
కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి
హైదరాబాద్ : ప్రతిపక్షాల గొంతు నొక్కడం, రాజకీయ హత్యలు, దళితులపైన దాడులు, ధర్నా చౌక్ ఎత్తివేయడం, నల్గొండ మున్సిపల్ చైర్మన్ భర్తను చంపించడం..ఇవే తెలంగాణ సీఎం కేసీఆర్ సాధించిన విజయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..బీజేపీతో కేసీఆర్‌కు ఉన్న లోపాయకారి ఒప్పందాలు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు?. బడ్జెట్లో హైదరాబాద్ మెట్రో రైల్ ఊసే లేదని, చేవెళ్ల ప్రాణహిత, కాళేశ్వరానికి నిధులు విడుదల చేయలేదని, ఉద్యోగాల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు.
బంగారు తెలంగాణ అని మభ్యపెడుతూ మళ్లీ అధికారంలోకి రావడంపైనే కేసీఆర్ దృష్టి పెట్టారని విమర్శించారు. అరుణ్ జైట్లీ బడ్జెట్ ఒక ఎన్నికల బడ్జెట్ అని, ఈ బడ్జెట్ వల్ల కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే లాభమన్నారు. ఎన్డీయే హయాంలో రైతుల పరిస్థితి ఘోరంగా మారిందన్నారు. రుణమాఫీ చెయ్యడానికి జైట్లీకి చేతులు రావడంలేదని వ్యాఖ్యానించారు.
ఆంద్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలో 80 శాతం హామీలు అమలు కాలేదని, ఎయిమ్స్‌కి నిధులు రాలేదని, బయ్యారం ఊసేలేదని, హైకోర్ట్ విభజన ప్రస్తావన లేదని మండిపడ్డారు. బడ్జెట్ విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విఫలమయ్యారని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని లేదంటే ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment