మంగళవారం ఢిల్లీలో సోనియాను కలిసిన అధిర్ రంజన్
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌కు చెందిన సీనియర్ లోక్‌సభ సభ్యుడు అధిర్ రంజన్ చౌధురి లోక్‌సభలో కాంగ్రెస్ నేతగా నియమితులయ్యారు. అదేవిధంగా, పార్టీ చీఫ్ విప్‌గా కేరళకు చెందిన కె.సురేశ్‌ను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ నియామకపు ఉత్తర్వులను లోక్‌సభ సెక్రటేరియట్‌కు పార్టీ వర్గాలు అందజేశాయి. ఇప్పటి వరకు ఐదుసార్లు ఎంపీ అయిన అధిర్ రంజన్ ఇటీవలి ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా బెహరంపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.
లోక్‌సభలో పార్టీ నేతగా తనను నియమించడంపై అధిర్ రంజన్ కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని విలేకరులతో అధిర్ అన్నారు. సామాన్య ప్రజల తరఫున పార్లమెంట్‌లో గళం వినిపిస్తానన్నారు. కేరళలోని మావెలిక్కర నుంచి ఎన్నికైన సురేశ్ కూడా పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు వారిద్దరూ యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నివాసంలో సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
సాయంత్రం యూపీఏ నేతలతో కలిసి వారంతా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 1999 నుంచి అధిర్ రంజన్ చౌధురి వరుసగా లోక్‌సభకు ఎన్నికవుతూ వస్తున్నారు. అంతకుముందు 1996–1999 సంవత్సరాల్లో ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా చేశారు. గత లోక్‌సభలో కాంగ్రెస్ నేతగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే ఇటీవలి ఎన్నికల్లో ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో కాంగ్రెస్ తాజా నియామకం చేపట్టింది. ప్రతిపక్ష నేత అర్హత సాధించేందుకు అవసరమైన 10 శాతం సీట్లు కాంగ్రెస్‌కు లోక్‌సభలో లేకపోవడంతో ఆ హోదా దక్కలేదు. ఇలాంటి పరిణామం ఎదురుకావడం ఆ పార్టీకి వరుసగా ఇది రెండోసారి.
Comments
Please login to add a commentAdd a comment