పీఎం కేర్స్‌ ఫండ్‌కి చైనా విరాళాలు | Abhishek Singhvi Slams Narendra Modi Over China Funds To PM Cares Fund | Sakshi
Sakshi News home page

పీఎం కేర్స్‌ ఫండ్‌కి చైనా విరాళాలు

Published Mon, Jun 29 2020 2:10 AM | Last Updated on Mon, Jun 29 2020 2:10 AM

Abhishek Singhvi Slams Narendra Modi Over China Funds To PM Cares Fund - Sakshi

న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కి చైనా నిధులు అందాయని బీజేపీ ఆరోపణల్ని తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీపై కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగింది. భారత్, చైనా మధ్య ఉద్రిక్తత నెలకొన్న ఈ సంక్షోభ పరిస్థితుల్లో పీఎం కేర్స్‌ ఫండ్‌కి చైనా సంస్థలు ఇస్తున్న విరాళాలు కేంద్రం ఎందుకు స్వీకరిస్తోందని ప్రశ్నించింది. ప్రధానమంత్రి మోదీ చైనాని ఒక దురాక్రమణదారుడిగా ఎందుకు చూడడం లేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ నిలదీశారు. లద్దాఖ్‌లో మన భూభాగాన్ని ఆక్రమిస్తున్న వారికి తగిన బుద్ధి చెబుతామని మోదీ మన్‌ కీ బాత్‌లో చెప్పిన కాసేపటికే సింఘ్వీ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

గత ఆరేళ్లలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో 18సార్లు సమావేశమైన మోదీ ఆ దేశ దురాక్రమణని ఎందుకు గుర్తించలేదన్నారు. చైనాని దురాక్రమణదారుడుగా మోదీ అంగీకరించి తీరాలన్నారు. పీఎం కేర్స్‌ ఫండ్‌కి చైనా సంస్థల నుంచి నిధులు స్వీకరించడం జాతీయ భద్రతకి పెను ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. చైనా కంపెనీల నుంచి కోట్లాది రూపాయల నిధులు స్వీకరిస్తూ ఆ దేశం చేస్తున్న ఆక్రమణల నుంచి దేశాన్ని ఎలా రక్షించగలరో ప్రధాని సమాధానం చెప్పాలని అన్నారు.   పీఎం కేర్స్‌కి చైనా కంపెనీలైన హవాయి రూ. 7 కోట్లు, టిక్‌టాక్‌ రూ. 30 కోట్లు, పేటీఎం రూ.100 కోట్లు, షియామీ రూ.15 కోట్లు, ఒప్పో రూ. కోటి ఇచ్చినట్టుగా సింఘ్వీ ఆరోపించారు.

సీపీసీతోనూ బీజేపీకి అనుబంధం !
కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ)తో బీజేపీకి ఎప్పట్నుంచో సత్సంబంధాలున్నాయని సింఘ్వీ ఆరోపించారు. 2007 నుంచి బీజేపీ ఈ బంధాలను కొనసాగిస్తోందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కరీ, అమిత్‌ షా చైనాతో మంచి సంబంధాలు ఉన్నావారేనని అన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో 13 ఏళ్లుగా సత్సంబంధాలున్న రాజకీయ పార్టీ మరొకటి దేశంలో లేదని నిందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement