠకు తెరపడలేదు. అయితే ఈ సాయంత్రం గానీ, రేపు (శుక్రవారం, మే 31) ఉదయం గానీ మంత్రి పదవులను కేటాయించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
రాజ్‌నాథ్ సింగ్, అమిత్‌షా, సదానంద గౌడ , నిర్మలా సీతా రామన్, స్మృతి ఇరానీ, పియూష్ గోయాల్, రాం విలాస్ పాశ్వాన్, నరేంద్ర సింగ్‌తోమర్, రవిశంకర ప్రసాద్, అర్జున్ ముండా తదితరులు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది.
కాగా ఆర్థికమంత్రి పదవి రేసులో అమిత్ షా, పియూష్ గోయల్ తదితర పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ప్రధాని మోదీ తన పోర్ట్‌ఫోలియో వివరాలను అధికారికంగా ప్రకటించేంతవరకు ఈ సస్పెన్స్‌కు తెరపడే ఛాన్సే లేదు. ముఖ్యంగా అనారోగ్య కారణాల రీత్యా తనకు క్యాబినెట్ నుంచి మినహాయింపునివ్వాల్సిందిగా మాజీ ఆర్థికమంత్రి అరుణ జైట్లీ ప్రధానికి లేఖ రాశారు. దీంతో ఈ ఊహాగానాలు మరింత జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment