సాక్షి, అమరావతి: రాష్ట్ర ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. తమ హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా ఓపిగ్గా నిరీక్షించారు. ఓటు అనే తమ ఆయుధాన్ని ఉపయోగించారు. తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ప్రధానంగా బరిలో ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ, విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల హోరాహోరీ ప్రచారం అనంతరం.. రాష్ట్రంలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాంకేతికంగా సాయంత్రం ఆరుగంటలకే పోలింగ్ సమయం ముగిసినా పలు ప్రాంతాల్లో ఈవీఎంల మొరాయింపు, తదితర కారణాలతో కొన్నిచోట్ల పోలింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. పోలింగ్ సమయం ముగిసేలోగా క్యూ లైన్లలో నిలబడిన ప్రతి ఒక్కరినీ ఓటు వేసేందుకు అనుమతించారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగాయి. మిగతాచోట్ల చెదురు మదురు సంఘటనలు, స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. అధికార పార్టీకి చెందిన నేతలు, అభ్యర్థులు, చివరకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు పోలింగ్ బూత్‌లను అక్రమించి రిగ్గింగ్, అక్రమాలకు పాల్పడినప్పటికీ ఎక్కడికక్కడ ప్రజలే అడ్డుకున్నారు.
6 గంటలకు 72.65 శాతం పోలింగ్
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయానికి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్ల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ జరిగిన పోలింగ్ గణాంకాలు మాత్రమే అందాయి. కాగా ఆరు గంటల సమయానికి 72.65 శాతం పోలింగ్ నమోదైందని, మొత్తంమీద 80 శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది గురువారం సాయంత్రం తెలిపారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 85 శాతం పోలింగ్ నమోదైంది. ఉద్యోగులకు తెలియక కొన్నిచోట్ల.. మరికొన్ని చోట్ల సాంకేతిక సమస్యల కారణంగా.. మొత్తం మీద 384 ఈవీఎంలు మొరాయించాయని, అలా మొరాయించిన వాటిని సరిచేశామని, కొన్నిచోట్ల సరిచేయడానికి మూడు నుంచి నాలుగు గంటలు సమయం పట్టిన మాట వాస్తవమేనని సీఈఓ ద్వివేది తెలిపారు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి సంఘటనలు జరగకపోవడంపై, అలాగే ఓటింగ్ శాతం పెరగడం పై సీఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయని, ఇద్దరు మృతి చెందారని ఆయన తెలిపారు.
సీఈసీ నిర్ణయం మేరకే రీపోలింగ్
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజవర్గంలో హత్య జరిగిన తరువాత పోలింగ్ శాతం తగ్గిందని, అలాగే చిత్తూరు జిల్లా పూతలపట్టులో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ఆగిపోయిందని ద్వివేది చెప్పారు. పోలింగ్ శాతం తగ్గిన, పోలింగ్ ఆగిపోయిన రెండుచోట్ల మిగిలిన వారి కోసం పోలింగ్‌ను నిర్వహించడంతో పాటు రీ పోలింగ్ ఎక్కడైనా అవసరమా? లేదా అనేదానిపై ప్రిసైడింగ్ అధికారులు, కేంద్ర పరిశీలకులు నాలుగైదు డాక్యుమెంట్లను పరిశీలించి శుక్రవారం నివేదికను పంపిస్తారని తెలిపారు. ఆ నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపిస్తానని, ఈ ప్రాంతాల్లో రీ పోలింగ్ శుక్రవారం వారు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని వివరించారు. అలాగే రాజకీయ పార్టీలు ఎన్నికల వాయిదా, రీ పోలింగ్‌పై ఫిర్యాదులు చేశాయని, వాటిని కూడా పరిశీలిస్తామని ద్వివేది చెప్పారు. ఏడు చోట్ల ఈవీఎంలను ధ్వసం చేశారని, వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆరు చోట్ల మాక్ పోలింగ్ చేసిన తరువాత ఓట్లను క్లియర్ చేయలేదన్నారు. మాక్ పోలింగ్‌లో 50 ఓట్లు మాత్రమే ఉంటాయని, ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్ల సమ్మతితోనే పోలింగ్‌ను కొనసాగించినట్లు చెప్పారు. ఆరు గంటలకు క్యూలో ఉన్న వారందరూ తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పించామన్నారు.
పోలింగ్‌ను ఎక్కడా బహిష్కరించలేదు..
పోలింగ్ బహిష్కరణ ఎక్కడా జరగలేదని సీఈవో తెలిపారు. ఈవీఎంలు పనిచేయని చోట పోలింగ్‌ను వాయిదా వేయాలని రాజకీయ పార్టీలు చేసే వ్యాఖ్యలపై స్పందించబోనని ఆయన అన్నారు. కర్నూలు జిల్లాలో కొందరు అసెంబ్లీకి ఓటు వేసి పార్లమెంట్‌కు ఓటు వేయలేదనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.
ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం
రాష్ట్రంలో ఈవీఎంలను భద్రపరిచేందుకు 68 స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన తరువాత ఈవీఎంలకు సీల్ వేసి ఆయా ప్రాంతాల్లోని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన 319 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 2,118 మంది అభ్యర్థుల భవిష్యత్ ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అయితే ప్రజా తీర్పు కోసం మే 23వ తేదీ వరకు వేచి చూడాల్సి ఉంది. 2014లో జరిగిన ఎన్నికల్లో మొత్తం మీద 77.96 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం.
సీఎం ఆరోపణలను ఖండించిన సీఈఓ
పోలింగ్ ప్రారంభమైన రెండు గంటలకే ముఖ్యమంత్రి చంద్రబాబు 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదంటూ చేసిన ఆరోపణలను సీఈఓ ద్వివేది ఖండించారు. అలాగే ఒక గుర్తుకు ఓటు వేస్తే మరో గుర్తుకు పడుతోందనడంపైనా ఆయన ఘాటుగా స్పందించారు. 30 శాతం ఈవీఎంలంటే ఏకంగా 27 వేల ఈవీఎంలని, ఇలాంటి తప్పుడు లెక్కలను అవాస్తవాలను నమ్మవద్దని ఆయన అన్నారు. కేవలం 384 ఈవీఎంలలో మాత్రమే సాంకేతిక సమస్యలు తలెత్తాయని, వాటిని సరిచేయడం లేదా కొత్తవి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇది మొత్తం ఈవీఎంలలో పాయింట్ 3 శాతమేనని ఆయన పేర్కొన్నారు. ఏవైనా ఆరోపణలు చేస్తే ఆధారాలు చూపించాలన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయరాదన్నారు. ఒక గుర్తుకు ఓటు వేస్తే మరో గుర్తుకు వెళుతోందనడం పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు. పబ్లిసిటీ కోసం, రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి పుకార్లు చేస్తున్నారని, ఇలాంటివి నమ్మవద్దని ఆయన సూచించారు.
ఓటెత్తిన ఆంధ్ర
Published Fri, Apr 12 2019 3:06 AM | Last Updated on Fri, Apr 12 2019 8:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment