Parliament Winter Sessions: ఉభయ సభలు వాయిదా | Parlament Winter Session Meetings Updates | Sakshi
Sakshi News home page

Parliament Winter Sessions: పార్లమెంట్‌ సమావేశాలు లైవ్‌ అప్‌డేట్స్‌.. ఉభయ సభలు వాయిదా

Published Wed, Dec 6 2023 11:04 AM | Last Updated on Wed, Dec 6 2023 8:31 PM

Parlament Winter Session Meetings Updates  - Sakshi

లైవ్ అప్‌డేట్స్..


►పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా.. తిరిగి రేపు ఉదయం 11గం. ప్రారంభం


►పీవోకే అంశంతో అట్టుడికిపోయిన పార్లమెంట్‌. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌దేనని షా ప్రకటన.  పీవోకే అంశంలో దేశ తొలి ప్రధాని నెహ్రూను నిందించిన కేంద్ర హోం శాఖమంత్రి అమిత్‌ షా. ప్రతిపక్ష సభ్యుల వాకౌట్‌. ప్రధాని మోదీ అక్కడి ప్రజల బాధ అర్థం చేసుకున్నారని.. 70 ఏళ్లుగా దక్కని న్యాయం అందిస్తారని షా వ్యాఖ్యలు. బయటకు వచ్చాక.. అమిత్‌ షా ప్రసంగంపై విమర్శలు, సెటైర్లు సంధించిన విపక్ష సభ్యులు. 

  

►కశ్మీర్‌ బిల్లులతో వారికి న్యాయం..

‘‘70 ఏళ్లుగా అన్యాయానికి, అవమానాలకు గురైన వారికి న్యాయం చేసేందుకు ఈ బిల్లులను ప్రవేశపెడుతున్నాను. ఏ సమాజంలోనైనా వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావాలి. ఈ క్రమంలో వారి గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా చూడాలి. అదే భారత రాజ్యాంగం ప్రాథమిక ఉద్దేశం. ప్రస్తుతం చాలా మంది కశ్మీరీలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకొంటున్నారు. ఈ బిల్లుతో వారికి హక్కులు, ఉద్యోగాలు, విద్యావకాశాలు, రిజర్వేషన్ల సాయంతో ఎన్నికల్లో నిలబడే అవకాశాలు వస్తాయి’’ అని అమిత్‌షా వెల్లడించారు.




► దేశంలో 1980 దశకంలో ఉగ్రవాదం పెరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో ఓ భాగాన్ని ఆక్రమించుకుని అక్కడి ప్రజలను నిరాశ్రయుల్ని చేశారని మండిపడ్డారు. కశ్మీరీ పండిట్‌లు తమ సొంత దేశంలో శరణార్ధులుగా బతికారని దుయ్యబట్టారు. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 46,631 కుటుంబాలు, 1,57,968 మంది తమ సొంత స్థలాలను వదిలి వచ్చారని తెలిపారు. ప్రస్తుత బిల్లులతో వారందరికి  హక్కులు కల్పించబడతాయని చెప్పారు.  

► పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే భారత్‌లో అంతర్భాగమేనని ప్రకటించారు. జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో పీఓకేకు ప్రత్యేక స్థానాలు కూడా కేటాయించారు. పీఓకేకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023పై పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు. అన్యాయం జరిగిన వారికి న్యాయం చేకూర్చడానికి మాత్రమే ఈ బిల్లులను తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు. 

► జమ్ముకశ్మీర్‌, లఢక్‌లో గణనీయ అభివృద్ధి జరిగిందని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు.

► మిచౌంగ్ తుఫాను నష్టాన్ని అంచనా వేయడానికి తమిళనాడుకు కేంద్ర బృందాన్ని పంపాలని డీఎంకే ఎంపీ టిఆర్ బాలు లోక్‌సభలో కోరారు. మిచౌంగ్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించడాన్ని పరిశీలించాలని విన్నవించారు.

► డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ గోమూత్ర వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని పేర్కొంటూ.. ప్రజల మనోభావాలు దెబ్బతింటే ఉపసంహరించుకుంటాను అని తెలిపారు

► డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ గోమూత్ర వ్యాఖ్యలపై సభలో గందరగోళం నెలకొంది. దీంతో లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.

►కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడి హత్యపై కేంద్ర మంత్రి కైలాష్ చౌధరి స్పందించారు. రాజస్థాన్‌లో రౌడీయిజానికి స్థానంలేదని చెప్పారు. దోషులకు కఠిన శిక్ష విధించాలని అన్నారు. 

► ఇండియా కూటమి భేటీ వాయిదా పడటంపై బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. జ్వరం కారణంగా తాను హాజరుకాలేకపోతున్నానని మాత్రమే చెప్పినట్లు పేర్కొన్నారు. మరో మీటింగ్ వెళ్తానని చెప్పారు. కూటమి ముందుకు వెళుతుందని తెలిపారు. 

► పార్లమెంట్ సమావేశాలకు కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ హాజరయ్యారు. పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్నారు. 

► ఉత్తరాది రాష్ట్రాలను డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ గోమూత్ర రాష్ట్రాలు అని అభివర్ణించడంపై బీజేపీ ఎంపీ సాధ్వీ నిరంజన్ జ్యోతి తప్పుబట్టారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ లేదని సెంథిల్ చేసిన వ్యాఖ్యలపై సాధ్వీ మండిపడ్డారు. కర్ణాటకలో ఎక్కువ ఎంపీలు బీజేపీకి చెందినవారేనని మర్చిపోవద్దని గుర్తుచేశారు. తెలంగాణలోనూ ముగ్గురు ఎంపీలు, ఇటీలవ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు విజయం సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. దేశాన్ని విభజించే వ్యాఖ్యలు చేయరాదని హితువు పలికారు. సెంథిల్ వ్యాఖ్యలపై సోనియాగాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

►పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడవ రోజు ప్రారంభం అయ్యాయి. సమావేశాలకు హాజరు కావడానికి పార్లమెంట్ భవనం వద్దకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వచ్చారు. 

► డిసెంబర్‌ 2 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 22 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు ఈ సెషన్ జరగనుండగా.. ఈ సెషన్‌లో మొత్తం 15 సమావేశాలు జరగనున్నాయి. 

►అంతే కాకుండా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనేక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లు, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుతో సహా 7 కొత్త బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

►అంతేకాదు IPC, CRPC , క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ , ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ప్రతిపాదిత చట్టాలను కూడా ఈ సమావేశాలలో సమ్పర్పించనున్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో ఇండియన్ జస్టిస్ కోడ్ బిల్లు-2023, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ బిల్లు-2023 , ఇండియన్ ఎవిడెన్స్ బిల్లు-2023తో సహా వివిధ బిల్లులపై  చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement