
జింద్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ప్రతిపాదించిన కూటమిలో చేరబోమని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆ కూటమిలో చేరాలనుకుంటున్న పార్టీలు ఇప్పటిదాకా దేశాభివృద్ధిలో ఎలాంటి పాత్ర పోషించలేదని అన్నారు. గురువారం రోహ్‌తక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ విలేకర్లతో మాట్లాడారు. హరియాణాలోని అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో ఆప్ పోటీచేస్తుందని తెలిపారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి తీసుకుంటున్న అన్ని కార్యక్రమాలకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఢిల్లీతో పోలిస్తే హరియాణా అభివృద్ధిలో చాలా వెనకబడిందని, అభివృద్ధిపై ఢిల్లీ నుంచి హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ పాఠాలు నేర్చుకోవాలని హితవు పలికారు.