న్యూఢిల్లీ: 17వ లోక్‌సభ తొలి సమావేశం సోమవారం నుంచి ప్రారంభమవుతున్నా సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఎవరు ఉండాలనేదానిపై ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదు. అలాగే సభలో ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు వివిధ ప్రతిపక్ష పార్టీలను సమన్వయం చేసుకునే విషయంలోనూ ముందడుగు పడలేదు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ప్రతిపక్ష పార్టీల సమావేశమే జరగలేదు. దీనిపై కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ చాలా ప్రతిపక్ష పార్టీలు సభలో తమ పార్టీ పక్ష నాయకుడిని ఎంపిక చేయలేదనీ, ఆ పని పూర్తయిన అనంతరం ప్రతిపక్ష పార్టీల భేటీ ఉండొచ్చని అన్నారు.
ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌తోపాటు కాంగ్రెస్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆధిర్ రంజన్ చౌధురీ, కేరళ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు సురేశ్ హాజరయ్యారు. దీంతో వీరిద్దరిలో ఎవరో ఒకరిని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా నియమించే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ, ఎదురుగాలిలోనూ తిరువనంతపురం నుంచి వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ తరఫున గెలిచిన శశి థరూర్‌ల పేర్లు కూడా ఈ రేసులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment