న్యూఢిల్లీ : పోలింగ్‌కు ఓ పది రోజుల ముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. ఆప్ ఎమ్మెల్యే ఒకరు శుక్రవారం బీజేపీలో చేరారు. కాషాయ పార్టీ ఆప్ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది అంత సులభం కాదని కేజ్రీవాల్ ప్రకటించిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. గాంధీ నగర్ ఆప్ ఎమ్మెల్యే అనిల్ బాజ్‌పేయి పార్టీని వీడి.. బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి విజయ్ గోయల్ సమక్షంలో శుక్రవారం అనిల్ బాజ్‌పేయి కాషాయ కండువా కప్పుకున్నారు. ఏడు లోక్‌సభ స్థానాలున్న ఢిల్లీలో మే 12న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆప్ ఎమ్మెల్యే బీజేపీలో చేరడం కేజ్రీవాల్‌కు తీవ్ర నష్టం కల్గిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అయితే బీజేపీ పార్టీ తమను అధికారంలోంచి దించడానికి ప్రయత్నిసుందని.. ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలకు రూ. 10 కోట్లు ఆఫర్ చేసి ప్రలోభాలకు గురి చేస్తోందని కొన్ని రోజుల క్రితమే ఢిల్లీ డిప్యూటి సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. కేజ్రీవాల్ కూడా ఈ రోజు దీనిపై స్పందించారు. ‘గోయెల్‌జీ.. బేరసారాలు ఎంత వరకు వచ్చాయి. మీరు ఎంత ఇస్తున్నారు. మా ఎమ్మెల్యేలు ఎంత డిమాండ్ చేస్తున్నారు. మోదీజీ.. ఆయా రాష్ట్రాల్లో మీ ప్రత్యర్థి పార్టీలు ఏర్పాటు చేసిన ప్రతి ప్రభుత్వాన్ని కూలదోస్తారా? ఇదేనా మీ దృష్టిలో ప్రజాస్వామ్యమంటే? అయినా ఎమ్మెల్యేలను కొనడానికి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారు. మా ఎమ్మెల్యేల్ని కొనడానికి మీరు చాలా సార్లు ప్రయత్నించారు. అయినా ఆప్ ఎమ్మెల్యేలను కొనడం అంత సులభం కాదు’’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
అయితే కేజ్రీవాల్ వ్యాఖ్యలను విజయ్ గోయల్ ఖండించారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదని విజయ్ గోయల్ స్పష్టం చేశారు. ఆప్ విధానాలతో విసిగిపోయిన 14 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రి విజయ్ గోయెల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment