
మద్దాలి శివారెడ్డి అనే నేను..
సాక్షి, హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా ఐదేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘రేసుగుర్రం’లో విలన్ మద్దాలి శివారెడ్డి గుర్తున్నాడు కదా. ఎలాగైనా తాను ఎమ్మెల్యేను కావాలని నామినేషన్ వేయడానికి వెళ్తుంటే హీరో అల్లు అర్జున్ అడ్డుపడి చితక్కొట్టేస్తాడు. నామినేషన్ వేయలేకపోయినా ఆ తరవాత ఎలాగోలా మంత్రి అయిపోతాడు. ‘మద్దాలి శివారెడ్డి అనే నేను..’ అంటూ పదవీ ప్రమాణ స్వీకారం చేసి పొలిటికల్ పవర్‌ను ఎంజాయ్ చేయాలనే కోరికను తీర్చుకుంటాడు. అది సినిమా. అయితే, నిజ జీవితంలో అలాగే రాజకీయాల్లో గెలిస్తే ఆ అనందం ఎలా ఉంటుంది? ఉహించుకుంటేనే ఏదో థ్రిల్లింగ్‌గా ఉంది కదా! అలాంటి థ్రిల్లింగ్‌ను పొందాడు రేసుగుర్రం విలన్ మద్దాలి శివారెడ్డి అలియాస్ రవికిషన్.
భోజ్‌పురి స్టార్ రవికిషన్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి 3లక్షల మెజారిటితో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎంపీగా లోక్‌సభలో ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. అయితే ఆయన చేసిన ప్రమాణ స్వీకారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రేసుగుర్రం సినిమాలో మంత్రిగా ప్రమాణం చేసిన మాటలను, లోక్‌సభలో ప్రమాణం చేసిన మాటలను పక్కపక్కన చేర్చిన వీడియో ఒకటి వైరల్ అయింది. ‘లోక్‌సభలో మద్దాలి శివారెడ్డి’ ‘ ఏయ్ నిజంగానే ఎంపీ అయ్యా’ అని రాసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘హేయ్ విలన్.. హీరో అయ్యాడు’, ‘సినిమాలో విలన్ అయినా..నిజజీవితంలో హీరోలా ప్రజలకు సేవ చేయాలి’,‘మద్దాలి శివారెడ్డి.. అనుకున్నది సాధించావ్ పో’ అంటూ రవికిషన్‌పై తెలుగు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.