‘ఆనం’ సాక్షిగా తమ్ముళ్ల గలాటా | Aanam Followers Target To Kannababu Followers | Sakshi
Sakshi News home page

‘ఆనం’ సాక్షిగా తమ్ముళ్ల గలాటా

Published Thu, Nov 30 2017 11:49 AM | Last Updated on Thu, Nov 30 2017 11:50 AM

Aanam Followers Target To Kannababu Followers - Sakshi

నాయకులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఆనం

ఆత్మకూరు: ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఇన్‌చార్జి కన్నబాబు వర్గాల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వివరాలిలా ఉన్నాయి. సోమశిల ఉత్తరకాలువ ద్వారా జరుగుతున్న నీటి సరఫరాను పరిశీలించేందుకు బుధవారం ఆనం ఆత్మకూరు చెరువు వద్దకు వచ్చారు. తొలుత పూజలు చేసి నీటి సరఫరాపై సోమశిల ప్రాజెక్ట్‌ ఈఈ, సాగునీటి శాఖ డీఈలతో మాట్లాడారు. ఈ క్రమంలో కన్నబాబు వర్గానికి చెందిన చెరువు సాగునీటి సంఘం ఉపాధ్యక్షుడు మాదాల మస్తాన్‌నాయుడు మాట్లాడేందుకు ప్రయత్నించగా సాగునీటి సంఘం అధ్యక్షుడు ఎక్కడంటూ ఆనం ప్రశ్నించారు. అదే సమయంలో ఆనంకు అనుకూలంగా ఉన్న రైతులు ‘గతంలో 2వ నంబర్‌ తూముకు నీళ్లు వచ్చేవని, ఇప్పుడు ఎందుకు రావడం లేదని’ ఉపాధ్యక్షుడిని నిలదీశారు.

‘మీ వల్లే నీళ్లు రావడం లేదు, మా పంటలు ఎండిపోతున్నాయి, ఆ తూము కింద 350 ఎకరాలు సేద్యం నీరు లేక ఆపామని’ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరుకు చెందిన ఆనం అనుకూలుడు, రైతు చిట్టమూరు వెంకురెడ్డి ‘మీ వంటి వాళ్లు సాగునీటి సంఘం ఉపాధ్యక్షుడిగా పనికి రారని, మీ అధ్యక్షుడు నీళ్ల సమస్య అడుగుతారనే ఇక్కడికి రాలేదని, ఇద్దరూ వెంటనే రాజీనామా చేయాలని’ చెప్పారు. స్పందించిన నీటి సంఘం ఉపాధ్యక్షుడు ‘మేము రాజీనామా చేస్తాం. మీకిష్టమొచ్చిన వారిని పెట్టుకోండి’ అని రుసరసలాడారు. అధికారులు మాత్రం 75 క్యూసెక్కుల నీటిని వదిలామని అంటున్నారే తప్ప ఒక్క చుక్క కూడా చెరువుకు నీరు రావడం లేదని, పొలాలు బీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

తనిఖీ చేయాలి
ఆనం మాట్లాడుతూ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు కాలువపై తనిఖీలు చేయాలని, ఆత్మకూరు చెరువుకు కచ్చితంగా 60 క్యూసెక్కులు ఇవ్వాల్సిందేన్నారు. ఇరిగేషన్‌ శాఖ అధికారులు డీఈ, ఏఈ, సోమశిల ప్రాజెక్ట్‌ డీఈ,  కమిషనర్‌ శ్రీనివాసరావు, డీఎస్పీ రామాంజనేయులరెడ్డి, టీడీపీ నాయకులు డాక్టర్‌ ఆదిశేషయ్య, ఐవీ రమణారెడ్డి, చల్లా రవి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల శ్రీహరినాయుడు పాల్గొన్నారు.

ఒకేలా ఉన్నామని చెబుతున్నా..
ఆనం వర్గీయులు తమ వారిపై విమర్శలు చేయడంపై కన్నబాబు వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలినుంచి పార్టీలో ఉన్న తమను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఈ వ్యవహారం పార్టీలో చర్చకు దారితీసింది. గతంలో ఈ రెండు వర్గాల నాయకులు వాదనలకు దిగిన సందర్భాలున్నాయి. పైకి తామంతా ఒకేలా ఉన్నామని చెబుతున్నా అవకాశం చిక్కినప్పుడల్లా ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. వీరి వల్ల పార్టీ పరువుపోతోందని కొందరు జిల్లా పార్టీ నేతలకు చెబుతున్నారు. ఒకటి, రెండు సార్లు వీరి వ్యవహారం అధిష్టానం దృష్టికి వెళ్లింది. కాగా ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఆనం వర్గీయులు కన్నబాబు వర్గ నేతలపై విరుచుకుపడ్డారని ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement